GAME CHANGER | రాంచరణ్ బంగారమైతే అల్లు అర్జున్ ఏమిటీ?
తన అన్న చిరంజీవి కుమారుడు రాంచరణ్ బంగారమైతే వరుసకు అల్లుడయ్యే అల్లు అర్జున్ ఏమిటనే ప్రశ్నకు తెరదీశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.;
By : The Federal
Update: 2025-01-05 02:47 GMT
తన అన్న చిరంజీవి కుమారుడు రాంచరణ్ బంగారమైతే వరుసకు అల్లుడయ్యే అల్లు అర్జున్ ఏమిటనే ప్రశ్నకు తెరదీశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రోరింగ్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ సినిమా పుష్ప గురించి మాట మాత్రమైనా మాట్లాడని పవన్ కల్యాణ్... రాంచరణ్ ని ఆకాశానికి ఎత్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం రామ్‌చరణ్‌ది (Ram Charan) అని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Gamechanger) మంచి విజయం సాధించాలని కోరకుంటున్నట్లు చెప్పారు.
ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక రాజమండ్రి (రాజమహేంద్రవరం)లో జరిగింది. ఈ వేడుకలో పవన్‌కల్యాణ్ ఏమన్నారంటే.. ‘‘మనం ఎప్పుడూ మూలలను మర్చిపోకూడదు. మన సినిమా ఖ్యాతిని ఎందరో గొప్ప దర్శకులు, నిర్మాతలు విశ్వవ్యాప్తం చేశారు. భారత సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు. ఆయన చాలా గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో నేరుగా తెలుగు సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూశా. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని అర్థమవుతోంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా బాగా ఆడాలని అభినందనలు తెలియజేస్తున్నా. ‘తొలిప్రేమ’ చేసిప్పుడు దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్. నా మూవీ పోస్టర్ చూసి.. బాగా ఆడుతుందని భావించి, ఆ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నాతో ‘వకీల్‌సాబ్’ తీశారు. నేను డబ్బుల్లేక బాగా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సినిమా అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ నడపడానికి ‘వకీల్‌సాబ్’ ఇంధనంలా పనిచేసింది’’ అన్నారు.
మీకు దెబ్బ తగిలితే నా గుండెకు గాయం...
‘‘నేటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మీలో మీకు గొప్ప ధైర్యం ఉంది. తలచుకుంటే మెగాస్టార్ చిరంజీవిలా మీరు సాధించగలరు. ఆయన ఇచ్చిన ఊతం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. చిరంజీవి ఎంతో కష్టపడిపైకి వచ్చారు. ఆ కష్టాన్ని చూస్తూ పెరిగిన రామ్‌చరణ్ ఈస్థాయికి చేరుకున్నాడు. మేమెప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోలేదు. ఇక్కడ చాలా మంది హీరోలున్నారు. మా జీవితంలో ఎప్పుడూ ఇంకొక హీరో సినిమా పోవాలని కోరుకోలేదు. ‘సర్వేజనా సుఖినో భవంతు’ అని మా నాన్న నేర్పారు. ఇటీవల పబ్లిక్ ఫంక్షన్స్ పెట్టాలంటే చాలా ఒత్తిడి ఉంటోంది. కానీ, సినిమా అందరికీ తెలియాలి. మూడేళ్లు కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి ‘గేమ్ ఛేంజర్’ తీశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీరంతా క్షేమంగా వెళ్లాలని కోరుకుంటున్నా. మీకు దెబ్బ తగిలితే నా గుండెకు గాయమవుతుంది. సినిమాను సినిమాగానే చూడండి. హీరోలు వచ్చినప్పుడు ఒకరిమీద ఒకరు పడిపోవద్దు. జాగ్రత్త చూడండి’’
‘రంగస్థలం’లో చరణ్ నటన సూపర్బ్..
‘‘రామ్‌చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి ఆంజనేయుడు. ఎంత ఎదిగినా, శక్తిమంతుడైనా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని మా నాన్నగారు ఆ పేరు పెట్టారు. అన్నయ్య చిరంజీవి నాకు తండ్రిలాంటి వారు. చరణ్ నాకు తమ్ముడిలాంటి వాడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని. ఏడేళ్ల వయసులో తెల్లవారుజామునే లేచి హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు. ఇంత ప్రతిభ, సమర్థత ఉందని, ఎవరికీ తెలియదు. సుకుమార్ తీసిన ‘రంగస్థలం’లో చరణ్ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నా. భవిష్యత్‌లో తప్పకుండా రావాలి. గోదావరి జిల్లాల ప్రభావం అసలే మాత్రం లేని చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చిరంజీవిగారి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు. తండ్రి మెగాస్టార్ అయితే, కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు’’
రామ్‌చరణ్ మా బంగారం
‘‘నేను చాలా తక్కువ సందర్భాల్లో అసూయపడుతుంటా. ‘మగధీర’లో చరణ్ గుర్రపు స్వారీ చూసినప్పుడు అసూయపడ్డా. నేనూ నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించింది. చిత్ర పరిశ్రమలోని అందరి హీరోలకు రామ్‌చరణ్ స్నేహితుడు. ఏడాదిలో 100 రోజులు అయ్యప్ప, ఆంజనేయస్వామి దీక్ష చేస్తుంటాడు. ‘ఇవన్నీ ఎందుకు’ అని అడిగితే, ‘బాధ్యతతో మెలగడానికి, అహంకారం లేకుండా ఉండటానికి’ అంటాడు. చెప్పుల్లేకుండా తిరుగుతూ ఉంటాడు. అయితే, సూటు బూటు.. లేకపోతే దీక్షలో ఉంటాడు. వ్యక్తిత్వంలో ఎంతో బలం ఉంటేనే ఇది సాధ్యం. రామ్‌చరణ్ మా బంగారం. ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయి కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నా. లవ్ వ్యూ రామ్‌చరణ్.. లవ్ వ్యూ ఆల్’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
అంతకు ముందు దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ‘‘నేను 30ఏళ్లలో 14 సినిమాలు చేశా. ఒక్కటీ నేరుగా తెలుగు సినిమా లేదు. అయినా.. మీరు నన్ను ఆదరించారు. మీ ప్రేమను మర్చిపోలేను. మీకు తిరిగి గౌరవం ఇవ్వాలని, మీ కోసం నేరుగా ఒక తెలుగు సినిమా తీయాలని ‘గేమ్ ఛేంజర్’ తీశా. ఈ అవకాశం కల్పించిన నిర్మాత దిల్‌రాజు, రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. ఇది అచ్చ తెలుగు మూవీ. కలెక్టర్, మినిస్టర్‌కు మధ్య జరిగే యుద్ధమే ‘గేమ్‌ఛేంజర్’. హీరో వెనుక ఓ కథ ఉంటుంది. అదేంటనేది ఆసక్తికరం. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పవన్ కల్యాణ్ మర్యాద, గౌరవం చూసి, చాలా సంతోషంగా అనిపించింది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ పదాలకు అర్థమేమిటీ?
ఈ వేడుకలో పవన్ కల్యాణ్ వాడిన... "మూలాలు మర్చిపోకూడదు", "ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండడం", "అహంకారం", "మెగాస్టార్, గ్లోబల్ స్టార్", "వ్యక్తిత్వం", "బయట మీటింగులంటే వత్తిడి", "మా బంగారం" వంటి పదాలు ఎవరికి గుచ్చుకోవాలో వారికి గుచ్చుకున్నట్టున్నాయి. ఇటీవలి కాలంలో అల్లు అరవింద్ కుటుంబంతో పవన్ కల్యాణ్ కి సఖ్యత దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి. మీడియా కోడై కూసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడం, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ కావడం తెలిసిందే. ఈ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా తొక్కిసలాడలో ఓ మహిళ చనిపోవడం, దానికి అల్లు అర్జున్ కూడా బాధ్యుడేనంటూ పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి జరిగినా ఈ రెండు కుటుంబాల మధ్య మాటామంతి లేకపోయింది. అందరూ పరామర్శించి వచ్చినా పవన్ కల్యాణ్ మాత్రం వెళ్లలేదు.
సరిగ్గా ఈ దశలో తన అన్న కుమారుడు రాంచరణ్ ని ప్రశంసిస్తూ వాడిన పదాలు, మాట్లాడిన తీరు అల్లు అర్జున్ ని ఉద్దేశించినవే అని సాక్షాత్తు పవన్ కల్యాణ్ సొంత సామాజిక వర్గం వారే వ్యాఖ్యానిస్తున్నారు. అహంకారం తలకెక్కినపుడు పవన్ కల్యాణ్ ఇలాగే వ్యవహరిస్తుంటాడని ఆయన అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు.