పెద్దశేషవాహనంపై పరమపద నాథుడి అలంకారంలో సిరులతల్లిగా..

తిరుచానూరులో వైభవంగా సాగుతున్న పద్మావతీ అమ్మవారి ఉత్సవాలు

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-18 07:02 GMT



అల్పపీడన ప్రభావంతో వర్షం కురుస్తున్నా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు. ఏడు తలల పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వర్షం కురుస్తుండడంతో ఘటాటోపం (గొడుగు) కింద అమ్మవారి పల్లకీసేవ నిర్వహించారు. మాడవీధుల్లో బారులుదీరిన యాత్రికులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందించారు.


వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరింద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, పలువురు అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


వాహనసేవలో..


పద్మావతీ అమ్మవారి వాహనసేక ముందు కళాకారుల నృత్యాలు అలరించాయి. అంతేకాకుండా, అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
వాహనసేవ ప్రత్యేకత

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
కళార్చన

పద్మావతీ అమ్మవారి వాహనసేవ ముందు మహిళలు, యువతుల కళాప్రదర్శనలు కనువిందుగా సాగాయి.

రెండు గంటల పాటు సాగిన ఈ ఉత్సవంలో అడుగడుగునా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

కోయల కళాప్రదర్శన ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



రాథాకృష్ణల పదవిన్యాసం యాత్రికులను మంత్రముగ్ధులను చేసింది.


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల తరహాలోనే తిరుచానూరు పద్మావతీ అమ్మవారి  ఉత్సవాల్లో కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. దేశంలోని విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు పరస్పర అవగాహన చేసుకునే విధంగా నాణ్యమైన కళారూపాలకు ప్రాధాన్యత ఇచ్చామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. 

 


 


Tags:    

Similar News