సీఎంల భేటీపై వైసీపీ బురద చల్లుతోందా ? ఓటమి తాలూకు మంటేనా ?

ఘోరఓటమిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారా ? సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అవటాన్ని జీర్ణయింకోలేకపోతున్నారా ?

Update: 2024-07-09 10:42 GMT

ఘోరఓటమిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారా ? సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అవటాన్ని జీర్ణయింకోలేకపోతున్నారా ? అంటే అవుననే అనుకోవాల్సొస్తోంది. ముఖ్యమంత్రుల భేటీపై రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీమంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వాళ్ళల్లోని ఉక్రోషాన్ని తెలియజేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రుల భేటీ అయినందుకు సంతోషించాల్సిందిపోయి సమావేశంపై బురదచల్లేయటం చాలా అన్యాయం.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన సమస్యలు అలాగే ఉండిపోయాయి. సమస్యను వెంటనే పరిష్కరించుకోకపోతే అది పరిష్కరించలేని వివాదాంగా మారిపోతుంది. సమస్యలను పెంచుకుంటే పోవటం వల్ల ముఖ్యమంత్రులు, పార్టీలు, నేతలు బాగానే ఉంటారు కాని నష్టపోయేది రాష్ట్రాలు, ప్రజలే. 2014లో విభజన జరిగిన దగ్గర నుండి నాలుగు రోజుల క్రితంవరకు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం కూర్చుని మాట్లాడుకున్నది లేదు. 2014లో సీఎంలు అయిన చంద్రబాబు, కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగుండేవి. కాబట్టి వీళ్ళు కూర్చుని మాట్లాడుకునేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత కేసీయార్-జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరి సన్నిహితులే కాని సమస్యల పరిష్కారానికి ఒక్కసారి కూడా కూర్చోలేదు.

తర్వాత రేవంత్-జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నా మీటింగ్ విషయంలో ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే సమస్యల పరిష్కారానికి భేటీ జరగాలని డిసైడ్ అయ్యింది. సమస్యల పరిష్కారానికి సుముఖంగా ఉన్నట్లు రేవంత్ ప్రకటించారు. రేవంత్ ప్రకటించగానే చంద్రబాబు లేఖరాశారు. దాని ఫలితమే మొన్నటి 5వ తేదీన ఇద్దరు సీఎంలతో పాటు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశం. రెండున్నర గంటల భేటీలో సమస్యలు ఏమున్నాయనే విషయాన్ని చర్చించుకున్నారు. సమస్యల పరిష్కారానికి మూడు అంచెల్లో కమిటీలను వేయాలని డిసైడ్ చేశారు.

దీన్నే భరత్, అంబటి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళిద్దరు మీడియాతో మాట్లాడుతు ముఖ్యమంత్రులు ఇద్దరు ఎందుకు భేటీ అయ్యారో ప్రజలకే కాదు చివరకు సీఎంలకు కూడా అర్ధం కావటంలేదన్నారు. సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ నుండి ఎందుకు పారిపోయి విజయవాడకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. జరిగిన చర్చల్లో రెండు రాష్ట్రాలకు మంచి జరిగుంటే సీఎంలు ఆ విషయాలను ఎందుకు జనాలకు చెప్పలేదంటు పెద్ద లాజిక్ లేవనెత్తారు. విద్యుత్, నీటి సమస్యలు, బకాయిలు, ఆస్తులు, అప్పుల సమస్యలపై సమావేశంలో ఏమి పరిష్కారాలు చూపించారని నిలదీశారు.

వీళ్ళ ప్రశ్నల్లోనే వీళ్ళ ఉక్రోషం బయటపడుతోంది. పదేళ్ళుగా పేరుకుపోయిన అనేక సమస్యలకు ఒక్కరోజు సమావేశంలోనే పరిష్కారం సాధ్యమా ? కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తే వివాదాన్ని పరిష్కరించటానికే రోజులు పడుతుంది. ఒక్కోసారి పరిష్కారం కాక కొట్టుకుంటున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు. అలాంటిది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కారించుకోవటం అంత సులభంకాదు. కాకపోతే సమస్యల పరిష్కారానికి చర్చలకు మించిన వేదిక లేదు. కాబట్టి ఎన్నిసార్లయినా సమావేశాలు జరగాల్సిందే తప్పదు. సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎంలు అనుకుని భేటీ అవటం శుభపరిణామమే. గడచిన పదేళ్ళలో అసలు భేటీకే ప్రయత్నాలు జరగలేదన్న విషయాన్ని అంబటి, మార్గాని మరచిపోయినట్లున్నారు. నిజానికి విభజన సమస్యల పరిష్కారం సాధ్యమయ్యేది కాదు. నీటి సమస్యలను పరిష్కరించాల్సింది కేంద్రంలోని సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ)యే కాని ముఖ్యమంత్రులు కాదు. విద్యుత్ బకాయిల సమస్య కూడా అంత తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదు. ఆస్తులు, అప్పుల పరిష్కారం కూడా అంత సులభంకాదు.

విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది పోయింది విభజన సమస్యల వ్యవహారం. సమస్యల పరిష్కారంలో భాగంగా ఏ సీఎం కాస్త తగ్గినా ప్రతిపక్షాలు, మీడియా మీదపడిపోయి నానా గోలచేస్తుంది. ఈ సమస్య చంద్రబాబుకన్నా రేవంత్ కు చాలా ఎక్కువ. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు ఆ ముఖ్యమంత్రికి ముఖ్యం. సమస్యల పరిష్కారంలో రేవంత్ వల్ల తెలంగాణాకు అన్యాయం జరిగిందని అనుకుంటే ప్రతిపక్షాలు అవసరంలేదు ముందు పార్టీలోని వ్యతిరేకులే గోల మొదలుపెట్టేస్తారు. ఇక ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు చేసే యాగీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ విషయాలు బాగా తెలుసు కాబట్టే రేవంత్ చాలా కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. సమావేశంలోనే హైదరాబాద్ లో ఉన్న మూడు భవనాలు ఏపీకి కావాలని చంద్రబాబు అడిగితే కుదరదని కచ్చితంగా రేవంత్ చెప్పేశారు. తప్పదని అనుకుంటే భూమిని కేటాయిస్తాం కొనుక్కోమని చెప్పేశారు.

మొదటి సమావేశం కాబట్టి సమస్యలు ఏమున్నాయో చర్చించారు. ఏ సమస్యల పరిష్కారానికి ఏ స్ధాయిలో చర్చలు జరగాలో డిసైడ్ చేశారు. అందుకనే వివిధ శాఖల ఉన్నతాధికారులతో మొదటి కమిటీని వేశారు. తర్వాత ఇద్దరు చీఫ్ సెక్రటరీలతో రెండో కమిటీని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మూడో కమిటీని వేశారు. మొత్తం సమస్యలెన్ని, ఏ సమస్య ఏ కమిటి స్ధాయిలో చర్చలు జరగాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారానికి కమిటీలను వేయటం మంచిదే కదా. జనాలేమో సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటుంటే వైసీపీ నేతలేమో అసలు సమావేశం జరపటాన్నే తప్పుపడుతుండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడబోతే సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవటాన్ని తట్టుకోలేకపోతున్నారా అనే సందేహం పెరిగిపోతోంది.

Tags:    

Similar News