తిరుమల తరహాలో నవంబర్ 17 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరించిన టీటీడీ పాలక మండలి.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-28 14:56 GMT
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 11 వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16 వ తేదీ లక్షకుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు పద్మావతీ అమ్మవారి ఉత్సవాల ప్రచార బుక్‌లెట్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి ఆవిష్కరించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. మీడియా సమావేశం తరువాత తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోెత్సవాలకు సంబంధించిన బుక్ లెట్ ఆవిష్కరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ,
తిరుచానూరులో కూడా తిరుమల తరహాలోనే బ్రహ్మోెత్సవాలు నిర్వహించడానికి టీటీడీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
11న లక్షకుంకుమార్చన
తిరుచానూరులో బ్రహ్మత్సవాల ప్రారంభానికి వారం ముందు ఆలయంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
నవంబరు 16వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 17న ధ్వజారోహణం, 21న గజ వాహనం, 22న స్వర్ణరథం, గరుడ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమితీర్థం, 26న పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.