చంద్రబాబును బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?
మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మరో సారి మీడియా ముందుకొచ్చారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను, పాలన తీరును ఎండగట్టారు.
అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబును బొంకుల బాబు అని ఎందుకు అనకూడదని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దానికి పోలిక లేదన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. వలంటీర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను నాశనం చేసిందని, వలంటీర్లకు ఉపాధి లేకుండా చేసిందని మండిపడ్డారు. అదే విధంగా లిక్కర్ షాపుల్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని, ఇప్పుడు వారిని కూడా కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు.