ఎమ్మెల్యే కొలికపూడి ఎందుకు ఇలా చేస్తున్నారు?
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పదుడుగా మారారు. కారణాలు ఏవైనా నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారు.;
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ వారు మూడో సారి క్రమశిక్షణా సంఘం ముందుకు పిలిచారు. తన నియోజకవర్గమైన తిరువూరులో అలజడి సృష్టించడమే ఇందుకు కారణం. ఈ యన కారణంగా ఇప్పటికి ఇద్దరు మహిళలు పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తమ ఇళ్ల పైకి వచ్చి తమను కొట్టి అవమానించారనేది ప్రధానమైన ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా టాప్ లేని జీప్ లో తిరుగుతుంటాడు. వేషధారణ వెరైటీగా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాని, బయట మాత్రం ఎక్కడ కనిపించినా పసుపు పచ్చ అంచులున్న ఆకుపచ్చ టవల్ ను తలకు చుట్టూ చుట్టుకుంటాడు. దానిని ఒక విధంగా తలగుడ్డ చుట్టుకోవడం అనొచ్చు. తలగుడ్డ చుట్టుకోవడం కూడా వెరైటీగానే ఉంటుంది. సాధారణంగా రైతులు చుట్టే తలగుడ్డ లాగా ఉండదు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజు..
తాను విద్యావంతుడు. ఒకరిచేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అయినా తప్పులు చేస్తున్నాడు. తప్పని చెప్పినా వినడం లేదు. ఎ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షుని భార్య పేరుతో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ ను నేరుగా ప్రొక్లైన్ తెప్పించి కూల్చడం మొదలు పెట్టాడు. తానే దగ్గరుండి కూల్పించే కార్యక్రమాన్ని చేపట్టడంతో చుట్టుపక్కల వారంతా గుమికూడాదరు. ఎంపీపీకి మద్దతుగా కొందరు రాగా, ఎమ్మెల్యేకు మద్దతుగా కొందరు వచ్చారు. ఎంపీపీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పడగొట్ట వద్దని పోలీసులు చెప్పినా వినలేదు. చట్ట ప్రతినిధి చేసే పని ఇది కాదని, నిబంధనల ప్రకారం మీరు చెబుతున్నట్లుగా రోడ్డును ఆక్రమించి భవనం నిర్మించి ఉంటే సర్పంచ్ నోటీసులు ఇచ్చి కూల్చి వేయొచ్చని, ఇలా మీరు ప్రొక్లైన్ తెప్పించి మీరే కూల్చివేసే కార్యక్రమాన్ని చేపట్టడం మంచిది కాదని వారించినా వినలేదు. పైగా కారు పైకి ఎక్కి ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దీంతో పొలీసులు ఎంపీపీ భార్య ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆయన ఎమ్మెల్యే అయిన మూడు రోజులకే జరిగింది.
సర్పంచ్ భార్య ఆత్మహత్యా యత్నం
చిట్యాల గ్రామానికి చెందిన సర్పంచ్ ని నోటికొచ్చినట్లు మాట్లాడాడని, విఆర్ఏ గా ఉన్న సర్పంచ్ ఇంటిపైకి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు దాడి చేసి కొట్టి అవమానించారని ఆరోపిస్తూ సర్పంచ్ భార్య పురుగు మందు తాగి ఆత్మ హత్యయత్నం చేసింది. కాగా ఈనెల 11న ఎ కొండూరు మండలంలోని గోపాలపురంలో ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడ కొత్తగా నిర్మంచిన రోడ్డుపై నడవకుండా ఒక వ్యక్తి ముళ్ల కంప వేశారని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కంప ఎందుకు వేశారు. కారణాలు ఏమిటి అనేవి ఆలోచించకుండా కంప తొలగించారు. కంప వేసిన భూక్యా కృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన భార్య చంటి ని ఎమ్మెల్యే అనుచరులు కొట్టారనేది ఆరోపణ. అవమానం భరించలేక భూక్యా కృష్ణ భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. వెంటనే వైద్య శాలకు తరలించి ఆమె ప్రాణాలు స్థానికులు కాపాడారు.
భక్యా రాంబాబు, ఆయనకు వరుసకు సోదరుడైన భూక్యా కృష్ణకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. కృష్ణకు సంబంధించిన స్థలంలో రోడ్డు వేశారని, ఈ రోడ్డుపై ఎవ్వరూ నడిచేందుకు వీలు లేదని కృష్ణ కంప వేశారు. ఆవేశాలకు పోకుండా వెంటనే కంప తొలగించి ఆయన ఇంటిపైకి అనుచరులు వెళ్లి అనుచితంగా ప్రవర్తించకుండా ఆలోచించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు.
టీడీపీలోనూ వ్యతిరేకత
తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ వారిలోనూ ఎమ్మెల్యే కొలికపూడి అంటే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని వర్గ వైషమ్యాలు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు వచ్చిన తరువాత వచ్చాయని, బీసీలను అగ్రవర్ణాలపైకి వెళ్లేలా రెచ్చ గొడుతున్నారని, ఎస్సీ లను కూడా ఇదే విధంగా రెచ్చగొట్టి సమస్యలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్సార్ సీపీలు గెలిచాయి. కొలికపూడి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు సీటు ఇచ్చి గెలిపించారు. అమరావతి నిర్మాణంలో వైఎస్సార్ సీపీ వైఖరికి నిరసనగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలోనే చంద్రబాబు కొలికపూడిని చేరదీశారు.
ఉన్నత విద్యావంతుడు..
బాగా చదువుకున్న వ్యక్తి. హైదరాబాద్ లో సివిల్స్ రాసే వారికి కోచింగ్ సెంటర్ కూడా నిర్వహించారు. రాజకీయాలపై ఆసక్తితో అమరావతి ఉద్యయంలో తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడారు. దీంతో ఆయనకు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇచ్చారు. ఈయన విశాఖపట్నం, హైదరాబాద్ ల్లోని యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకునిగా పనిచేశారు. పీజీ చదువుకున్నారు. ఒక మంచి అవకాశం వచ్చింది. ఎస్సీ కోటాలో తిరువూరు నుంచి ఎమ్మెల్యే కాగలిగారు. కానీ ఆయన చదువుకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా ఉండటంతో ఇదేమిటనేది పలువురి సందేహాలకు తావునిస్తోంది. హుందాతనం ఆయనలో ఎక్కడా కనిపించడం లేదని, అహంకారం కనిపిస్తుంటుందని పలువురు తిరువూరు స్థానికులు చెబుతున్నారు.
సీసీ రోడ్డుపై కంప వేసింది పక్కా వైఎస్సార్సీపీ కార్యకర్త..
తాను గోపాలపురం ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లా. రోడ్డుపై ముళ్ల కంప వేశారని సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి దీనిని నేనే తొలగించా. ఆ తరువాత పంచాయతీ సభ్యుడైన భూక్యా కృష్ణ భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిసింది. నాకు ఆమె ఆత్మహత్యా యత్నానికి ఎటుంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గోపాలపురంలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారించేందుకు తెలుగుదేశం పార్టీ విచారణ కమిటీ కొలికపూడిని పిలిపించింది. కమిటీలో ప్రభుత్వ సలహాదారు ఎంఎం షరీఫ్, మంత్రి బీసీ జనార్థన్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఉన్నారు. వీరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నుంచి వివరణ తీసుకున్నారు. చెప్పేది పూర్తయిన తరువాత తాను రాసుకుని తెచ్చిన సమాచారాన్ని వారికి ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూక్యా కృష్ణ పక్కాగా వైఎస్సార్సీపీ కార్యకర్త. ఈ నియోజకవర్గంలో 2019లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్ పై ఈ కుటుంబం రాళ్ల దాడి చేసింది. 2014లో అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామిదాస్ పై దాడి చేశారు. 2013లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు కంభంపాడులో వాటర్ బాటిల్ చంద్రబాబుపై ఈ కుటుంబం వారే విసిరారని చెప్పారు. ఇవ్నీ చెప్పిన దాన్ని బట్టి వైఎస్సాఆర్ సీపీ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇలా జరిగిందనే భావన కలిగించేలా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం ముందుకు ఎమ్మెల్యే హోదాలో ఏడు నెలల కాలంలో మూడో సారి హాజరయ్యారు. పైగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటేనే జనం హడలిపోయేలా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొలికపూడి చేష్టలకు తల పట్టుకుంటున్నారు. పార్టీ వారే మీపై ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారని ప్రశ్నించారు. తన తప్పేమీ లేదని చెబుతున్నారే తప్ప చెయ్యలేదని మాత్రం చెప్పటం లేదు. దీంతో కొలికపూడి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కొరకరాని కొయ్యగా మారారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.