విజయవాడ నగరంలో ప్రబలిన డయోరియా
ఒకరి మృతి. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సుమారు 50 మంది;
విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో గత మూడు రోజులుగా విరోచనాలు, వాంతులతో ఇబ్బందులు పడి ప్రభుత్వాసుపత్రిలో సుమారు 50 చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం విరోచనాలు, వాంతులతో శ్రీరామ నాగమణి వైద్య నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరగా రాత్రి చనిపోయారు. చనిపోయిన నాగమణి భౌతికాయాన్ని సందర్శించిన సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణారావు, సిపియం ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బి సత్యబాబు, నాయకులు టి శ్రీనివాస్, ఎం.వి. రమణ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మంది వైద్యం పొందుతున్నారు. కేర్ & షేర్ లో కొద్దిమంది, అర్బన్ హెల్త్ సెంటర్లలో 50 మంది వరకు మంది వైద్యం పొందుతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: సీపీఎం
మూడు రోజులుగా డయేరియాతో ఇబ్బందులు పడుతున్నా నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోక పోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంచినీటి పైప్ లైన్ లో మురికి నీళ్లు కలిసి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారా? అని సీపీఎం వారు ప్రశ్నించారు. ఇంటింటి సర్వే చేయాలని, స్థానికంగా వైద్య బృందాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయం అందించాలని వారు కోరారు. లీకేజీ వాటర్ పైపులు వెంటనే మార్చి కొత్త పైపులు వేయాలని, ఇంటింటికి మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా అందించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ. 10లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఆదేశం...
విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా కేసుల నమోదుపై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆరా తీశారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్షీశాను ఆదేశించారు. మంత్రి ఆదేశించడంతో కలెక్టర్ లక్ష్మీశా విజయవాడ జిజిహెచ్ ను బుధవారం రాత్రి సందర్శించారు.
ట్యాంకర్లతో నీరు: కలెక్టర్
ఆర్ఆర్ పేటకు చెందిన 18 మంది విజయవాడ జీజీహెచ్ లో వాంతులు విరేచనాలతో చేరి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని కలెక్టర్ లక్ష్మీశా మంత్రికి తెలిపారు. రంగు మారిన నీటిని సరఫరా చేస్తున్నారని బాధితులు కలెక్టర్ లక్ష్మీశా దృష్టికి తీసుకురావడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు.
బాధితులు వాంతులు విరేచనాలతో మంగవాళం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం మధ్య విజయవాడ జీజీహెచ్ లో చేరారు. ఓ వేడుక సందర్ఢంగా స్థానికులకు ఆహార పంపిణీ జరిగింది. ఆసుపత్రిలో చికిత్సకోసం చేరిన వారిలో కొంతమంది వేడుక సందర్భంగా తీసుకున్న ఆహారం అనంతరం వాంతులు, విరేచనాల బారిన పడినట్లు వైద్యులకు తెలిపారు. ఆర్ఆర్ పేటలోనే ఓ పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సుహాసిని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎవి రావు మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరిన వారి నుంచి సేకరించిన రక్త, మలమూత్రాల నమూనాలను పరీక్ష చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు అందిన 8 మల నమూనాల ఫలితాలు నెగటివ్‌గానే వచ్చాయని చెప్పారు. మరోవైపు సత్యనారాయణపురానికి చెందిన ఓ మధ్య వయస్కురాలు దీర్ఘకాల వ్యాధులతో ఆసుపత్రిలో మంగళవారం మరణించారని చెప్పారు. ఈ మరణం కేసుకు న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా ఘటనకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.