తిరుమల:కొనుగోళ్లపై ఏసీబీతో విచారణ.. ప్రయివేటుకు గోశాల..

పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం. . టీటీడీ బోర్డు తీర్మానాలు వెల్లడించిన చైర్మన్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-28 15:27 GMT
తిరుమలలో మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, పక్కన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

తిరుమలలో మరోసారి గదుల అద్దె పెరిగే అవకాశం ఉంది. ఎస్వీ గోశాల నిర్వహణ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఒంటిమిట్ట, కాణిపాకంలో యాత్రికుల వసతి సముదాయాలు.

తిరుమలలో అవసరమైన వస్తువుల కోనుగోలు చేసిన వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని టీటీడీ పాలక మండలి తీర్మానించింది. వైసీపీ ప్రభుత్వంలో రూ. 350 నుంచి 450 విలువైన శాలువలను ఒక్కొక్కటి రూ 1,150 కి కొనుగోలు చేయడం ద్వారా 50 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలోని పర్ఛేజింగ్ కమిటీ ద్వారా జరిగిన అనేక వస్తువులు, ఆహార దినుసులపై కూడా విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

"తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ పాలక మండల స్పష్టత ఇచ్చింది. పది రోజుల పాటు ద్వారాలు తెరవడం ద్వారా ఏడు లక్షల మందికి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేయనున్నామనీ, మరింత కట్టుదిట్టంగా టోకెన్ల జారీ ప్రక్రియ కోసం నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది" అని చైర్మన్ బీఆర్. నాయుడు తోపాటు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన పాలక మండలి సమావేశం సాయంత్రం వరకు జరిగింది. అనంతరం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యులతో కలిసి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు.

"ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా గ్రామాల్లో భ‌జ‌న మందిరాలు నిర్మిస్తాం" అని చైర్మన్ నాయుడు తెలిపారు.
తీర్మానాలు ఇవీ.
1.ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించాం. బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాల సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినందనలు తెలియజేశారు.
2.తిరుమలలో యాత్రికులకు ప్రస్తుతం కేటాయిస్తున్న గదుల అద్దె పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
3. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.
4. టీటీడీ గోశాల నిర్వహణకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటాం.
5. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం.
6. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం.
7. కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క స్వామి ఆల‌యం వ‌ద్ద యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, సామూహిక వివాహాల‌కు ప్ర‌త్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ అనుమ‌తి కొర‌కు పంపించాల‌ని నిర్ణ‌యం.
ఇతర రాష్ట్రాల్లో..
8. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చదరపు అడుగుల స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం .
9. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో శ్రీ పద్మావతి, శ్రీఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాత‌ల ద్వారా సేక‌రించాల‌ని నిర్ణయం.
10. వేద విశ్వ‌విద్యాల‌యం వైస్ చాన్సలర్ ( Vice Chancellor of Vedic University) ఆచార్య రాణి స‌దా శివ‌మూర్తిని తొల‌గించాల‌ని నిర్ణ‌యం.
11. టీటీడీ కొనుగోలు విభాగంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఎసిబితో విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం. ఈ సమావేశంలో టీటీడీ అద‌న‌పు ఈఓ సీహెచ్. వెంక‌య్య చౌద‌రి, బోర్డు స‌భ్యులు, జెఈఓ వి.వీర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు పాల్గొన్నారు.
Tags:    

Similar News