మోదీ మొండి చేయి చూపినా చంద్రబాబుకి బాగానే ఉంటుందా?
51 వేల కోట్ల బడ్జెట్ లో ఏపీ కి దక్కిన వాటా కేవలం 0.45 శాతం. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు గొంతు విప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి..;
By : The Federal
Update: 2025-02-01 12:04 GMT
రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం దాటింది. ఈ 12 ఏళ్లలో విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు, అయినా ఈ బడ్జెట్ బాగుందని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం విరుచుకుపడ్డాయి. పార్లమెంటు సాక్షిగా ఇస్తానన్నవి ఏవీ ఇవ్వకపోయినా బడ్జెట్ ను చంద్రబాబు స్వాగతించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 50.65 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఆంధ్రప్రదేశ్ కి దక్కింది ఎంతో చెప్పాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2025-26 కేంద్ర బడ్జెట్ (Union Budget 2025-26)ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అందులో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం 22,981 కోట్లు. అంటే 51 లక్షల కోట్లలో ఆంధ్రప్రదేశ్ కి దక్కిన వాటా కేవలం 0.45 శాతం. 5 కోట్ల మంది జనాభా, 25 జిల్లాలు, 175 మంది శాసనసభ్యులు, 25 మంది పార్లమెంటు సభ్యులున్న ఏపీకి అతిచిన్న రాష్ట్రాలతో సమానమైన వాటా కూడా దక్కలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఏపీ కి కేటాయింపుల వివరాలు ఇలా...
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు,
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు, రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు, ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
కేంద్ర బడ్జెట్ 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. "దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామం. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించింది. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోంది. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది" అన్నారు చంద్రబాబు.
దీనిపై వామపక్షాలు విరుచుకుపడ్డాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఓమాట లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. అమరావతికి కేంద్రం నిధులు ఎందుకు కేటాయించలేదని చంద్రబాబు ప్రశ్నించరా, కేవలం ఇచ్చిన అప్పులతో సరిపెట్టుకుంటారా.. ఇదేం తీరు అని ప్రశ్నించారు. . అదేవిధంగా, విద్యుత్ స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకించి, ఇప్పుడు వాటిని అమలు చేయడం矣, స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడటం లేదని విమర్శించారు.
సీపీఎం విమర్శ...
కేంద్ర ప్రభుత్వం నుండి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి బకాయిలున్నాయని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రూ.21 వేల కోట్లు పాత బకాయిలు కేంద్ర ప్రభుత్వం నుండి ఏపీకి రావల్సి ఉందని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. పోలవరం కాంట్రాక్టులతో పాటు నిర్వాసితులకు నిధులు తేకుండా వారిని గోదాట్లో ముంచుతున్నారన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తెస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా అని ప్రశ్నించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని వదిలి మిట్టల్ కు గనుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు తీరును తప్పుబట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఏమీ చేయలేదని శ్రీనివాసరావు విమర్శించారు.
రాష్ట్ర విభజన హామీలు ఏమయ్యాయి?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయలేదని, రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని APCC అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ముఖ్యంగా, అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు తగిన నిధులు కేటాయించకపోవడం రాష్ట్రానికి అన్యాయమని అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, రాష్ట్ర అవసరాలను పట్టించుకోలేదని విమర్శించాయి.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఇంకా ఎటువంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.