మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీకి వస్తారా?

త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్‌ఆర్‌సీపీ నేత జగన్‌ సమావేశాలకు హాజరవుతారా? కారా? అనే చర్చ మొదలైంది.

Update: 2024-06-17 11:43 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. ప్రధానంగా ఈ చర్చను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్క లేదు. ఇప్పటికే గతంలో మంత్రులుగా పని చేసిన వారు, పార్టీ సీనియర్‌ నాయకులు ఓటమి నుంచి తేరుకోలేదు. జగన్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, రాజ్య సభ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ ఐదేళ్లు కళ్లు మూసుకుంటే తిరిగి అధికారంలోకి వచ్చేది మనమేనని చెప్పడం విశేషం. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాలని, పార్టీని వదిలి ఎవరు బయటకు పోవద్దనే సారాంశం జగన్‌ మాటల్లో స్పష్టమైంది. పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదనే అవమాన భారంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తారో లేదో అనే చర్చ మొదలైంది. కొత్త ప్రభుత్వంలో మొదటి సారిగా జరుగుతున్న వర్షాకాల సమావేశాలకు జగన్‌ తప్పకుండా హాజరవుతారని, ఆయన హాజరు కాకుంటే పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మనో ధైర్యం కోల్పోయే అవకాశం ఉందని, అందువల్ల జగన్‌ తప్పకుండా సమావేశాలకు హాజరవుతారని వైఎస్‌ఆర్‌సీపీలోని సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.

ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనే ప్రచారం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర శాసన మండలిలో 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు పాస్‌ కావాలంటే శాసన మండలిలో టీడీపీ ప్రభుత్వానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీల మద్దతు కావలసి ఉంటుంది. అందుకే వైఎస్‌ఆర్‌సీపీ శాసనమండలి సభ్యుల్లో కొందరిని తెలుగుదేశం పార్టీ తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు మాట్లాడుతూ ఇప్పటికే తమతో 12 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు టచ్‌లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా అదే జరిగితే వైఎస్‌ఆర్‌సీపీకి మరో భారీ షాక్‌ తగిలినట్లే. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కూడా కొందరు టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ కాకుండా 10 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల అవరం లేదు. అయినా వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిన నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీని దెబ్బతీయాలంటే ఆ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు వాఖ్యానించడం విశేషం.
జగన్‌ మొండిపట్టుతో ఉంటాడా?
తనకు వయసు అయిపోలేదని, తన వంట్లో ఇంకా సత్తువ అలానే ఉందని, 14 నెలలు రాష్ట్రంలో పాదయాత్ర చేశానని, అదే ఊపును మళ్లీ కొనసాగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మీరు అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్‌ పిలుపు నిచ్చారు. అంటే పార్టీని మరింత బలోపేతం చేయడానికి తాను రెడీగా ఉన్నట్లు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ మాటలు విన్న తర్వాత అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనే సందిగ్దాన్ని ఎవరైనా వదిలి పెట్టాల్సిందే. అసెంబ్లీలో ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించడంతో పాటు ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విషయంలో సక్సెస్‌ అవుతాడా అనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
ఎన్నికల్లో పోలైన ఓట్లలో సుమారు 40 శాతం ఓటర్లు వైఎస్సార్‌సీపీకి ఓటర్లు్ల వేశారని, అలాంటప్పుడు పార్టీ బలం ఎలా తగ్గుతుందనే ప్రశ్న కూడా వారిలో ఉంది. దీనిని బట్టి జగన్‌ అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అవమానాలను భరిస్తాడా?
అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను, వైఎస్‌ జగన్‌ను అధికార టీడీపీ హేళనగా మాట్లాడి అవమానించే అవకాశం ఉందని ముందుగానే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజల తరపున రెప్రజెంటేటివ్‌గా ఉండకుండా వెళ్లిపోతే తమ పార్టీని తామే గోతిలోకి నెట్టిన వారమవుతామనే భావన కూడా ఆ పార్టీలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దాంతో పాటు అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్‌కు సరైన సమయం ఇవ్వ లేదని, అందువల్ల అనేక సార్లు జగన్‌ అసహనానికి గురయ్యారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. ఒక దశలో ఈ విధంగా అసెంబ్లీ నిర్వహిస్తే తామెందుకు అసెంబ్లీకి రావాలంటూ సీఎం అయ్యాకే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడుతానని, అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేస్తూ జగన్‌ వెళ్లి పోయారు. తర్వాత పాదయాత్రను చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు.
Tags:    

Similar News