కాకినాడ పోర్టు కేసులో విజయ సాయి ఇరుక్కుంటాడా!

రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని రేపు సీఐడీ పోలీసులు విచారించనున్నారు. కాకినాడ పోర్టులో కేవీ రావు ఆస్తులు అక్రమంగా లాక్కున్నారనే కేసు పై ఈ విచారణ జరగనుంది.;

Update: 2025-03-11 05:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో వి విజయ సాయి రెడ్డి వైఎస్సార్సీపీ ప్రదాన కార్యదర్శిగా అందరికీ తెలిసిన వారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో ఆడిటర్ గా ఉన్నందున ఆయన గురించి తెలియని వారు లేరు. జగన్ తరువాత సీబీఐ కేసుల్లో రెండో వ్యక్తిగా ఉన్నారు. క్విడ్ ప్రోకో కింద జగన్ పై నమోదైన కేసుల్లో ఆడిటర్ గా వ్యవహరించడమే కాకుండా మనీ లాండరింగ్ కేసులు కూడా విజయసాయిరెడ్డిపై నమోదయ్యాయి.

విజయసాయి పై మొత్తం 21 కేసులు

ఇప్పటి వరకు విజయ సాయి రెడ్డిపై 21 కేసులు నమోదైనట్లు ఆయనే స్వయంగా గత జనవరిలో వెల్లడించారు. కాకినాడ పోర్టు విషయంలో విజయ సాయి రెడ్డి పై కేసు నమోదైన తరువాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ కేసుల్లో బెయిల్ పై ఉన్న విజయ సాయి రెడ్డి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత ఏపీలో మొదటిసారిగా సీబీఐ విజయ సాయి రెడ్డిపై విచారణ జరుపుతోంది. రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి సీఐడీ ద్వారా కేసును సీబీఐకి అప్పగించారు.

కాకినాడ పోర్టు కేసు నమోదు కాగానే రాజీనామా

కాకినాడ పోర్టులో సెజ్ లకు సంబంధించిన ఆస్తులు కర్నాటి వెంకటేశ్వరావు ను భయపెట్టి ఆయాచితంగా లాక్కున్నారనే కేసు నమోదైంది. ఈ కేసులో ఏ2 గా విజయసాయిరెడ్డి పై ఫిర్యాదు అందటంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1 గా విక్రాంత్ రెడ్డి ఉన్నారు. కేవీ రావు కేసు పెట్టగానే పోలీసులు విజయ సాయి రెడ్డికి లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కేసులో 2025 జనవరి 6న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయ సాయిని విచారించింది. రెండు నెలల తరువాత తిరిగి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం బుధవారం సీబీఐ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. ఈడీ విచారణలో కాకినాడ పోర్టులో కేవీ రావు కంపెనీ నుంచి షేర్స్ ను బలవంతంగా బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలపై ప్రశ్నించారు. జగన్ కేసుకు సంబంధించి 22 సంవత్సరాల క్రితం సండూరు పవర్ ప్రాజెక్టులో పెట్టుబడుల గురించి అడిగారు. అన్నేళ్ల క్రితం విషయాలు నాకు తెలియవని ఆయన సమాధానం చెప్పారు.

బుధవారం ఏమి ప్రశ్నించనున్నారు

కాకినాడ సెస్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో జరిగినా బయటకు రాలేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా జరుగుతోందని, దానిని ఎవ్వరూ ప్రశ్నించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో కలెక్టర్ ఆపివేసిన నౌకను తనిఖీ చేశారు. ఈ సందర్భంలోనే సెజ్ ఆస్తులను అక్రమంగా తన నుంచి లాక్కున్నారని కేవీ రావు ఆరోపించారు. ప్రభుత్వ డైరెక్షన్ లోనే కేవీ రావు సీఐడీ వారికి తన ఆస్తులు వై విక్రాంత్ రెడ్డి, వి విజయసాయిరెడ్డిలు బెదిరించి లాక్కున్నారని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. కేవీ రావు నుంచి షేర్స్ బలవంతంగా రాయించుకున్నారని, అందుకు సంబంధించిన లావాదేవీలను ఆడిట్ చేసింది విజయసారెడ్డికి బాగా కావాల్సిన వారంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే విజయసాయి బెదిరించారనేందుకు కానీ, తనకు మంచి స్నేహితుడు ఆడిటర్ అనేందుకు కానీ ఇంత వరకు ఆధారాలు పోలీసులు సేకరించలేక పోయారు.

ఈ నేపథ్యంలో సీబిఐ వారు విజయసాయిని విచారణకు పిలుస్తున్నందున ఏ విధమైన వివరాలు అడిగే అవకాశం ఉందనే దానిపైనే చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో విజయసాయి అల్లుడి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 1997 నుంచి ఇప్పటి వరకు కేవీ రావు కంపెనీ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై విచారణ జరిపించాలని విజయసాయి డిమాండ్ చేస్తున్నారు. కేవీ రావు చంద్రబాబుకు బినామీ దారుడని, అందుకే ఆయన చెప్పినట్లు ఇప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

సెజ్ భూములు అరబిందో అధీనంలోనే..

ప్రస్తుతం కాకినాడ సెజ్ కు సంబంధించిన 8వేల ఎకరాల భూములు అరబిందో అధీనంలోనే ఉన్నాయి. సెజ్ భూములు, కంపెనీ షేర్స్ బలవంతంగా లాక్కున్నారనేది కేవీ రావు ఫిర్యాదు. రూ. 2,500 కోట్ల విలువైన 2.12 కోట్ల షేర్స్ రూ. 494 కోట్లకు లాగేసుకున్నారనేది కేవీ రావు ప్రధాన ఆరోపణ. సీఐడీ కేసు నమోదు చేసిన తరువాత అరబిందో కంపెనీ, కేవీ రావు కంపెనీల వారు రాజీకి వచ్చారు. రాజీ ప్రకారం కేవీ రావు నుంచి తీసుకున్న షేర్స్ తిరిగి ఇచ్చేశారు. షేర్స్ కొనుగోలుకు సంబంధించిన డబ్బును కేవీ రావు తిరిగి అరబిందోకు ఇచ్చారు. అయితే సెజ్ భూములతో మీరు ఎలాంటి సంబంధం లేదని ఒప్పందంలో రాసుకున్నారు. తనకు భూముల్లో కూడా వాటా ఉందని కేవీ రావు అంటున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. కేవీ రావు నుంచి షేర్స్ కొనుగోలు కోసం ఇచ్చే డబ్బుల్లో మనీ లాండరింగ్ కు అరబిందో పాల్పడిందని, అందుకే విజయసాయి సహకరించారనేది ప్రధానమైన ఆరోపణ. రంగనాథ్ అండ్ కంపెనీ, శ్రీధర్ అండ్ కంపెనీలు ఆడిటింగ్ చేసేందుకు విజయసాయి రెడ్డి రెకమెండ్ చేశారనేది కూడా ఆరోపణల్లో ప్రధానమైంది.

నిజం-వాస్తవానికి మధ్య సన్నని గీత ఉంది

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది కూటమి పాలన కాదు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ల ఆధ్వర్యంలో జరుగుతున్న పాలన మాత్రమేనని విజయసాయి అన్నారు. నిజం అనేది చంద్రబాబు అయితే జరుగుతున్న పరిణామాల్లో వాస్తవం అనేది లోకేష్ అని చేసే పనులన్నీ లోకేష్ ద్వారానే జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పదాల మధ్య సన్నని గీత ఉందని, దానిని ప్రజలు అర్థం చేసుకుంటే చంద్రబాబు బండారం బయటకు వస్తుందన్నారు.

Tags:    

Similar News