‘రాయలసీమను చుట్టుముట్టిన మూడు ముప్పు గ్రహాలు’
రాయలసీమకు బిజెపి ఒక శనిగ్రహం. వైకాపా ,టిడిపిలు రాహు కేతువులు: ధ్వజమెత్తిన తులసి రెడ్డి
By : The Federal
Update: 2025-11-18 07:11 GMT
రాయలసీమకు బిజెపి ఒక శని గ్రహంలా, వైకాపా ,టిడిపిలు రాహు కేతువులుగా దాపురించాయని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు.
రాయలసీమ ప్రాంతం అటు రాష్ట్రంలోనే కాక ఇటు దేశంలో కూడా అత్యంత వెనుకబడ్డ ప్రాంతమని శివరామకృష్ణ కమిషన్, శ్రీకృష్ణ కమిషన్ తదితర అనేక నివేదికలు స్పష్టం చేశాయని అన్నారు.
డాక్టర్ ఎన్ తులసి రెడ్డి
ఈ రోజు రాయలసీమ దినోత్సవం సందర్భంగా వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పార్టీల పాలనలో రాయలసీమకు అనేక మోసాలు, ద్రోహాలు, అన్యాయాలు జరిగాయన్నారు.
ఆయన ప్రసంగం విశేషాలు:
నవంబర్ 18వ తేదీకి రాయలసీమ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది .1928 నవంబర్ 18 వరకు ఈ ప్రాంతాన్ని దత్త మండలం అని పిలిచేవారు .1928 నవంబర్ 18న నంద్యాలలో కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో దత్త మండలము అని పేరు మార్చి రాయలసీమ అని నామకరణం చేయబడింది రాయలసీమ అనే పదం ఈ ప్రాంత వాసుల ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక.
రేపు అనగా నవంబర్ 19వ తేదీన ప్రధానమంత్రి రాయలసీమ ప్రాంతంలోని పుట్టపర్తికి ,ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లా కమలాపురానికి వస్తున్నారు.
కనీసం ఈ సందర్భంగా నైనాసరే వీరి హయాంలో రాయలసీమ ప్రాంతానికి జరిగిన క్రింద పేర్కొన్న అన్యాయాలను సరిదిద్ద వలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.
1. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారము రాజధాని లేదా హైకోర్టులో ఒకదానిని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. కానీ ఏర్పాటు కాలేదు.
2. రాష్ట్రం తో పాటు రాయలసీమకు ప్రత్యేక హోదా సంజీవని లాంటిది .ఇది అమలు కాలేదు.
3. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వము బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు రాయలసీమకు ,ఉత్తరాంధ్రకు విడుదల చేయాలి .కానీ చేయలేదు.
4. విభజన చట్టంలో 13వ షెడ్యూల్డ్ ప్రకారము కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మాణం కావాలి .కానీ కాలేదు.
5. విభజన చట్టంలో 13వ షెడ్యూల్డ్ ప్రకారము దుగ్గరాజపట్నం వద్ద మేజర్ ఓడరేవు నిర్మించాలి .కానీ నిర్మించలేదు.
6. శ్రీకాళహస్తి వద్ద మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును మంజూరు చేసి నిర్మించగా మోడీ ప్రభుత్వం మూసివేసింది.
7. రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసి కొంతమేరకు నిర్మించగా మోడీ ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయి.
8. నిరంతరము రద్దీగా ఉంటూ, తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న కడప రాజంపేట కోడూరు రేణిగుంట జాతీయ రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరిస్తూ మంజూరు చేసి టెండర్లు పిలిచినప్పటికీ మూడు సంవత్సరాలైనా పనులు ప్రారంభం కాలేదు.
9. 11 సంవత్సరాల అయినా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమకు తరలించకుండా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది.
10. తెలుగు గంగ,గాలేరు నగరి ,హంద్రీనీవా ,వెలిగొండ, అన్నమయ్య తదితర రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక నత్త నడకన సాగుతున్నాయి."
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాయలసీమ పర్యటన సందర్భంగా నైనా సరే పైన పేర్కొన్న అన్యాయాలను మోసాలను, ద్రోహాలను సరిదిద్దే టందుకు నిర్మాణాత్మకమైన ,నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు.