భార్యపై కోపం.. బావిలో దూకి.. రాత్రంతా ప్రతిధ్వనించిన ఆర్తనాదాలు..
మదనపల్లె వద్ద పోలీసు సాహసంతో నిలిచిన ప్రాణం.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-10 12:30 GMT
ఆలయానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న విషయమై తగాదా పడ్డారు. భార్యపై కోపంతో ఆమె నుంచి దూరంగా వెళ్లిపోయిన ఓ వ్యక్తి చేతి నరాలు కోసుకున్నాడు. అంతటితో ఆగక, ఆత్మహత్య చేసుకోవాలిన బావిలోకి దూకాడు. అడ్డుగా ఉన్న మొక్కల కొమ్మలు పట్టుకుని వేలాడుతూ రాత్రాంతా ఆర్తనాలు చేశాడు. ఈ విషయం తెలియని భార్య పట్టణంలో గాలిస్తూనే ఉంది. శుక్రవారం ఉదయం గమనించిన ఓ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కాపాడి, ప్రాణాలు నిలిపాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె వద్ద వెలుగు చూసింది.
"మా పోలీసులు శాంతిభద్రతలు కాపాడడంలోనే కాదు. ఆపదలో ఉన్న వారికి సాయం అందించడంలో ముందుంటారు" అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పోలీస్ కానిస్టేుబల్ ను అభినందించారు. చిన్న విషయాలకు గొడవలు పడి, కాపురాలు నాశనం చేసుకోవద్దని కూడా ఆయన హితవు పలికారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఆలయానికి వచ్చి...
బెంగళూరుకు చెందిన చెంగాచారి(26), భార్య శశి, కుమారిడి తో కలసి గురువారం మదనపల్లి పట్టనానికి సమీపంలోని ఓ ఆలయానికి వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో భార్యా భర్తలు గొడవ పడ్డారు. భార్య శశి తిట్టిందనే మనస్థాపంతో చెంగాచారి కలత చెందాడు. ఆమె చూస్తుండగానే, చేయి కోసుకున్న చెంగాచారి మడికయిల శివాలయానికి సమీపంలో ఉన్న కోడుగుడ్డు బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. బావిలో ఉన్న చెట్ల కొమ్మలు అడ్డుతగిలాయి. అప్పటి వరకు వేదనతో ఉన్న చెంగాచారిలో ప్రాణంపై తీపి గుర్తుకు వచ్చింది. ఆ పాడు బడిన బావిలో చెట్ట కొమ్మలు పట్టుకుని వేలాడుతూ, రాత్రంతా కేకలు వేస్తూనే ఉన్నాడని తెలిసింది.
ఈ విషయం తెలియని భార్య శశి దేవతానగర్ లోని బంధువుల ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడికి కూడా భర్త చెంగాచారి రాలేదని తెలుసుకుని పట్టణంలో గాలింపు చేపట్టారని తెలిసింది. ఇదిలావుండగా,
జనం గుంపు చూసి..
ఆలయానికి వచ్చిన వారితో పాటు దారిన వెళ్లే వారికి శుక్రవారం ఉదయం బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ గుంపు ఎక్కువ అయింది. బావిలో ఓ వ్యక్తి అరుస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎలా కాపాడాలనేది అర్థం కాని స్థితిలో తర్జన భర్జన పడుతున్నారు. అదే సమయంలో మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ జీపు డ్రైవర్ (ఆర్ముడ్ రిజర్వు కానిస్టేబుల్ ) ఎస్. అమరనాథ్ తన పిల్లలను స్కూలుకు బైకులో తీసుకుని వెళుతున్నాడు. జనం గుంపు ఉండడం గమనించి, ఏదో జరిగిందనే సందేహంతో బావి వద్దకు చేరుకునే సరికి అసలు విషయం తెలిసింది.
తాడు సాయంతో బావిలోకి దిగి...
విషయం అర్థం చేసుకున్న కానిస్టేబుల్ అమరనాథ్ వెంటనే బలమైన తాళ్ల సాయంతో బావిలోకి దిగాడు. కొమ్మలు పట్టుకుని అరుస్తున్న బలంగా పట్టుకుని చెంగాచారిని చాకచక్యంగా ఒడ్డుకు చేర్చి, ప్రాణాలు కాపాడాడు. దీంతో కానిస్టేబుల్ అమర్ అందరి నుంచి అభినందనలు అందుకున్నారు. వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించి, బాధితుడు చెంగాచారిని మదనపల్లె ప్రభుత్వానికి చేర్చడంలో కానిస్టేబుల్ అమర శ్రద్ధ తీసుకున్నారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న చెంగాచారి భార్య శశి ఆస్పత్రికి చేరుకుంది. రాత్రంతా చేతి నుంచి రక్తస్రావం కావడం, మబ్బులో రాత్రంతా చిక్కుబడిపోయిన చెంగాచారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.
కానిస్టేబుల్ కు రివార్డు
ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్ అమరనాథ్ ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. అమరనాథ్ కు రివార్డు ప్రకటించారు.
"ప్రాణాలను పణంగా పెట్టి, సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విధి నిర్వహణలో అమరనాథ్ చూపిన సాహసం, నిబద్ధత ప్రశంసనీయం. మా పోలీస్ సిబ్బంది కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే కాకుండా, ఆపదలో ఉన్న పౌరులను కాపాడేందుకు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మిగతా పోలీస్ సిబ్బందికి ఆదర్శం" అని ఎస్పీ ధీరజ్ వ్యాఖ్యానించారు.