కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. 23న జమ కానున్న145 కోట్ల నరేగా బకాయిలు

నరేగా పనులు, బిల్లుల చెల్లింపులపై బుధవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;

Update: 2025-08-20 14:52 GMT

ఆగస్టు 23వ తేదీన రూ. 145 కోట్ల నరేగా పెండింగ్‌ బకాయిలను చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్లు, గ్రామస్తుల ఖాతాల్లో బిల్లులను జమ చేయనున్నారు. బుధవారం దీనిపైన సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆ మేరకు అధికారులను ఆదేశించారు. 2014–19 మధ్య కాలంలో పూరితంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులకు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లింపులు జరగలేదని, ప్రత్యేక శద్ద పెట్టిన కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలు మార్లు చర్చించి నిధుల చెల్లింపులకు ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

బుధవారం నరేగా పెండింగ్‌ బిల్లుల అంశంపై సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం క్లోజ్‌ చేసిన 3,54,177 పనులు ప్రస్తుతం ఆన్‌ గోయింగ్‌ వర్కులుగా మార్పుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు చేయడం ద్వారా న్యాయం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. మొత్తం రూ.179.38 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి 5.54 లక్షల పనులను ఆన్‌ గోయింగ్‌ వర్కులుగా నమోదు చేశారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన పంచాయతీ రాజ్‌ శాఖ రూ.179 కోట్లకు గాను రూ.145 కోట్లను ప్రస్తుతం అప్లోడ్‌ చేసింది. ఈమొత్తానికి సంబంధించి ఆర్థిక శాఖ ఎన్‌ఐసికి నిధులు విడుదల చేసింది. పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, గ్రామస్తుల అకౌంట్లలో 23వ తేదీన ఈ మొత్తం నిధులు జమకానున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన ఎస్టిమేషన్‌ లేకపోవడం, ఖర్చు చూపకపోవడం, ఆ పనిచేసిన ప్రాంతాలు పట్టణ ప్రాంతంలో విలీనం కావడం వంటి కారణాలతో ఆయా పనుల బిల్లుల చెల్లింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

గత ప్రభుత్వం కొన్ని బిల్లులకు నిధులు ఇవ్వకుండానే చెల్లించనట్లు రిపోర్టుల్లో చూపిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా వాటికి అవసరమైన చెల్లింపులు జరపడానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయని సీఎంకు తెలిపారు. వీటిపైన కసరత్తు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైసీపీ చెల్లించకుండా నిలిపివేసిన మొత్తం రూ.329 కోట్ల నరేగా బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం దశలా వారిగా చెల్లింపులు చేపట్టింది. ఇందులో భాగంగా 23వ తేదీ జరిపే రూ.145 కోట్ల చెల్లింపులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.250 కోట్లను చెల్లించినట్లు అవుతుంది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారి కష్టాలకు ముగింపు పలికినట్లు అయ్యింది. వేలమంది ఈ చెల్లింపుల ద్వారా ఆర్థిక వెసులుబాటు పొందనున్నారు.

Tags:    

Similar News