తీరాన్ని తాకావ్, మొంథా మొంథా.. ఇపుడు ఏం చేస్తావ్!
మొంథా తుఫాన్ ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుందోనని అందరిలోనూ గుబులు రేగుతోంది.
మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడు, మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం వద్ద తుఫాన్ మొత్తానికి తీరం తాకింది. ఈ తుఫాన్ ప్రభావంపై నాలుగు రోజుల నుంచి మీడియాలోను, సోషల్ మీడియాలోనూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మొంథాతో ఏమంత తీవ్ర ప్రభావం ఉండబోదని కొన్ని, పెను విధ్వంసం సృష్టిస్తుందని మరికొన్ని మీడియా సంస్థలు, ఛానళ్లు ఊదర గొడుతున్నాయి.
పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 28, 2025
కాకినాడ సమీపంలో తీరం దాటునున్న
తీవ్రతుపాన్ కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు
ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి
ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
గతంలో కేవలం రేడియోలు, టీవీల్లో వచ్చే వార్తలనే నమ్మేవారు. ఇప్పడా పరిస్థితి మారింది. వాతావరణంపై ఏమాత్రం అవగాహన లేనివారు సైతం సొంతంగా ఏవేవో విశ్లేషణలు చేస్తున్నారు. తుపాను తీరం దాటే ప్రదేశాన్ని కూడా తలోరకంగా చెప్పేస్తున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళానికి కారణమవుతున్నారు. వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచంలోనే ఓ విశిష్ట స్థానం ఉంది. తుపానులు, వడగాడ్పులు, శీతల గాలులు వంటి వైపరీత్యాలపై ఐఎండీ అంచనాలు పలుమార్లు దాదాపు నిజమవుతున్నాయి. అందువల్లే ఐఎండీకి విశ్వసనీయత పెరిగింది. తుపాన్లు సంభవించినప్పుడు వాటి గమనం, ప్రభావంతో పాటు అవి ఎక్కడ తీరాన్ని దాటతాయో కూడా నాలుగైదు రోజులు ముందుగానే ఐఎండీ ఓ నిర్ధారణకు వస్తోంది. అదే విషయాన్ని ప్రభుత్వం, ప్రజల ముందుంచుతోంది,
శ్రీకృష్ణాపురంలో ప్రహరీపై కూలిన చెట్టు
మొంథా అంచనాల విషయంలోనూ..
ఇక మొంథా తుఫాన్ విషయంలోనూ ఐఎండీ ముందస్తు అంచనాలు వేసింది. అల్పపీడనంగా మొదలైన దాని ప్రస్థానం వాయుగుండంగా, తుఫాను, తీవ్ర తుఫానుగా బలపడుతుందని ఇదివరకే స్పష్టం చేసింది. దాని గమనాన్ని అంచనా వేసినట్టుగా మొంథా తుఫాన్ ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంల మీదుగా పయనిస్తూ కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతుందని ప్రకటించింది. ఇప్పటివరకు ఐఎండీ అంచనాలకనుగుణంగానే మొంథా తుఫాన్ పయనిస్తోంది. మంగళవారం అర్ధరాత్రికల్లా కాకినాడకు చేరువలో ల్యాండ్ ఫాల్ అవుతుందని మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన బులెటిన్లోనూ వెల్లడించింది..
ఐఎండీ అంచనాలకనుగుణంగానే..
ఐఎండీ అంచనాలకనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో తలెత్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. తుఫాను తాకిని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవాణా వ్యవస్థను కూడా బాగా కుదించింది..
పెనుగాలులకు విశాఖలో రోడ్లపై విరిగిన చెట్లు
మొంథా తుఫాన్ తీరం దాటడంపైనే ఉత్కంఠ…
మరికొద్ది గంటల్లో మొంథా తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి గరిష్టంగా 110 కి.మీల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. అదే సమయంలో కుంభవృష్టి కురవనుంది. కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షపాతం 10 నుంచి 20 సెం.మీల వరకు నమోదయే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో పూరి గుడిసెలు, పురాతన ఇళ్లు, బలహీనంగా ఉన్న కట్టడాలు, విద్యుత్ స్తంభాలు కూలి పోవడం, రోడ్లు దెబ్బతినడం వంటివి సంభవించే అవకాశం ఉంది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి,విశాఖ, అనకాపల్లి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీరాన్ని దాటాక కూడా ప్రభావం చూపుతుంది…
మరోవైపు మొంథా తుఫాన్ తీరాన్ని దాటాక కూడా తన ప్రభావం చూపుతుంది. మంగళవారం అర్థరాత్రి తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయితే మరో 24 గంటల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయి. అయితే తీరం దాటక ముందు ఉన్నంత తీవ్రత ఉండదన్న మాట! కానీ వర్షాలకు బాగా నానిపోయిన గుడిసెలు, కచ్చా ఇళ్లు, పురాతన ఇళ్లు, కట్టడాలు గాలులు తోడే కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
రుషికొండ బీచ్ లో మూతపడ్డ దుకాణాలు
ఇళ్లకే పరిమితమైన విశాఖ వాసులు..
మొంథా తుఫాన్ దృష్ట్యా విశాఖ నగర వాసులు మంగళవారమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఊహించినంతగా వర్షం కురవకపోయినా ఇంటి నుంచి బయటకు రాలేదు. మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సోమవారం రాత్రి, మంగళవారం వీచిన గాలులకు విశాఖలో పలు చోట్ల నేల కూలాయి. భీమిలి, సింథియా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వాటిని జీవీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తొలగించారు.
విశాఖలో తుఫాన్ ముందర ప్రశాంతత…
విశాఖలో తుఫాన్ ముందర ప్రశాంతత కనిపిస్తోంది. మంగళవారం వేకువజామునే జడివాన కురిసి తెల్లారేసరికి మాయమైంది. ఉదయం ఏడున్నర గంటల వరకు ఎండకాసి అబ్బుర పరచింది. తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు పొడి వాతావరణమే కొనసాగింది. కానీ ఈదురుగాలులు మాత్రం కొనసాగాయి, అంతకుమించి పెనుగాలులు గాని, కుండపోత వర్షం గాని లేవు. సాయంత్రం మధ్యమధ్య కొద్దిసేపు వర్షం కురిసి మాయమవుతోంది. దీంతో మొంథా తుఫాన్ ప్రశాంతంగా తీరం దాటి వెళ్లిపోతుందన్న ఆశాభావంతో విశాఖ వాసులున్నారు. మరికొందరు గత తుఫాన్ల ప్రతాపాన్ని, అవి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు / అనుభవాలను గుర్తు చేసుకుని ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని ఆందోళన చెందుతున్నారు.