బావ పొట్టిగా ఉన్నాడని బావమరిది చంపేశాడు
ఇప్పటి వరకు జరిగిన పరువు హత్యల కంటే భిన్నంగా గుంటూరు జిల్లా హానర్ కిల్లింగ్ జరిగింది.
By : Vijayakumar Garika
Update: 2025-10-10 04:23 GMT
ఏ బావమరిది అయినా తన సోదరి సంసారం బాగుండాలని కోరుకుంటాడు, తన సోదరి కన్నీళ్లు పెట్టుకోకూడదని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు. అందుకోసం తన చేతనైన సాయం చేసేందుకు అందరి కంటే ముందుంటాడు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన కీర్తి అంజనీ విషయంలో అది రివర్స్ అయ్యింది. బావమరిదే తన సోదరి భర్తను కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లైన పది రోజులకే శాశ్వతంగా తన సోదరికి శోకం మిగిల్చాడు. తన బావ గణేష్ పొట్టిగా ఉన్నాడనే అవమానం తట్టుకోలేక బావమరిది హత్యకు పాల్పడ్డాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ (25) పెళ్లైన 10 రోజులకే దారుణ హత్యకు గురయ్యాడు. ఆమె సోదరుడు దుర్గారావు చేత కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అందుకు కారణం ఏంటంటే బావ గణేష్ ’పొట్టి’గా (ఎత్తు తక్కువగా) ఉన్నాడని, మాయమాటలతో తన సోదరి కీర్తి అంజనీని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని దుర్గారావు ద్వేషం పెంచుకున్నాడు. బావ గణేష్‌ను చంపేసి పగ తీర్చుకున్నాడు. ఈ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఘటన నేపథ్యం.. ప్రేమ కథ
బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్, దూరపు బంధువులైన తెనాలి ప్రాంతానికి చెందిన కీర్తి అంజనీ దేవి (22) మధ్య పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే, గణేష్ ఎత్తు తక్కువగా ఉన్నాడని కీర్తి తల్లిదండ్రులు సంబంధాన్ని వద్దనుకున్నారు. అయితే కీర్తి కుటుంబ సభ్యులకు నచ్చక పోయినా మొదటి చూపులోనే గణేష్, కీర్తి అంజనా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకుని, రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. తాము పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో, పది రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం కుటుంబాల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. మరి ముఖ్యంగా కీర్తి అంజనా దేవి ఇంట్లో ద్వేషానికి కారణమైంది.
హత్యకు దారితీసిన పగ..
కీర్తి సోదరుడు దుర్గారావు (28) గణేష్‌పై తీవ్ర పగ పెంచుకున్నాడు. పొట్టిగా ఉన్న గణేష్ తన మాయమాటలతో చెల్లిని మోసం చేశాడు అని అసహ్యించుకున్నాడు. గణేష్ మీద ద్వేషం, పగ పెంచుకున్నాడు. వివాహం జరిగినే రోజు దుర్గారావు గణేష్‌ను అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడిన గణేష్, తనకు కీర్తి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని సూచించారు, కానీ దుర్గారావు పగ మరింత ముదిరింది.
రిసెప్షన్ ప్రయత్నాల్లో ఉండగా దారుణ హత్య
పెళ్లి గుడిలో చేసుకోవడంతో కనీసం రిసెప్షన్‌ను అయినా గ్రాండ్‌గా చేయాలని గణేష్, కీర్తి నూతన జంట భావించింది. దీని కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి, ఆ డబ్బులతో గణేష్ తన స్వస్థలం ఏడవురు గ్రామానికి (బాపట్ల జిల్లా) వెళ్తుండగా దారిలోనే దుర్గారావు, అతని ముగ్గురు స్నేహితులు గణేష్‌ను ఆటకాయించారు. కత్తితో 20 కంటే ఎక్కువసార్లు పొడిచి, శరీరాన్ని తూట్లు చేశారు. హత్య తర్వాత దుర్గారావు స్నేహితులతో కలిసి పారిపోయారు. స్థానికులు గణేష్‌ను కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం చేశారు. సంఘటన తెలిసిన వెంటనే బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దుర్గారావు, అతని స్నేహితులను 24 గంటల్లోపు అరెస్ట్ చేశారు. నిందితులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.