గ్రామీణ శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ

శాస్త్రవిజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు డా. యలవర్తి నాయుడమ్మ తపించారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొనియాడారు.;

Update: 2025-09-10 17:07 GMT
డాక్టర్ నాయుడమ్మ అవార్డును కేంద్ర ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాల అందిస్తున్న గవర్నర్ తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ

శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ అవార్డును ఆర్థికరంగంలో పీపుల్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపును పొందిన మద్దిరాల నాగరాజు కు బహూకరించటం సముచితమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. బుధవారం తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పాల్గొన్నారు.

కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాల, డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు, జాతీయ చర్మ పరిశోధనా సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ స్వర్ణ వి కాంత్‌ పాల్గొన్నారు.

సభలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గౌరవనీయులు జిష్ణుదేవ్‌ వర్మ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆర్థక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాలకు ప్రదానం చేశారు.


సభలో మాట్లాడుతున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఈ సంధర్భంగా జరిగిన సభలో గవర్నర్ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌కు వెన్నెముక అయిన ఆర్థికరంగంలో నాగరాజు, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్‌ మంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్‌ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్‌ గుర్తుచేసుకున్నారు.

అవార్డు గ్రహీత కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆర్ధిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాల మాట్లాడుతూ భారతదేశం ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్‌ నాయుడమ్మ తన పరిశోధనలు, ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు. సైన్స్ ను గ్రామాలు, రైతులు, సామాన్యుల వద్దకు తీసుకెళ్లటం ఆయన విశిష్టతగా అన్నారు.

ఇటీవలి కాలంలో మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభను చాటిందన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు రూ.23 లక్షల కోట్లకు పైగా, 7 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో రూ.10 లక్షల కోట్ల రుణం అందినట్టు తెలిపారు. 84 లక్షలకు పైగా ఎస్‌హెచ్‌ గ్రూపులకు రూ.3 లక్షల కోట్ల రుణాలు అందటం గ్రామీణ పారిశ్రామికతకు నిదర్శనంగా చెప్పారు. దేశంలోని ఎంఎస్‌ఎంఈలు 11 కోట్లమందికి పైగా ఉపాధిని కల్పిస్తూ వికసిత్‌ భారత్‌కు ఇంజిన్లుగా ఉన్నాయన్నారు. అలాగే డిజిటల్‌ మౌలిక వసతులు వికసిత్‌ భారత్‌కు పునాదిగా నాగరాజు చెప్పారు. యూపీఐ ప్రతి నెలా బిలియన్లకొద్దీ లావాదేవీలను చేస్తోందని గుర్తుచేశారు. ఈ డిజిటల్‌ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదనీ, ప్రపంచానికి ఒక నమూనాగా వివరించారు. వీటన్నిటికీ భారతీయ వాణిజ్య బ్యాంకులు విక్సూచిగా ఉన్నాయని చెప్పారు.


గవర్నర్ కు జ్ఞాపికను బహూకరిస్తున్న డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు

జాతీయ చర్మ పరిశోధనా సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ స్వర్ణ వి కాంత్‌ మాట్లాడుతూ డాక్టర్‌ నాయుడమ్మను ‘నేషన్‌ బిల్డర్‌’గా అభివర్ణించారు. దేశంలోని 37 జాతీయ పరిశోధనశాలలకు అధిపతిగా చేసిన నాయుడమ్మ తమందరికీ ఎంతో స్ఫూర్తిగా చెప్పారు. విదేశాలు టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ఎగుమతులు ప్రధానమైన తోలు పరిశ్రమలో 2030 నాటికి 50 బిలియన్‌ డాలర్ల వృద్ధి నిజంగా మాకు సవాలుగా చెబుతూ నాయుడమ్మ చూపిన బాటలో అధిగమనిస్తామని ధీమావ్యక్తంచేశారు.

డాక్టరు యలవర్తి నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ బహుమతులు, సర్టిఫికెట్లను బహూకరించారు. తొలుత తెనాలి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వద్ద తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

Tags:    

Similar News