అమరావతిని జగన్‌ ఎందుకు వ్యతిరేకించారు?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎందుకు వ్యతిరేకించారు. ఐదేళ్లలో అమరావతి ఆనవాళ్లు లేకుండా ఎందుకు చేశారు.

Update: 2024-07-12 05:23 GMT

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి నగర నిర్మాణం మణిహారమని, ఈ నగర నిర్మాణం ద్వారా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీని ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటూ ఏపీలో కొత్తగా రాజధాని నిర్మించుకోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుగా ఉండేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సిటీ కాబట్టి తెలంగాణకు మరో ప్రతేకమైన రాజధాని నగరం అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్థాయి నగరం కావాలంటే విజయవాడ, గుంటూరు నగరాలు జంట నగరాలుగా కలిసి పోవాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు విజయవాడ, గుంటూరు నగరాలకు పైభాగాన, రెండు నగరాలకు 25 కిలో మీటర్ల దూరంలో తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసి సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతానికి అమరావతిగా పేరు పెట్టారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమరావతి నిర్మాణం చేపట్టినట్లు ప్రచారం తీసుకొచ్చారు. పెట్టబడి దారులను ఆహ్వానించారు.

అమరావతి కోసం ప్రత్యేకంగా భూ సమీకరణ
అమరావతి నగరాన్ని నిర్మించేందుకు స్థానిక రైతుల నుంచి 53,748 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ (భూ సమీకరణ చట్టం)ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఈ భూమిని ప్లాట్లుగా వేసి కొన్ని నివాసాలకు, కొన్ని వ్యాపారాలకు రైతులకు ఇచ్చే ఒప్పందంపై ల్యాండ్‌ పూలింగ్‌ జరిగింది. రైతులకు ఇవ్వగా మిగిలిన భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడి దారుల భవనాల నిర్మాణాలు చేపడతారు. దీంతో అమరావతి పెద్ద నగరంగా ఏర్పాటవుతుంది. అమరావతిని కలుపుతూ రహదారులు ఏర్పాటు చేస్తారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా అమరావతి మీదుగా వెళ్లేందుకు వీలు కల్పిస్తారు. ఇలా అమరాతి ప్రతిపాదనలు రెడీ అయి పనులు మొదలయ్యాయి.
అమరావతిని జగన్‌ ఎందుకు వద్దనుకున్నారు...
2019 ఎన్నికల ప్రచారంలో అమరావతిని తాను వచ్చిన తరువాత అభివృద్ధి చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుందని, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి లెజిస్లేటివ్‌ రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని ప్రకటించి అసెంబ్లీలో బిల్లుకూడా ప్రవేశపెట్టారు.
అమరావతికి భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని, భూములు ఇచ్చిన రైతులు తప్ప వేరే వారు నివశించేందుకు అవకాశం లేకుండా చంద్రబాబు చేశాడని, ఇది ఒక వర్గానికే పరిమితం అవుతుందని, పేదలు నడిచేందుకు కూడా అమరావతి అంగీకరించదని జగన్‌ భావించడమే కాకుండా పలు సందర్బాల్లో తన మనసులోని మాటను పరోక్షంగా చెప్పారు. అందుకే ఈ ప్రాంతంలో పేదలు కూడా నివశించేందుకు వీలుగా 50 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు ప్రకటించి పంపిణీ చేశారు. ఈ పట్టాల పంపిణీపై తెలుగుదేశం పార్టీ వారు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది.
పైగా అమరావతి పేరును తన శత్రువైన రామోజీరావు ప్రతిపాదించారు. ఆయన సూచన మేరకు చంద్రబాబు అమరావతి పేరు పెట్టారు. చంద్రబాబు హయాంలో పనులు మొదలు పెట్టారు. తన హయాంలో నిర్మించినా చంద్రబాబుకే పేరు వస్తుందననే ఆలోచన కూడా అమరావతిని ముందుకు కదలకుండా చేసిందని చెప్పొచ్చు. ఎప్పుడో అభివృద్ధి జరుగుతుందని ఆలోచించే కంటే అభివృద్ధి చెందిన నగరంగా ఉన్న విశాఖపట్నం అన్ని విధాల పరిపాలనా రాజధానికి అనుకూలంగా ఉంటుందని జగన్‌ వాదించారు. వారి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ద్వారా చెప్పించారు. చంద్రబాబుపై ఉన్న ద్వేషం, ఆయన సామాజిక వర్గానికి అమరావతిలో పెద్ద పీట వేయడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోయారనేది రాజకీయ పరిశీలకుల మాట.
అమరావతిని అడ్డుకుని నిలబడలేక పోయిన జగన్‌
అమరావతి రాజధాని నిర్మాణాన్ని వదిలేసిన జగన్‌కు అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి. కేంద్రంతో సంప్రదించకుండా మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో పెట్టిన జగన్‌ ఆ బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు కూడా జగన్‌కు ముటిక్కాయలు వేసింది. అమరావతి రాజధానిగా ఉంటుందని, దానిని మార్చే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదని తీర్పు వెల్లడించింది. అమరావతి రాజధానిగా ఉండాలని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఐదేళ్లుగా ఉద్యమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి కూడా కనిపించని వ్యతిరేకత జగన్‌పై వచ్చింది. రాజధాని అంశంలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా సక్సెస్‌ కాలేదు. అయినా మొండి పట్టుదలతో అడుగులు వేశారు. ప్రజలు 2024లో జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగన్‌ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.
Tags:    

Similar News