వైసీపీ రప్ఫా రప్ఫాపై కేసులు
ఆ వ్యాఖ్యలు సామాన్య ప్రజలను, తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయని టీడీపీ నేత జానీబాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.;
వైసీపీ శ్రేణులపై పోలీసులు రప్ఫా రప్ఫా కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని రప్ఫా రప్ఫా డైలాగులు మాట్లాడుతున వైసీపీ శ్రేణుల మీద పోలీసులు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ‘మా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ఫా రప్ఫా ఆడించేస్తాం..జై జగన్’ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపైన పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ పోస్టులు పెట్టిన వారు పిన్నెల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పొందుగుల రహీమ్, అమరావతి ఇస్మాయిల్‌తో మరి కొందరు వైసీపీ కార్యకర్తలు పిన్నెల్లి వదిలి బయట ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
అయితే ఇటీవల వీరంతా ఒక చోటుకు చేరారు. వీరందరూ కలిసి రప్ఫా రప్ఫా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే వైసీపీ కార్యక్తలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై పిన్నెల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ జానీబాషా మాచర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పోస్టులు, అందులోని వ్యాఖ్యలు సామాన్య ప్రజలను, తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని జానీబాషా తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. జానీబాషా ఫిర్యాదు మీద స్పందించిన మాచర్ల పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.