పోర్టులు, ఎయిర్ పోర్టులతో ఏపీ అభివృద్ధి
భవిష్యత్ లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు చెప్పారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులతో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూపునకు చెందిన వివిధ ప్రాజెక్టులను శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఇథనాల్ ప్లాంట్, నంద గోకులం లైఫ్ స్కూల్, సేవ్ ద బుల్, పవర్ ఆఫ్ బుల్ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించి.. పరిశీలించారు. నంద గోకులం లైఫ్ స్కూల్ విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు.. కీలక పరిశ్రమలు వచ్చాయి. కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయి. దగదర్తి విమానాశ్రయం త్వరలోనే వస్తుంది. బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ , క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతున్నాయి. రాష్ట్ర ప్రగతిలో.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. సోమశిల, కండలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 150 టీఎంసీల నీళ్లు ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉంటాయి. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉంచుతాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు.