చంద్రబాబూ.. ఎంతలో ఎంతగా ఎదిగావయ్యా!
5ఏళ్లలో చంద్రబాబు ఎంతలా మారిపోయారో! మోదీకి కనీస పరిపాలనా సూత్రాలూ తెలియవన్న బాబు ఇప్పుడాయన్ని ఇండియాకే బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. ఎంతలో ఎంత మార్పు..;
By : The Federal
Update: 2025-02-04 01:30 GMT
"నరేంద్ర మోదీ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది. ఆయన సుపరి పాలకుడు కాదు. ఇక్కడున్న మైనారిటీ సోదరుల్ని నేను ఒకే ఒక్క విషయం చెబుతున్నా. మీరు మోదీకి ఓటు వేస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి. ఈ మోదీ మిమ్మల్ని జైలులో పెట్టడానికి ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చాడు, అవునా? కాదా?" (2019 ఏప్రిల్ 3న చిత్తూరులో చంద్రబాబు)
2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు "మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి నేనే. తరువాత ప్రపంచంలోని చాలా దేశాలు ఆయన ప్రవేశాన్ని నిషేధించాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆయన మరోసారి మైనారిటీలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు"
"ప్రధాని మోదీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవు. మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు కోల్పోయాం." ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపే సందర్భంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభలో చంద్రబాబు (2019 ఫిబ్రవరి 13, ఢిల్లీ)
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన ప్రధానిని (మోదీ) తానెప్పుడూ చూడలేదు. టీడీపీపై కేంద్ర వ్యవస్థలతో ఇష్టానుసారంగా దాడులు చేయిస్తున్నారు". 2019 ఏప్రిల్ 5 (ట్వీట్)
ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు. ఇక నరేంద్ర మోదీ చంద్రబాబును అదే 2019 ఏప్రిల్ 1న, పదే పదే 'యూ-టర్న్ బాబు' అని పిలిచి మరీ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రజల డేటాను దొంగిలించడంలో పాలుపంచుకుందని ఆరోపించారు.
"టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా సైబర్ నేరానికి సంబంధించిన కొత్త పనిని ప్రారంభించింది. అది సేవ (సేవా యాప్) చేయడం లేదని, జనానికి సేవ చేయడానికి బదులుగా ప్రజల డేటాను దొంగిలిస్తోంది" అని మోదీ ఆరోపించారు.
2019 మార్చిలో టీడీపీకి సేవలు అందించే ఐటీ కంపెనీపై డేటా దొంగతనం కేసును ప్రస్తావిస్తూ మోదీ చేసిన ఆరోపణ అది. అంతటితోనే మోదీ ఆగలేదు. "అబద్ధాలు, నిరాశ, యూ-టర్న్ అనేవి టీడీపీ ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయి" అని కూడా ఆరోపించారు. "రెండేళ్ల కిందట ఆయన చేసిన ప్రకటన చూడండి, నేడు ఆయన ఏమి చెబుతున్నారో చూడండి. ఇతరులను నిందించడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోయారు. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించలేరు" అని కూడా మోదీ అన్నారు.
'యూ-టర్న్ బాబు'తో ఎంతో గొప్పవారసత్వం ఉన్న ఏపీకి ముప్పు పొంచి ఉందని మోదీ విమర్శించారు. "ఆయన (చంద్రబాబు) తన సొంత వారసత్వం గురించి ఆందోళన చెందుతున్నారు" అని నాయుడు కుటుంబానికి చెందిన మిల్క్ డెయిరీ హెరిటేజ్ ఫుడ్స్‌ను ఉద్దేశించి మోదీ విమర్శిస్తారు.
2014 నుంచి 2018 చివరిదాకా తెలుగుదేశం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. 2018 వరకు ఈ రెండు పార్టీల మధ్య అలాయ్ బలాయ్ బాగానే సాగింది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన తర్వాత చంద్రబాబు, మోదీ పరస్పరం విమర్శలు సంధించుకున్నారు.
5 ఏళ్లు గిర్రున తిరిగాయి. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘోరంగా ఓడింది. పవన్ కల్యాణ్ ప్రోత్సాహం, బీజేపీతో నెరిపిన మాటామంతి ఫలించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఇప్పుడెలా మోదీని పొగుడుతున్నారో చూడండి.
2025 ఫిబ్రవరి 3, ఢిల్లీలో చంద్రబాబు- సరిగ్గా ఐదేళ్ల కిందట తనకు మద్దతు ఇచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా పెట్టిన బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడారు.
‘దేశ రాజధాని ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉండాలి. ఇక్కడ మనమంతా ఊపిరిపీల్చుకోవాలంటే నరేంద్రమోదీ ఆక్సిజన్ అందించాలి. అప్పుడే ఈ నగరంలో ప్రగతి సాధ్యం. మన దేశానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. రాజధాని ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుంది. దేశమంతా స్వచ్ఛభారత్‌వైపు దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికికూపంగా మారింది...’ అని చంద్రబాబు విమర్శించారు.
‘ఢిల్లీ ఓటర్లకు బీజేపీ మంచి మ్యానిఫెస్టో తీసుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న గంగానది శుద్ధిలాగే యమున శుద్ధి నరేంద్ర మోదీకే సాధ్యం’ . ‘ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్‌పటేల్. ఈరోజు అలాంటి బలమైన నాయకుడు నరేంద్రమోదీ. టీం ఇండియాగా ఆయన అందరినీ కలుపుకొని దేశాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలపాలన్న దృఢదీక్షతో ముందుకెళ్తున్నారు. అలాంటి నేతకు మద్దతుగా నిలవాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమించాలి’ అని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘ఎక్కడికెళ్లినా భారతదేశం పేరు మారుమోగుతోంది. మోదీ నాయకత్వం గొప్పగా ఉందని చెబుతున్నారు. ప్రతి ఇంటినుంచి ఒక ఏఐ నిపుణుడు తయారుకావాలన్నది ప్రధాని విజన్. మన దేశం పేరు విశ్వవ్యాప్తమవడానికి ఆయన 11 ఏళ్లుగా శ్రమిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
‘1995లో వెనకబడి ఉన్న హైదరాబాద్‌లా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ తయారైంది. ఇందుకు ఢిల్లీని పదేళ్లు పరిపాలించినవారే కారణం.. ఈ ఎన్నికల్లో అందరూ బీజేపీని గెలిపించాలి. అప్పుడే ఢిల్లీ బాగుపడుతుంది’ అని చెప్పారు. ఒకప్పుడు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడింది కేజ్రీవాల్ పార్టీ ఆప్, టీడీపీలే. కష్టకాలంలో చంద్రబాబుకు అండగా నిలిచిన ఆప్ అధినేత కేజ్రీవాల్ పాలనపై ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వాలు, శత్రుత్వాలు ఉండవు. అవసరాలు మాత్రమే ఉంటాయి. రాజకీయాల్లో తానేంతో నిబద్ధత కలిగిన వ్యక్తినని టీడీపీ అధినేత పదపదే చెబుతుంటారు. ‘రాజకీయాలు ప్రజాసేవ కోసం తప్పితే అధికారం కోసం కాదు’ అని చంద్రబాబు అంటుంటారు. అధికారం కోసం కాకపోతే పొత్తులు, ఎత్తులు ఎందుకు? దేశంలోనే ఉత్తమ పాలకునిగా అభినందించి వరుసగా రెండు సార్లు గెలిపించిన కేజ్రీవాల్ ను ఓడించి బీజేపీకి అధికారం కట్టబెట్టండని చెప్పడం ఎందుకని? సీపీఐ నాయకుడు జె.శ్రీధర్ ప్రశ్నించారు. ప్రస్తుత వ్యవస్థలో రాజకీయ పార్టీల లక్ష్యం అధికారమే గాని మరొకటి కాదని చంద్రబాబుకు తెలియదా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
ఇద్దరికీ 'అవసరాల వ్యాపారమే'
చిత్రమేమిటంటే చంద్రబాబు సమర్థతను ప్రశ్నించిన బీజేపీ నేతలు ఇప్పుడు 'చంద్రబాబు పాలనను చూసి నేర్చుకున్నాం' అంటున్నారు. యూ టర్న్ బాబు, కుటుంబ ఆస్తులు, వారసత్వాన్ని కాపాడుకోవడమే ఆయన ధ్యేయమని విమర్శించిన బీజేపీ అగ్రనేతలే "చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పట్లో, ఇప్పుడూ సుపరిపాలన అందిస్తున్నారు.. ప్రతి క్షణం జనహితం కోసం పనిచేస్తున్నారు" కీర్తిస్తున్నారు.
ఈ రెండు పార్టీల తీరు చూసిన వారు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎంతలా మారిపోయారబ్బా అంటూ ఆశ్చర్యచకితులవుతున్నారు.
మన కుటుంబసభ్యుల్ని ఎవర్నైనా మనం ఏదైనా అనరాని మాట అన్నప్పుడో, కొంచెం కటువుగా వ్యవహరించినపుడో ముఖమొహాలు చూసుకునేందుకు కొన్నేళ్లు పడుతుంది. అలాంటిది ఈ రాజకీయ నేతలు గతాన్ని క్షణాల్లో మర్చిపోయి ఎంత చక్కగా ఒకర్నొకరు వాటేసుకుని మాట్లాడుకుంటారో గదా అని బస్టాండ్ లో నిల్చున్న ఓ సాధారణ గృహిణి వ్యాఖ్యానించండం గమనార్హం.
"బీజేపీ-టీడీపీ అనుబంధం చూడటానికి స్వచ్ఛమైన స్నేహంలా కనిపిస్తున్నా, వాసన మాత్రం రాజకీయ లావాదేవీలదే! చంద్రబాబు నాయుడు ప్రగతి కోసం కలిసినట్టు చెబుతారు, బీజేపీ దేశహితం పేరుతో తలిపోతుంది. కానీ, వాస్తవానికి ఇద్దరికీ 'అవసరాల వ్యాపారం' తప్ప మిగతా భావోద్వేగాలు అవసరమేనా అనిపిస్తోంది. పల్లకీ ఎవరికి? మోసేవాళ్లు ఎవరూ?—ఇది మాత్రం ఎన్నికల కుర్చీ కదిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది!" అని ఓ తలపండిన రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించారు.