‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ చంద్రబాబు సాధిస్తారా?
ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలనే లక్ష్యంతో ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కార్యాచరణకు బీజం వేసింది.
‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ సాధించేందుకు సెర్ఫ్,, మెప్మా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం పిలుపు నివ్వడం రాష్ట్రంలో చర్చనియాంశంగా మారింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలన్నీ ఆర్థికంగా బలోపేతమై ఎస్ఎంఎస్ఈలుగా మారాలన్నారు. అందుకు సెర్ఫ్, మెప్మా సహకారం అవసరమని, ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎదిగే వారికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా పురోగతి సాధించేలా చూడాలి. ఇందుకోసం అన్ని ఎస్‌హెచ్‌జీలను, వాటి ఆదాయ ఆర్జన బట్టి ఐదు కేటగిరీలుగా విభజించాలని సీఎం సూచించారు. ఏడాదికి రూ. లక్ష కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలు వరకు ‘లాక్‌పతి’, రూ. 10 లక్షలు పైన సంపాదిస్తే ‘మైక్రో’, రూ.50 లక్షలు కన్నా అధికంగా ఆదాయం వస్తే ‘స్మాల్’, రూ. కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే ‘మీడియం’ కేటగిరీలుగా విభజించాలన్నారు. అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. సచివాలయంల్ పై రెండు శాఖలపై సమీక్ష నిర్వహిస్తూ అన్నారు.
లక్ష ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు
స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా సంఘాలకు లబ్ది చేకూర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం ఈ ఆర్ధిక సంవత్సరంలో కనీసం లక్ష ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు అయినా చేయాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుని ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ అందించాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా చాలా తక్కువ ఉందని, దీనిపై దృష్టి పెట్టి వారి ఆదాయ మార్గాలు మెరుగు పరిచేలా ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది.
ప్రోత్సాహకాలు ముఖ్యం
ఎస్ఎంఎస్ఈ లుగా రిజిస్ట్రేషన్ చేయడం ఒక ఎత్తయితే వారు ఎంపిక చేసుకున్న యూనిట్ ప్రాఫిటబుల్ అవుతుందా? కాదా? అనే అంశంపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంతో తమ పని అయిపోయిందనేది కాకుండా పరిశ్రమల శాఖ నుంచి రాయితీతో పెట్టుబడులు పెట్టిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం ప్రచారం కోసం కాకుండా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక యూనిట్ ఉందనే దశకు చేరుకోవాలంటే కేవలం స్వయం సహాయక సంఘాలకే కాకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునే వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఏపీలో సముద్ర ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ లో కోటీశ్వరులుగా ఉన్న వారిని చూస్తున్నాం. అటువంటి యూనిట్స్ వైపు కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోల్డ్ స్టోరేజీలకు ప్రభుత్వం ఎలాగైతే ఎక్కువ మొత్తంలో సబ్సిడీ ఇస్తుందో అదే మాదిరి ఎస్ఎంఎస్ ఈలకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.