నవరత్న వారసుల్లో అధ్యక్షా.. అనేది ఎవరు.!?

చిత్తూరు జిల్లాలో 9 మంది రాజకీయ వారసులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో ఓటర్లు ఎవరిని అసెంబ్లీకి పంపనున్నారనే విషయం ఇంకొద్ది రోజుల్లో తేలనుంది.

Update: 2024-05-30 13:14 GMT

చిత్తూరు జిల్లాలో 9 మంది రాజకీయ వారసులు పోటీ చేశారు. వారిలో అధికార వైఎస్ఆర్సిపి నుంచి ఐదుగురు, టిడిపి నుంచి నలుగురు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో జరగనున్న ఓట్ల లెక్కింపు అనంతరం వారిలో ఎవరు అసెంబ్లీలో పాదం మోపుతారనేది తేలుతుంది.

వారసత్వ రాజకీయాన్ని ఆలంబనగా చేసుకొని పోటీ చేసిన వారిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల కుమారులు, ఒకరి కుమార్తె ఉన్నారు. ఇంకో ఇద్దరు మొదటిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టిడిపి నుంచి ముగ్గురు వారసులు రెండోసారి పోటీ చేశారు. మరొకరు మొదటిసారి అదృష్ట పరీక్షను ఎదుర్కొన్నారు. ఇంకో ఐదు రోజుల్లో వారి భవితవ్యం తేలుతుంది. జూన్ నాలుగవ తేదీ జరగనున్న లెక్కింపులో ఓటర్లు వారిలో ఎవరిని అసెంబ్లీకి పంపించనున్నారనేది వెల్లడి అవుతుంది.

భూమన.. చెవిరెడ్డి

చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిది గురుశిష్యుల సంబంధం. అన్నదమ్ముల అనుబంధంలా ఉంటుంది. 2024 ఎన్నికల్లో భూమన కరుణాకరరెడ్డి తప్పుకుని తన కుమారుడు భూమన అభినయ రెడ్డిని పోటీ చేయించారు. తిరుపతిలో కూటమి అభ్యర్థి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీ చేశారు. రాష్ట్రంలో తిరుపతి నియోజకవర్గంలోని పోలింగ్ తక్కువ శాతం నమోదయింది. ఇక్కడ పోటీ కూడా గట్టిగానే ఉన్నట్లు భావిస్తున్నారు. కూటమిలో అంతర్గత వ్యత్యాసాలు బయటికి కనిపించకున్నా, వైఎస్ఆర్‌సీపీకి మార్జిన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. చంద్రగిరిలో గట్టిపట్టు సాధించిన భాస్కర్ రెడ్డి తన కుమారుడు, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిని పోటీ చేయించారు. టిడిపి అభ్యర్థి పులివర్తి నానితో గట్టి పోటీ ఎదురైంది. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా, వారిద్దరి కుమారులు విజయం సాధిస్తేనే భవిష్యత్తులో తండ్రులకు ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు.

తండ్రి స్థానంలో కుమార్తె

జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి డిప్యూటీ సీఎం కే. నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకి వచ్చారు. గత రెండు ఎన్నికల్లో నారాయణస్వామి మంచి మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలో రాజకీయంగా, పాలనాపరంగా పట్టు లేకున్నా, రాజకీయ హోదా.. పెద్ద నాయకులకు కంటగింపుగా మారింది. దీంతో ఆయనకు ఒకసారి చిత్తూరు ఎంపీ, మళ్లీ జీడి నెల్లూరు అని ప్రకటించిన అధిష్టానం చివరికి ఆయన కుమార్తె కృపారాణికి అవకాశం కల్పించింది. నియోజకవర్గంలో పనులన్నీ పునాదిరాళ్లకే పరిమితమైన నేపథ్యంలో.. టిడిపి అభ్యర్థి థామస్‌కు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

అందరి దృష్టి కుప్పంపైనే

జిల్లాలోనే కాదు. రాష్ట్రం, జాతీయంగా కూడా కుప్పం అసెంబ్లీ స్థానం అంటే ప్రాధాన్యత ఉంది. ఇక్కడి నుంచి టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు ఎనిమిదో సారి శాసనసభ పోటీ చేస్తున్నారు. ఆయనపై వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్ పోటీ చేశారు. భరత్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి 2014, 2019లో వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. చంద్రబాబు చేతిలో ఆయన ఓడారు. గత ఎన్నికల తర్వాత చంద్రమౌళి మరణించడంతో ఆయన తనయుడు భరత్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు వైఎస్ఆర్సిపి తన అభ్యర్థిగా పోటీ చేయించింది. సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనుచర వర్గం మొత్తం కుప్పంపై ఫోకస్ పెట్టింది. "అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, దొంగ ఓటర్లను జాబితా నుంచి తొలగింప చేశామని, వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయం తథ్యం. టిడిపి చీఫ్ చంద్రబాబు ఓటమి తప్పదు" అని బల్లగుద్ది చెబుతున్నారు. కానీ, "చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు నడవడానికి వీలు లేకుండా మారాయి. గ్రామ సచివాలయ కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రాలు మినహా మరో అభివృద్ధి జాడలేదు. కిలోమీటర్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. గ్రానైట్ క్వారీల నుంచి వసూళ్ల పర్వం ఎక్కువగా ఉంది" అని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. " కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గవచ్చు గాక, ఊడడం సాధ్యమయ్యే పని కాదని" స్పష్టం చేస్తున్నారు.

తొలిసారి పోటీ

జిల్లాలోని సత్యవేడు ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నూకతోటి రాజేష్ మొదటిసారి పోటీ చేశారు. జిల్లాలో సీనియర్ అయిన దివంగత మాజీ మంత్రి గుమ్మడి కుటుంబం కుమారుడుగా ఆయనకు గుర్తింపు. వాస్తవంగా కుతూహలమ్మ సోదరి కుమారుడే రాజేష్. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. వైఎస్ఆర్సిపి నుంచి తిరుగుబాటు చేసి, టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోనేటి ఆదిమూలం కు ఆ పార్టీలోని సీనియర్ల నుంచి వ్యతిరేకత బలంగా ఉంది. ఇది రాజేష్ కు కలిసి రాగలరని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి కుటుంబం సొంత కొడుకు హరికృష్ణ 2019 ఎన్నికల్లో జీడీ నెల్లూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం సత్యవేడు నుంచి పోటీ చేస్తున్న నూకతోటి రాజేష్ గెలుపొందితే కుతూహలమ్మ రాజకీయ వారసత్వానికి కొనసాగింపు ఉంటుందని భావిస్తున్నారు.

ఈసారన్న... అధ్యక్షా... అంటారా

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, నగరి, పీలేరు నుంచి రెండోసారి తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ పాత అభ్యర్థులే పోటీ చేశారు. వారిలో .. పీలేరు అసెంబ్లీ స్థానంలో నాలుగు దశాబ్దాలకు పైగానే నల్లారి కుటుంబం రాజకీయ ఆధిపత్యాన్ని సాగిస్తోంది. నల్లారి అమర్నాథరెడ్డి, ఆయన స్థానంలో కుమారుడు నల్లారి కిరణ్ కుమార రెడ్డి ఉమ్మడి అసెంబ్లీ స్పీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాజంపేట ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ వారసత్వ రాజకీయ ఆలంబనగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజకీయ విరోధి చింతల రామచంద్ర రెడ్డి పై పోటీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత, నల్లారి కుటుంబం పై ఉన్న అభిమానం వెరసి ఈ ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డికి సానుకూల పవనాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఆయన గెలిస్తే నల్లారి కుటుంబ రాజకీయ వారసత్వం ఉనికిలోకి వస్తుందని భావిస్తున్నారు.

బొజ్జల వారసత్వం..

శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిపై పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓటమి చెందారు. ఆయన తండ్రి తాత కూడా సుదీర్ఘకాలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలుగా మంత్రిగా సేవలందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై అనేక ఆరోపణలు ఉండడం, బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ, భార్య రిషిత కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. పాత కొత్తతరం శ్రేణులను ఏకం చేయడంలో వారిద్దరూ తీవ్రంగా పనిచేశారు. దీనికి తోడు జనసేన, బిజెపి నేతల సహకారం కూడా అందడం మేలు చేస్తుందని భావిస్తున్నారు.

గాలికి కలిసొచ్చిన అసమ్మతి

జిల్లాలోని నగరి నియోజకవర్గం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగింది. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ప్రత్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ ఇది కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.

గతంలో ఈ నియోజకవర్గంలో నుంచి రాజకీయ ప్రత్యర్థులైన మాజీ మంత్రులు రెడ్డివారి చెంగారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. వీరిని ఢీకొని వైఎస్ఆర్సిపి నుంచి 2014లో సినీ కథానాయకి ఆర్కే రోజా గెలుపొంది సంచలనం సృష్టించారు. 2019 ఎన్నికల్లో కూడా ఆమె విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఫ్యాక్టరీ కొట్టాలని ఆమె ఆశించారు. గడిచిన ఐదేళ్లలో ఆమె సొంత పార్టీలోనే వ్యతిరేకులను, అసమ్మతిని పోగు చేసుకున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల కీలక నాయకులు టిడిపిలోకి వెళ్లిపోయారు. నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే. కుమార్ సైలెంట్ అయ్యారు. అనుచరులందరూ టిడిపిలోకి వెళ్ళిపోయారు. ఈ అంశాలన్నీ టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌కు కలిసి రాగలరని అంచనా వేస్తున్నారు. ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలతో ఉంటున్నారు.

ఎన్నేళ్ళకో... పోటీ..

ఒకటి కాదు. రెండు కాదు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిరకాల రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీకి దిగిన టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ధీటుగా ఎదుర్కొన్నారు. పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరులో 1983, 1985 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా చల్లా ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 1989 ఎన్నికలకు ముందు ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన కుమారుడు చల్ల బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పోటీ చేసి ఓటమి చెం. ఆ తర్వాత ఆయన 30 ఏళ్ల పాటు పోటీ చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత పుంగనూరులో మళ్లీ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై చల్లా బాబు పోటీ చేశారు. ఇక్కడ నుంచి బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి పోటీనే ఇచ్చారనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. మొత్తం మీద తొమ్మిది మంది రాజకీయ వారసులు 2024 ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇంకొద్ది రోజుల్లో చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో వారిలో ఎవరు అసెంబ్లీలోకి వెళ్తారనేది తేలనుంది.

Similar News