TTD | సాంకేతిక సహకారంతో యాత్రికుల మెరుగైన సేవలు
శ్రీవారి బ్రహ్మెత్సవాల ఫలితం అన్ని ఉత్సవాలకు ప్రేరణ కావాలన్న టీటీడీ ఈఓ.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-10 13:11 GMT
సాంకేతికత ఆధారంగా రద్దీ అంచనా వేయడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీటీ కార్యాచరణకు సిద్ధం చేస్తోంది. దీనికోసం కమాండ్ కంట్రోల్ ( Command Control )తో సిసి కెమెరాలను అనుసంధానం చేసి, రియల్ టైం ఫీడ్ బ్యాక్ ( Real-time feedback ) తీసుకోవడానికి సాంకేతిక వ్యవస్థలను పటిష్టం చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. దీనికి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలలో వైకుంఠ ఏకాదశి, రథసప్తమి నిర్వహణకు సంసిద్ధం కావాలని ఆయన కోరారు. ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించం సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత సమీక్ష సమావేశం శుక్రవారం తిరుపతి మహాతి ఆడిటోరియంలో అధికారులు, మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో శుక్రవారం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు.
"తిరుమలలో ఈ నెల రెండో తేదీతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమష్టి కృషి, పోలీస్, టీటీడీ విజిలెన్స్. సిబ్బంది సమన్వయంతో
శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతం అయ్యాయి" అని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాలలో ఈసారి అనూహ్యంగా సానుకూల వాతావరణం కనిపించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. టిటిడి (Tirumala Tirupati Devasthanams TTD ) సౌకర్యాలపై గ్యాలరీలు, క్యూలోని భక్తులు వంద శాతం సంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా సమష్టి కృషికి ఫలితం దక్కిందన్నారు.
"బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లిన సమయంలో అనేక సూచనలు చేశారు. టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ విభాగం, టిటిడి అధికారులు, సిబ్బంది సమన్వయం, శ్రీవారి సేవకుల సేవలు, భక్తులు, మీడియా సమిష్టి సహకారంతో విజయవంతం అయ్యాం" అని ఆయన మననం చేసుకున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే ఉప రాష్ట్రపతి సిపి. రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు పర్యటన, పీఏసీ - 5 ప్రారంభోత్సం కార్యక్రమాలు ఉన్నా అందరూ సమిష్టిగా పనిచేశారని ఈఓ అభినందించారు.
"శ్రీవారి గరుడసేవ రోజు అమలు చేసిన ప్రణాళికా ఫలించింది. రానున్న అన్ని ఉత్సవాలకు ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం" అని ఈఓ సింఘాల్ కోరారు. గ్యాలరీల్లో యాత్రికులకు మంచి దర్శనం కల్పించడం తోపాటు అన్నప్రసాదాల పంపిణీలో శ్రీవారి సేవకులు, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భద్రతా సిబ్బంది సేవలు అభినందనీయం అని ఆయన అన్నారు.
"మూడు నెలల ముందే ప్రణాళికలు రూపకల్పన, సమన్వయం కోసం చేసిన యత్నాలు ఫలించాయి" అని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తాను అనివార్య కారణాలతో రాలేకపోయినా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు కాన్పరెన్స్ లతో సమీక్షించుకున్నామని గుర్తు చేశారు.
టీం వర్క్ వల్లే..
అన్ని విభాగాలు, శాఖల అధికారులు, సిబ్బంది టీం వర్క్ వల్ల యాత్రికులకు సేవలు అదించగలిగామని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం చెప్పారు. ఇదే స్ఫూర్తితో సమన్వయంతో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, భక్తుల రద్దీ నియంత్రించేందుకు క్యూలైన్లు ఏర్పాటు, టిటిడి, విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు.
"ఈ ఏడాది టెక్నాలజీ సద్వినియోగం చేసుకున్నాం" అని అన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తిరుమల, తిరుపతిలో పార్కింగ్ సమస్య లేకుండా, వృద్ధులకు సేవలు, చిన్న పిల్లలకు జియో ట్యాగ్ సిస్టం ఏర్పాటు, సోషల్ మీడియా, సైబర్ వింగ్ చాలా అప్రమత్తంగా పనిచేశారన్నారు. సమష్టిగా పనిచేయడం వల్లే సీఎం నారా చంద్రబాబు నుంచి అభినందనలు అందాయని టిటిడి సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ గుర్తు చేశారు. ఈ ఏడాది అదనంగా 40 వేల మంది భక్తులు వచ్చినా, పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.