సీఎం బాబును పూలవర్షంతో స్వాగతించారెందుకో..?
జనసేన రాయుడు హత్య ఘటన నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-19 10:05 GMT
తిరుపతి పర్యటనకు వచ్చిన సీఎం ఎన్.చంద్రబాబుకు ఊహించని స్వాగతం లభించింది. శనివారం ఉదయం అయన రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఉన్న రేణిగుంట పట్టణం వద్ద గతానికి భిన్నంగా రోడ్డుకు ఇరుపక్కల నిలబడిన మహిళలు పూలుచల్లుతూ స్వాగతించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు సీఎం ఎన్. చంద్రబాబు వాహనం చేరుకోగానే మహిళలు పూలవర్షంతో స్వాగతించారు. గతంతో ఎన్నడూ లేని విధంగా భారీగా చేరిన పార్టీ శ్రేణులు ప్రధానంగా మహిళలు సెల్ఫీలు తీసుకోవడం, పూలతో స్వాగతించడం వెనుక ప్రధాన కారనం లేకపోలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన తో టిడిపి ప్రధానంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది.
టిడిపి కూటమిలో కీలక భాగస్వామి జనసేన నియోజకవర్గ బహిష్కృత ఇంచార్జ్ కోట వినుత కారు డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాసులు (రాయుడు) హత్య ఘటన తెలిసిందే. ఈ ఎపిసోడ్లో జనసేన బహిష్కృత నేతలు కోట వినీత, చంద్రబాబు దంపతులు టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ కూడా చేసిన వ్యాాఖ్యలతో సెల్ప్ గోల్ వేసుకున్నారు. దీంతో అధినేతను ఆగ్రహం చల్లార్చడానికి సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనను ఎమ్మెల్యే సుధీర్ చక్కగా వినిగించుకున్నట్లు కనిపిస్తోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం తూకివాకం వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా సీఎం చంద్రబాబు వెంట ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆయన నియోజకవర్గం పరిధిలోనిదే. అధికారులతో సమీక్షించే సమయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ యథావిధిగానే వినమ్రంగా నిలబడి, వివరిస్తూ ఉండడం కనిపించింది.
సీఎం ఎన్. చంద్రబాబుకు కుడిపక్కన నిలబడి ఉన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
వినతిపత్రాలు స్వీకరించి...
విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కరిస్తామంటూ వారికి ఆయన ఊరడించారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అందుబాటులో ఉన్న అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి వస్తే విమానాశ్రయంలో లేదా ఆయన పాల్గొని సభల వద్ద వినతి పత్రాలు ఇవ్వడానికి బాధితులు ఎక్కువ మంది రావడం సహజం.
పూల వర్షం..
రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత సీఎం చంద్రబాబుకు మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ప్లేట్లలో పూలు ఉంచుకొని దారి పొడవునా ఆయన వాహనంపై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది ముస్లిం మహిళలే పూలు చల్లుతూ కనిపించారు. కొందరు మహిళలు అయితే సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువ తాపత్రయపడ్డారు. రేణిగుంట నుంచి సీఎం చంద్రబాబు కు దారి పొడవునా ప్రజలు ప్రధానంగా మహిళలు పూలు చల్లుతూ స్వాగతించడం ఈసారి పర్యటనలో ప్రత్యేకంగా కనిపించింది.
ప్రజలు తనను ఆత్మీయంగా స్వాగతించడాన్ని స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు తన వాహనం డోర్ పై నిలబడి అభివాదం చెబుతూ ఉత్సాహంగా కనిపించారు. సాధారణంగా గతంతో పోలిస్తే సీఎం చంద్రబాబు వ్యవహార సరళి చాలా సాధారణంగా మార్చుకున్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఏకాంతంగా ప్రజలతో కలిసి మాట్లాడుతూ వెళ్లడం, వారితో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రార్ధన తీస్తూ ఉత్సాహ పరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానం ఇది సర్వసాధారణంగానే ఉంది.
ఓ మహిళ ఉత్సహం
పూలు చల్లించింది ఎవరు?
రాష్ట్రంలో టిడిపి కూటమి కొలువుతీరిన రోజే కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మొదటిసారి వచ్చారు. ఆ తర్వాత ఇప్పటికీ ఏడాది కాలంలో లెక్కలేనన్నిసార్లు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయనకు యథావిధిగానే సాధారణ స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా పర్యటన కోసం సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం రావడంతో దారి పొడవునా పూలు చల్లారు. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టిడిపి - జనసేన మధ్య చిచ్చు
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో మొదటిసారి చోటు చేసుకున్న పరిణామాలు కూటిలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి, జనసేన మధ్య చిచ్చు రగిలింది. జనసేన బహిష్కృత నాయకురాలు వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు తో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డికి అంతర్గతంగా విభేదాలు రగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో..
శ్రీకాళహస్తి జనసేన నాయకురాలి వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు ( రాయుడు) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో వినూత, చంద్రబాబు దంపతులను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిన విషయమే.
"శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దీనికి కారణం" అని తమిళనాడు పోలీసులు రిమాండ్ తీసుకువెళ్లే సమయంలో కోట వినూత, చంద్రబాబు దంపతులు ఆరోపించారు.
"తమ వద్ద పనిచేసే డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు రాయుడిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోవర్టుగా మార్చుకున్నాడు. నా బెడ్ రూంలో సెల్ఫోన్ పెట్టడం ద్వారా వీడియోలు తెప్పించుకున్నాడు" అని కోట వినుత ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే..
రెండు రోజుల కిందట తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయం వెలుపల ప్రమాణం చేసినంత పని చేశారు.
"దేవుడు సాక్షిగా చెబుతున్నా. నా బిడ్డల మీద ఒట్టు. రాయుడు హత్య కేసులో నాకు ఏ సంబంధం లేదు" అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రమాణం చేశారు.
ఆరోపణలు చేసిన బహిష్కృత జనసేన నేతలు కానీ ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రమాణం చేయాలని ఎవరూ కోరలేదు. అయితే ఆయన ఎందుకు అలా ప్రమాణం చేసినట్టు?
ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి చీఫ్, సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
శ్రీకాళహస్తి ఎపిసోడ్ పై ఎలాంటి స్పందన లేదు. కానీ,
బాబు ఆగ్రహంగా ఉన్నారా?
శ్రీకాళహస్తిలో మిత్రపక్ష జనసేన పార్టీ నాయకులతో ఉన్న గొడవల నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతమతమవుతున్నట్లు పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
జనసేన బహిష్కృత కోట వినుత డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు రాయుడు హత్య కేసు నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అంతరం ఏర్పడినట్లు కనిపిస్తుంది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఎక్కడ బయట మాట్లాడకుండా గుమ్మనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంలో సాధారణంగానే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వినమ్రత ప్రదర్శించారు. దారి పొడవునా తన నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా జనాలను నిలపడం, వారితో పూలు చెల్లించడం ద్వారా టిడిపి అధినేత, సీఎం ఎన్ చంద్రబాబును శాంతింప చేయడానికి, తాను ఇలాంటి వివాదాల్లోకి వెళ్లలేదని చెప్పుకోవడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రయత్నించారని విషయంపై చర్చ జరుగుతోంది.