జగన్, నీ ధైర్యం ఏమైందీ? అసెంబ్లీకి వెళ్లడానికి భయమెందుకు?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్దికి అసెంబ్లీకి మించిన వేదిక మరొకటి ఉందా? ఉంటే ఆ వేదిక ఏమిటి? ఎందుకు అసెంబ్లీకి వెళ్లనంటున్నాడు?
వైఎస్ జగన్ ఈ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పోరాటం ద్వారానే విజయం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పోరాడుతూ వచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనపై కేసు నమోదైంది. దానిని కూడా లెక్క చేయలేదు. సీబీఐ జగన్ ను రిమాండ్ కు పంపింది. చాలా కాలం బెయిల్ కూడా రాకుండా చేశారు. అయినా పట్టించుకోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పార్టీని తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించారు. ఒకసారి ఎంపీలను రాజీనామా చేయించారు. మరో సారి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి బై ఎలక్షన్ కు వెళ్లారు.
2014లో ప్రతిపక్షంలో కూర్చున్నా తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని అసెంబ్లీ వేదికగా తెలియజెప్పారు. ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారనేది కాదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎంతవరకు లేవనెత్తి ప్రజలకు చేరువ కాగలిగామనేది తెలియజెప్పారు. అప్పుడు కూడా 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా చంద్రబాబు ఇచ్చారు. అయినా వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగానే చివరి వరకు కొనసాగారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2014లో అప్పటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన అవమానాలను లెక్క చేయకుండా అడుగులు వేసిన జగన్ ఆ తరువాత అధికారం చేపట్టాక శివప్రసాదరావును అదే స్థాయిలో అవమానించారు. క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తన కుమారుడి వ్యాపార కార్యాలయంలో ఉండటంపై కేసు నమోదు చేయించారు. ఇవి తట్టుకోలేక కోడెల చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ్మినేని సీతారామ్ ను స్పీకర్ గా పెట్టి కోడెల ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే తమ్మినేని ప్రవర్తించేలా చేశాడు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు మైకు సరిగా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ చావును కోరుకున్నాడు. చచ్చేదాకా కొట్టాలని ఒక వీడియో అయ్యన్న పాత్రుడు మాట్లాడినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై కూడా చాలా సార్లు జగన్ స్పందించారు. అయ్యన్న వంటి వ్యక్తులు స్పీకర్ కావడం దారుణమన్నారు. అయినా అసెంబ్లీలో ఎదుర్కొనే సత్తా జగన్ కు ఉందని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఎందుకు అసెంబ్లీకి వెళ్లనని జగన్ అంటున్నారనేది చర్చగా మారింది.
ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతుంటే మైకు కట్ చేస్తారు. అవమానాలు కొత్త కాదు. అసెంబ్లీలో ఉండి మైకు కోసం పోటీ పడటం కంటే అసెంలబ్లీకి వెళ్లకపోవడమే మంచిదని అంటూ, ప్రజా సమస్యలపై మీడియానే మాకు సహకరించాలని అనటం చర్చగా మారింది. అసెంబ్లీ సమయంలో ప్రతి రోజూ ప్రజా సమస్యలు మీడియా వేదికగా ప్రస్తావించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు చర్చించి వాటిని పరిష్కరించేందుకు అసెంబ్లీనే మంచి వేదిక. ఎన్నికలు సుదూరంలో ఉన్నప్పుడు అసెంబ్లీని వేదికగా ప్రతిపక్షం ఉపయోగించుకోవాలి. కానీ ఎందుకో జగన్ వెనుకడుగు వేస్తున్నారు. వెళ్లటం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మైకు ఇవ్వకుండా, మాట్లాడనీయకుండా అడ్డంకులు కల్పిస్తే అది ప్రభుత్వానికే అవమానంగా భావించాలి తప్ప తమకు అవమానంగా ఎందుకు భావించాలనేది రాజకీయ మేధావుల మాట.
తల్లిని, చెల్లిని దూరంగా పెట్టిన అంశాలు ప్రస్తావించి అసెంబ్లీలో ఇరుకున పట్టే అవకాశం ఉందని, అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలని జగన్ నిర్ణయించారనే ప్రచారం కూడా సాగుతోంది. నిజానికి శాంతి భద్రతల సమస్య, హామీ ఇచ్చినట్లు డీబీటీ పథకాలు అమలు చేయక పోవడం, సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వంటి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ పై చర్చించే అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ ఎందుకు జగన్ జారవిడుచుకుంటున్నారో అర్థం కావటం లేదని వైఎస్సార్సీపీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.