ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో ఈ ఖరీఫ్ సీజనుకు ఇక ఢోకా ఉండదంటూ రైతుల మోములు మెరిశాయి. ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. రుతుపవనాలు ముందుగా రావడమైతే వచ్చాయి గాని కొన్ని రోజులకే ముఖం చాటేశాయి. దీంతో సమృద్ధిగా కురుస్తాయనుకున్న వర్షాలు చిరుజల్లులకే పరిమితమయ్యాయి. ఆరంభంలో కురిసిన వర్షాలకు రైతులు గంపెడాశలతో ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. పలుచోట్ల వరి విత్తనాలు చల్లారు. ఇతర పంటల సాగునూ చేపట్టారు. ఇక అప్పట్నుంచి వానల కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వరుణుడు వర్షించడం లేదు. రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోవడం లేదు. అడపాదడపా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి రాష్ట్రంపై కాకుండా పొరుగున ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు మళ్లి అక్కడ ప్రభావం చూపుతున్నాయి. పైగా వర్షాలకు బదులు అధిక ఉష్ణోగ్రతలు దడ పుట్టిస్తున్నాయి. దీంతో అసలే కొన ఊపిరితో ఉన్న వరి నారు, ఇతర పంటలు మరింతగా దెబ్బతింటున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజనులో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.15 లక్షల హెక్టార్లు. ఖరీఫ్‌లో 21 రకాల ప్రధాన పంటలను సాగు చేస్తారు. వీటిలో ప్రధాన పంట అయిన వరి, జొన్న, మొక్కజొన్న, పెసలు, మినుములు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి వాటితో పాటు పత్తి, చెరకు, పొగాకు తదితర వాణిజ్య పంటలూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పంటల కవరేజి నివేదిక ప్రకారం ఇప్పటివరకు 5.12 లక్షల హెక్టార్లలో (12.65 లక్షల ఎకరాల్లో) పంటలు/నాట్లు వేశారు. అయితే మొత్తం విస్తీర్ణంలో ఇది కేవలం 16 శాతం మాత్రమే. ఇందులో వరి 2.07 లక్షల హెక్టార్లలో నాటారు. పత్తి 1.64 లక్షల హెక్టార్లలో సాగయింది. జిల్లా వారీగా వరి సాగు నెల్లూరులో అత్యధికంగా 79,353 హెక్టార్లు, శ్రీకాకుళం 34,606, తిరుపతి 23,772, తూర్పు గోదావరి 17,150, కృష్ణా 16,839 హెక్టార్లలో ఉంది. మొత్తమ్మీద చూస్తే రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను 23 జిల్లాల్లో 25 శాతంకంటే తక్కువ సాగే జరిగింది.
వర్షాలు కురవక ..
ఆంధ్రప్రదేశ్‌లో లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్‌లో పంటల సాగు పురోగతి అథోగతిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముందుగా కురిసిన వర్షాలతో ముందస్తుగా విత్తనాలు నాటారు. మరికొన్ని చోట్ల నాట్లు వేశారు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో వీటి ఎదుగుదల ఆశించినంతగా లేదు. పైగా వర్షాలకు బదులు ఎండలు విజృంభిస్తుండడంతో అవి ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయని సంబరపడ్డ రైతాంగానికి వర్షాభావ పరిస్థతులు ఆశíనిపాతంగా మారాయి. దీంతో వరినాట్లు వేయడం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది.
25 శాతం లోటు వర్షపాతం..
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజను ప్రారంభమవుతుంది. అప్పట్నుంచి జులై 18 వరకు రాష్ట్రంలో 172.18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉంది. కానీ 128.27 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే సాధారణంకంటే ఇది 25.5 శాతం లోటు వర్షపాతం అన్నమాట! 26 జిల్లాల్లో 10 జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. మిగిలిన 16 జిల్లాల్లో సాంకేతికంగా సాధారణ వర్షపాతం రికార్డయింది. ఐఎండీ నిబంధనల ప్రకారం కురవాల్సిన వర్షంకంటే 20 శాతం +/– అయినా సాధారణంగా (నార్మల్‌గా) పరిగణిస్తారు. లోటు వర్షపాతంలో శ్రీకాకుళం (–21.93 శాతం), కోనసీమ (–38.43), పశ్చిమ గోదావరి (–26.90), గుంటూరు (–26.88), పల్నాడు (–38.71), నెల్లూరు (–45.13), శ్రీసత్యసాయి (–57.08), వైఎస్సార్ కడప (–46.32), అన్నమయ్య (–40.99), తిరుపతి (–23.28 శాతం) జిల్లాలున్నాయి.
ఈ వర్షాలపైనే అన్నదాతల ఆశలన్నీ..
ఖరీఫ్ సీజను మొదలై నెలన్నర రోజులవుతున్నా వానల జాడ లేకపోవడంతో అన్నదాతల ఆశలు అడుగంటి పోతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, తూర్పు, పశ్చిమ గాలుల ద్రోణిలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావం వల్ల ఈనెల 18 నుంచి 24 వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇదే ఇప్పుడు రైతుల్లో అడుగంటిన ఆశలను చిగురింప చేస్తోంది. ఐఎండీ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగైదు రోజుల్లో నెల్లూరు, ప్రకాశం, కడప, నంద్యాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఇన్నాళ్లూ నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగి పంటల సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడనున్నాయి. రైతన్నల్లో ఆనందాన్ని నింపనున్నాయి.