ఆ 3 కంపెనీల మైనింగు లైసెన్సులు రద్దు చేస్తారా?

భారతీ సిమెంట్స్, ఏసీసీ, రామ్ కో కి షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది

Update: 2025-10-12 03:33 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కి షాక్ ఇచ్చేందుకు ప్రస్తుత ఎన్డీఏ రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి డైరెక్టర్ గా ఉన్న సంస్థ రాష్ట్రంలోని పలుచోట్ల అక్రమంగా గనుల లైసెన్సులు పొందిందన్న ఫిర్యాదులపై ప్రస్తుత ప్రభుత్వం నిఘా పెంచింది. గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి లైసెన్సులు పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. వేలం ద్వారా కొత్త లీజులు పొందాలని కేంద్ర గనులశాఖ నిబంధనలు ఉన్నా, పాత దరఖాస్తుల సాకు చూపి భారతీ సిమెంట్స్ రెండు సున్నపు రాయి గనుల లీజులు పొందినట్టు ఆరోపణల నేపథ్యంలో భారతీ సిమెంట్‌కు ప్రభుత్వం షాక్‌ ఇవ్వనుంది. ఈ లైసెన్సులు పొందిన సమయం కూడా 2024 ఎన్నికలకు ముందు జరిగినట్టు తెలుస్తోంది.
భారతీ సిమెంట్స్ తో పాటు అసోసియేట్‌ సిమెంట్‌ కంపెనీ (ఏసీసీ), రామ్‌కో సిమెంట్స్‌ కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేస్తారని తెలుస్తోంది. ఏయే సంస్థలకు ఎన్నెన్ని లైసెన్సులు ఇచ్చారో, ఎందుకిచ్చారో, ఎలా ఇచ్చారో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం గనుల శాఖను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అసలేం జరిగిందంటే..
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో వైసీపీ ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కి రెండు, ఏసీసీకి ఒకటి, రామ్ కో సిమెంట్స్ కి ఒక సున్నపు రాయి గనిని కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర గనులశాఖ 2015లో తీసుకొచ్చిన సవరణ నిబంధనలకు ఇది విరుద్ధమని ఆనాడే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర గనుల శాఖ నిబంధనల ప్రకారం.. ప్రధాన ఖనిజాల (మేజర్‌ మినరల్స్‌) లీజులను వేలం ద్వారానే పొందాలి. 2015 జనవరి 12కు ముందు లీజు కోసం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ)ను ఎవరికైనా జారీచేస్తే, వాళ్లు 2017 జనవరి 11 నాటికి (రెండేళ్లలో) అన్ని అనుమతులూ తెచ్చుకొని లీజు పొందాలని, లేకపోతే ఎల్‌వోఐలు రద్దవుతాయని స్పష్టంగా ఉంది.

వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లోని రఘురామ్‌ సిమెంట్స్‌కు సున్నపురాయి నిక్షేపాలున్న భూములు ఉండగా, వాటిని 2009లో భారతీ సిమెంట్‌ కొనుగోలు చేసింది. అందులో 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల్లో రెండు సున్నపురాయి లీజులు కేటాయించాలని అప్పట్లోనే దరఖాస్తు చేయగా, వాటికి ఎల్‌వోఐలు జారీచేశారు.
తర్వాత లీజులకు అవసరమైన అనుమతులను భారతీ సిమెంట్‌ పొందలేకపోయింది. రఘురాం సిమెంట్స్, భారతి సిమెంట్‌గా మారిన విషయాన్ని గనుల శాఖకు చెప్పకపోవడంతో ఎల్‌వోఐని ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం 2016లో నోటీసు ఇచ్చింది. దీనిపై భారతీ సిమెంట్‌ హైకోర్టుకు వెళ్లగా స్టేటస్‌కో వచ్చింది.
లీజుల కేటాయింపు విషయంలో భారతీ సిమెంట్‌ వాదన విని, నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2023లో ఆదేశాలివ్వగా.. 2024 ఫిబ్రవరి 2న రెండు సిమెంట్‌ లీజులు మంజూరుచేస్తూ అప్పటి జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు ఇది జరిగింది.
వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలంలోని 2,463.83 ఎకరాల్లో సున్నపురాయి లీజు కోసం ఏసీసీకి 2010లో అప్పటి ప్రభుత్వం ఎల్‌వోఐ జారీచేసింది. 2015లో కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చాక రెండేళ్లలో ఆ సంస్థ లీజు పొందలేకపోయింది. తర్వాత అది హైకోర్టును ఆశ్రయించింది.
2022లో ఏసీసీని అదానీ సిమెంట్స్‌ దక్కించుకుంది. లీజుదారు వాదన విని, నిర్ణయం తీసుకోవాలని 2023లో హైకోర్టు ఆదేశాలివ్వగా, అప్పటి వైకాపా ప్రభుత్వం.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం, తర్వాత ఏజీ అభిప్రాయాన్ని తీసుకుంది. వాళ్లు అనుకూలంగా చెప్పడంతో.. ఏసీసీకి 2,463.83 ఎకరాల్లో లీజు మంజూరుచేస్తూ 2023 నవంబరు 15న ఉత్తర్వు జారీచేశారు. అనంతరం ఇదే కోవలో భారతీ సిమెంట్‌ కూడా రెండు లీజులు పొందింది.

 ఏసీసీ, భారతీ సిమెంట్‌తో పాటు రామ్‌కో సిమెంట్స్‌ కూడా ఇలాగే ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని 267.30 ఎకరాల్లో లీజును 2024 మార్చి 15న పొందింది.

మూడు కంపెనీలు మైనింగ్‌ ప్లాన్‌ కోసం కేంద్రసంస్థ అయిన ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం)కు దరఖాస్తు చేసుకోగా, అది ఈ లీజుల లొసుగులను గుర్తించింది. వేలం ద్వారా కాకుండా దరఖాస్తుల ద్వారా లీజులు పొందడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొని, ఆ సమాచారాన్ని కేంద్ర గనులశాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ లీజుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Tags:    

Similar News