జెన్-జడ్ తరం భవిష్యత్తుకు దిక్సూచి

ఫీజు రియింబర్స్‌మెంట్‌లో రూ.4,200 కోట్లు, వసతి దీవెనలో రూ.2,200 కోట్లు తో కలిపి మొత్తం రూ.6,200 కోట్లు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపించారు.

Update: 2025-11-06 13:13 GMT

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై చర్చించిన ఆయన, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. కల్మషం లేని రాజకీయ వ్యవస్థ విద్యార్థి దశ నుంచే ప్రారంభమవుతుందని, రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. జెన్-జడ్ తరం భవిష్యత్తుకు దిక్సూచీగా ఉండాలని, రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి విద్యార్థీ ఉద్యోగాలు సంపాదించే పరిస్థితులు సృష్టించాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని జగన్ తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు మంచి చదువులు అందించేందుకు ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుతో పోటీపడేలా తీర్చిదిద్దామని, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్, విద్యాదీవెన కింద రూ.12,609 కోట్లు, వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇచ్చామని,  ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌లో రూ.4,200 కోట్లు, వసతి దీవెనలో రూ.2,200 కోట్లు పెండింగ్ పెట్టి మొత్తం రూ.6,200 కోట్లు బకాయి చేసిందని ఆరోపించారు.

ఉద్యోగాల సృష్టిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, గ్రామ సచివాలయాల్లో 1.2 లక్షలు, ఆర్టీసీలో 52 వేల మందిని రెగ్యులరైజ్ చేశామని జగన్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 4.7 లక్షల యూనిట్ల ద్వారా లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్, సింగపూర్ కేబుల్, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి ప్రాజెక్టులకు తాము అడుగులు వేశామని, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు దరిద్రపు పనిగా అభివర్ణించిన జగన్, 2019 వరకు 12 మెడికల్ కాలేజీలు ఉండగా, తమ హయాంలో మూడేళ్లలో 17 కొత్తవి తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి జిల్లాకు గవర్నమెంటు మెడికల్ కాలేజీ ఇచ్చామని, 2,550 సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. చంద్రబాబు సీట్లు వద్దని లేఖ రాశారని, ప్రైవేటీకరణతో స్కాములు చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11-12 తేదీల్లో ర్యాలీలు, డిసెంబర్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు చేపట్టాలని, కోటి సంతకాల కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని విద్యార్థి నేతలకు జగన్ సూచించారు. 

Tags:    

Similar News