ఫలించిన మంత్రి నారా లోకేష్ కృషి...

నేపాల్ నుంచి తొలివిడతగా బీహార్ బార్డర్ కు 22మంది తరలింపు, గురువారం బాధితుల తరలింపునకు రంగం సిద్ధం.;

Update: 2025-09-10 16:21 GMT
నేపాల్ బాధితులను ఏపీకి తరలించేందుకు తీసుకున్న చర్యలను మీడియాకు బుధవారం రాత్రి సచివాలయంలో వివరిస్తున్న మంత్రి లోకేష్

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు పౌరులను తరలించేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నేపాల్ లోని 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బుధవారం రాత్రి సచివాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలివిడతగా నేపాల్ లోని హెటౌడా నుంచి 22మంది తెలుగు పౌరులను సురక్షితంగా బీహార్ బార్డర్ కు తరలించినట్లు తెలిపారు. మిలటరీ సాయంతో హెటౌడా నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న బీహార్ బోర్డర్ మోతిహరికి తెలుగు పౌరులు బయలుదేరారని చెప్పారు. 

బీహార్ లోని మోతిహరి నుంచి తెలుగు పౌరులను రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. నేపాల్ లో చిక్కుకున్న 217మందిలో 118మంది మహిళలు కాగా, 99మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం వాసులు 42మంది, విజయనగరం 34మంది, కర్నూలుకు చెందిన వారు 22మంది కాగా, మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారు. తమను క్షేమంగా తరలిస్తున్న మంత్రి లోకేష్ కు తెలుగు ప్రజలు తెలిపారు. నేపాల్ లో చిక్కుకున్న 217మంది తెలుగు పౌరుల్లో 173మంది ఖాట్మాండూ పరిసరాల్లోని హోటళ్లలో తలదాచుకున్నారు. 22మంది హెటౌడాలో (ప్రస్తుతం వీరు మిలటరీ సాయంతో బయలుదేరారు), 10మంది ఖాట్మాండూకు సమీపంలోని పోఖ్రాలో, 12మంది సిమి కోట్ లో ఉన్నారు.

కర్ఫ్యూ సడలించగానే ఖాట్మాండూ నుంచి ప్రత్యేక విమానం

ఖాట్మాండు పరిసరాల్లో ఉన్న 173మందిని తరలించేందుకు ఇండిగో-360 విమానం రేపు ఉదయం 10గంటలకు డిల్లీ నుంచి ఖాట్మాండు చేరుకుంటుంది. ఖాట్మాండూలో రేపు కర్ఫ్యూ సడలించిన వెంటనే వీరందరినీ విశాఖపట్నం, విజయవాడ తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎపి భవన్ అధికారులు ఖాట్మాండూ లోని తెలుగుపౌరులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తెలుగు పౌరుల లిస్టును తరలిచేసి బోర్డింగ్ పాసులను సిద్ధం చేస్తున్నారు.

నేపాల్ సైన్యంతో సమన్వయం చేసుకొని రేపు ఉదయం హోటళ్ల నుంచి తెలుగు పౌరులను విమానాశ్రయానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సిమికోట్ లో చిక్కుకున్న 12మంది పౌరులను బుద్ధ ఎయిర్ విమానంలో రేపు ఉదయం 9గంటలకు యుపి సరిహద్దుల్లోని నేపాల్ గంజ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ విమానంలో తరలింపు సాధ్యం కాకపోతే హెలీకాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచారు. పోఖ్రాలోని 10మందిని 14సీటర్ చార్టర్డ్ విమానం ద్వారా నేపాల్ గంజ్ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందుకు నేపాల్ వైమానిక దళ అనుమతి కావాల్సి ఉంది. ఇందుకోసం సంప్రదింపులు చేస్తున్నారు. నేపాల్ గంజ్ చేరాక వారందరినీ రోడ్డుమార్గం ద్వారా లక్నోకి తరలించేందుకు ఉత్తరప్రదేశ్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు.

ఫోన్లో నిరంతరం సంప్రదిస్తున్న లోకేష్

బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు మంత్రి నారా లోకేష్ శాయశక్తులా కృషిచేస్తున్నారు. నేపాల్ బాధితుల విషయం తెలుసుకున్న వెంటనే అనంతపురం పర్యటనను రద్దుచేసుకున్న లోకేష్ ఉదయం 10గంటలకే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం ఫస్ట్ బ్లాక్ లోని ఆర్టీజిఎస్ వార్ రూమ్ కు చేరుకున్న లోకేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తోపాటు సీనియర్ ఐఎఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మిలతో తదితరులతో సహాయ చర్యలపై చర్చించారు. ప్రస్తుతం ఖాట్మాండు విమానాశ్రయం మూసివేసి ఉన్నందున ఎయిర్ పోర్టు ఓపెన్ చేసిన వెంటనే బాధితులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు భారత విదేశాంగశాఖ, నేపాల్ ఎంబసీ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు 217మంది బాధితులు 12 గ్రూపులుగా వివిధ హోటళ్లలో తలదాచుకున్నట్లు గుర్తించారు. సిమిల్ కోట్ లో చిక్కుకున్న 12మంది బాధితులను పరిస్థితులు అనుకూలించిన వెంటనే లక్నో తరలించి, అక్కడి నుంచి రాష్ట్రానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. బాధితుల్లో అత్యధికులు ఖాట్మాండు, పరిసరాల్లోని హోటళ్లలో ఉన్నందున ఖాట్మాండు నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలవారీగా బాధితుల వివరాలను సేకరించి, వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బాధితులకు భరసా...

నేపాల్ లోని వివిధ హోటళ్లలో తలదాచుకున్న బాధితులతో మంత్రి లోకేష్ వీడియో కాల్ మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతున్నారు. నేపాల్ లోని ముక్తినాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న విశాఖకు చెందిన సూర్యప్రభతో మంత్రి లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోగల రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 84మంది తలదాచుకున్నారు. రోజారాణి అనే మహిళతో మాట్లాడిన లోకేష్ అధైర్య పడొద్దు... మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారు. ఖాట్మాండులోని పశుపతి ఫ్రంట్ హోటల్ లో తలదాచుకున్న మంగళగిరికి మాచర్ల హేమ సుందర్ రావు, నాగలక్ష్మిలతో మంత్రి లోకేష్ వీడియో కాల్ లో మాట్లాడారు. మంగళగిరికి చెందిన 8మందితో పాటు ఆ హోటల్ లో మొత్తం 40మంది తలదాచుకున్నట్లు వారు తెలిపారు.

సోమవారం తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు హఠాత్తుగా దాడిచేశారని, తాము ప్రాణాలు అరచేతబట్టుకొని హోటల్ కు చేరుకున్నట్లు వారు చెప్పారు. తాము ఖాట్మాండు ఎయిర్ పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్నామని తెలిపారు. భయపడవద్దని... క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఢిల్లీలోని ఎపి భవన్ సీనియర్ అధికారి అర్జా శ్రీకాంత్ తో సిఎంఓ అధికారి కార్తికేయ మిశ్రా బాధితులకు సహాయ చర్యలపై నిరంతరం సంప్రదిస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా ఎపిఎన్ఆర్ టి చైర్మన్ వేమూరి రవికుమార్, సిఇఓ కృష్ణమోహన్ సహాయచర్యలను సమన్వయం చేస్తున్నారు.

నేపాల్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఫోన్

నేపాల్ కు వచ్చి చిక్కుకున్నట్లు 80 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ఖాట్మండ్ లోని హోటల్ రాయల్ కుసుమ్ నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించినట్లు తెలిపిన మంత్రి దుర్గేష్.
రాష్ట్ర ప్రభుత్వం తరపున తమకు రక్షణ కల్పించాలని బాధితులు డిప్యూటీ సీఎం ను స్వయంగా కోరినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడి.
యాత్రికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి అవసరమైన సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపిన మంత్రి దుర్గేష్.
Tags:    

Similar News