తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికారత రెండు రోజుల సదస్సు ఈ నెల 14వ తేదీ నుంచి రెండు రోజులపాటు జరగనుంది. అన్ని రాష్ట్రాల నుంచి మహిళా పార్లమెంటీరియన్లు, శాసనసభ్యులు హాజరయ్యే ఈ సదస్సులో మహిళా సమస్యలపై చర్చించి, కార్యాచరణ సిద్ధం చేస్తారని ఏపీ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ తెలిపారు. చంద్రగిరి కోటను కూడా మహిళా పార్లమెంటేరియన్లు సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కూడా ఆయన సమీక్షించారు. అంతకుముందు
తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో మహిళా కాన్ఫరెన్స్ పై ఏపీ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ శనివారం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్థనరాజు, అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్యతో, జిల్లా అధికారులతో శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్ హాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ
"జాతీయ మహిళా సాధికారిత కు కాన్ఫరెన్స్ కు దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి సభ్యులు హాజరవుతారు. రెండు రోజులు మహిళల సమస్యలపై సుదీర్ఘంగా చర్చిస్తారు" అని ప్రసన్నకుమార్ చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేయడానికి బాధ్యతలు కూడా వికేంద్రీకరించాలని ఆయన కలెక్టర్ వెంకటేశ్వర్ కు సూచించారు.
రెండు రోజుల సదస్సుకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
"లోక్ సభ, శాసనసభ స్పీకర్లు, రాష్ట్ర గవర్నర్లు, సీఎంలు, మంత్రులతో పాటు ప్రముఖులు కూడా ఉంటారు. వసతి సదుపాయాలతో పాటు భద్రతా పరమైన ఏర్పాట్లపై కూడా శ్రద్ధ తీసుకోవాలి" అని కలెక్టర్ వెంకటేశ్వర సూచించారు.
చంద్రగిరి కోట సందర్శన
తిరుపతిలో జరిగే సదస్సుకు హాజరయ్యే మహిళా ప్రతినిధులు చంద్రగిరి సమీపంలోని కోటను కూడా సందర్శించనున్నారు. దీంతో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు, వసతులపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు. చంద్రగిరి కోటకు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్సీ హర్షవర్ధనరాజుతో కలిసి వెళ్లిన ఏపీ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ పరిశీలించారు.
"చంద్రగిరి కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ లైట్ అండ్ సౌండ్స్ ఏర్పాటు చేయాలి" అని ప్రసన్నకుమార్ ప్రత్యేకంగా ఆదేశించారు. చంద్రగిరి కోటకు చేరుకునే మార్గంలో అప్రోచ్ రోడ్లు, చంద్రగిరి కోట వద్ద బ్యారికేడ్ల ఏర్పాటు, స్టేజ్ వద్ద ఎల్ ఈ డి స్క్రీన్ తదితర ఏర్పాట్లపై సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట డిఆర్ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్డిఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, ప్రోటోకాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్, అడిషినల్ ఎస్పి. రవిమనోహరాచ్చారి, డిపిఓ సుశీలాదేవి, తిరుపతి, చంద్రగిరి డిఎస్పీలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ సురేందర్ నాయుడు, టూరిజం ఆర్.డి. రమణ ప్రసాద్, డి ఐ పి ఆర్ ఓ పి గురుస్వామి శెట్టి, సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు.