బాధల వరద: 18వ రోజు అదే వేదన

అది రాజీవ్ నగర్ రోడ్డు. బుడమేరుకు ఉన్న కరకట్టపై వేసి ఉంది. అది పెద్ద రోడ్డు కాకున్నా బీటీ రోడ్డు. దానికి అటువైపు బుడమేరు, ఇటువైపు డౌన్‌లో సుందరయ్య నగర్.

By :  Admin
Update: 2024-09-21 03:04 GMT

(TV నరసింహారావు)

అది రాజీవ్ నగర్ రోడ్డు. బుడమేరుకు ఉన్న కరకట్టపై ఆ రోడ్డు వేసి ఉంది. అది పెద్ద రోడ్డు కాకున్నా బీటీ రోడ్డు. దానికి అటువైపు బుడమేరు, ఇటువైపు డౌన్ లో సుందరయ్య నగర్. కరకట్టకు కనీసం మూడు నాలుగు అడుగుల లోతులో ఆ రోడ్లు ఉన్నాయి. ఇంకా చివరకు వెళితే మరో రెండు అడుగుల దిగువకు వీధులు ఉన్నాయి. అక్కడి ప్రజల్లో అనేకమంది ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గా, కూలీలుగా, బీసెంట్ రోడ్డు లాంటి సెంటర్ల షాపుల్లో వర్కర్స్ గా పనిచేస్తున్నారు. వరద ముంపు ప్రారంభమైన 18 రోజులకు ఆ ప్రాంతం ఎలా ఉందో మళ్లీ చూడటానికి మా డిఎస్ఓ పూర్వ సహ విద్యార్థి, ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) నాయకురాలు గంగాభవానితో కలసి వెళ్ళాము. అక్కడ ఇప్పుడు రోడ్లు ఎండిపోయి కొంత సాధారణ పరిస్థితి కనిపించింది. సాధారణ పరిస్థితి అంటే మురుగునీరు, వరద నీరు, వర్షపు నీరు లేకపోవడమే. అక్కడ బాగా ముంపునకు గురైన చిన్న చిన్న రోడ్లను ఫోటోలు తీయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ వీధుల్లో బయట వారు ఎవరు అడుగు పెట్టినా తమకు ఏదైనా సాయం అందించడానికి వచ్చారేమోనని స్థానిక బాధితులు వాకబు చేస్తున్నారు. మా చేతుల్లో అప్పుడు ఎలాంటి సాయమూ లేదు. ఫోటోలు తీసే సమయంలో ఇద్దరు మహిళలు తమ ఇళ్లు ఎంతవరకు మునిగిపోయాయో చూపిస్తూ తాము సర్వం కోల్పోయిన వైనాన్ని వివరించారు. కాలనీలో తెలిసిన మిత్రుల ఇళ్లకూ వెళ్లి పరిస్థితి అడిగి తెలుసుకున్నాము.

అప్పటిదాకా నిద్రలో ఉన్న ఆ కాలనీ ప్రజలు హఠాత్తుగా రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే పక్కనే ఉన్న బుడమేరు నీళ్లు కాలనీలోకి ప్రవేశించటం మొదలుపెట్టాయి. ఉదయం 6 గంటలకు మొదలైన ప్రవాహం చూస్తుండగానే 6:30 గంటలకల్లా నడుము లోతు దాటి ఇళ్లల్లోకి ప్రవేశించాయి. ఏమీ అర్థం కాలేదు. పలుమార్లు నీళ్లు వచ్చినా ఒకటి రెండు అడుగులు వచ్చి వెళుతుంటాయిలే అనుకుంటున్న వాళ్లు ఆ ప్రవాహ వేగం చూసి బిత్తర పోయారు. ఎక్కడివాళ్ళక్కడ ఇళ్లల్లోకి పరుగులు తీసి చేతి కందిన వరకు కొన్ని వస్తువులు తీసుకుని డాబాల మీదకి చేరుకున్నారు. ఎంత నీళ్లు వచ్చినా తమ ఇంట్లోని వస్తువులను కాపాడుకోవచ్చులే అన్న ఆశతో కొన్నిటిని మంచం మీదకి, కొన్నిటిని చిన్న చిన్న బల్లలు కుర్చీల మీదకి చేర్చుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఇంట్లోనే గొంతులోతు వరకు నీళ్లు రావడంతో ఏవైనా వస్తువులు మిగులుతాయి అన్న ఆశ లేకుండానే పోయింది. అప్పటికి ఇంకా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేదు, పాలు, నీళ్లు లాంటి అవసరాలను కూడా సమకూర్చుకునే టైం లేదు. ఇంతలోనే కరెంటు కూడా పోయింది. అప్పుడు పోయిన కరెంటు పది రోజుల తర్వాత మాత్రమే వాళ్ళు చూడగలిగారు.

అక్కడి ఇళ్లన్నీ 50 గజాల స్థలంలో నిర్మించుకున్నవే. 30 ఏళ్ల క్రితం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లను తొలగించి వారికి కూడా ఇక్కడే ఇచ్చారు. ఆ ఇళ్ల లో కూడా కొన్ని రెండు భాగాలుగా చేసుకుని రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. కొందరు పైన కూడా నిర్మాణం చేసుకొని ఒక భాగం అద్దెకిచ్చి , ఒక భాగంలో తాము నివసిస్తున్నారు. కాలనీలోకి నీరు ప్రవేశించాక... ఇప్పుడు జీవనమంతా డాబాలపైనే. నేలపై నీళ్లు తప్ప జీవనం లేదు. పైనున్న వాళ్లు తమ ఇళ్ళల్లో ఏమేమి ఉన్నాయో చూసుకుంటున్నారు. అవి ఎన్నాళ్ళు పొదుపుగా వాడుకోవచ్చో, పక్కన వాళ్లకు ఏమి సహాయం చేయగలమో అంచనాలు వేసుకుంటున్నారు. ఆ కాలనీలో అందరి ఆలోచనలు ఇవే. ఇలా ఆ రోజంతా గడిచింది. ఇంతలో చినుకులు కూడా ప్రారంభమయ్యాయి. ఎలాంటి నిర్మాణం లేని డాబాల మీదకి చేరుకున్న వాళ్ళకి ఆ ఉన్న కొద్దిపాటి చోటు కరువైంది. అప్పుడు ఎక్కడెక్కడ ఉన్న పట్టాలు, బ్యానర్లు అందుకుని తమ తల తడవకుండా ఉంచుకోగలిగారు. కొందరు పై భాగంలోని పక్క ఇళ్లల్లో ఆశ్రయం పొందారు. వారితోపాటు కలిసి కొద్దిపాటి తిండి తయారు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవకాశం ఉన్న వరకు అందజేశారు. అదంతా కేవలం ఉపశమనం మాత్రమే. ఆ రాత్రీ అలాగే గడిచింది. కొందరైతే మెట్ల మీద ముడుక్కుని కూర్చున్నారు.

 

ఈ నీళ్లు ఎప్పుడు పోతాయో, ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో, తాము మళ్ళీ బయటి ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తామో నేల మీదకి ఎప్పుడు దిగగలమో ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మూడవ రోజుకు ఓ పడవ ఆదిశగా వచ్చినట్లు తెలుసుకొని కొందరు యువకులు ఆ నీళ్లలోనే వెళ్లి వారి ద్వారా వచ్చిన మంచినీళ్లు కొన్ని వస్తువులు అందుకుని తీసుకువచ్చారు. ఆ తరువాత మళ్లీ ఎవరు ఆ దిశగా రాలేదు. ఎక్కడో మెయిన్ రోడ్డు మీద సహాయం అందుతుందని తెలిసి కొంతమంది మహిళలు కూడా మరో దారి లేక నీళ్లలోనే తడుచుకుంటూ కష్టం మీద అక్కడికి చేరుకుంటే.. కొంతమందికి బిస్కెట్ ప్యాకెట్లు , మంచినీళ్లు, అన్నం ప్యాకెట్లు కొన్ని అందాయి. కొంతమందికి అవి కూడా అందలేదు. ఇక్కడే ఓ సమస్య వచ్చింది. తాము కట్టుబట్టలతోటి పైకి చేరుకున్నారు. ఇప్పుడు నీళ్ళల్లో వెళ్లి ఆ బట్టలను తడుపుకుంటే మార్చుకోవడానికి మరో జత లేని పరిస్థితి. అందువల్ల కొంతమంది అసలు నీళ్లల్లోకి దిగలేదు. కొందరు తాము తీసుకు రాగలిగిన వాటిలో కొన్నిటిని వెళ్లలేని వాళ్ళకు అందించారు. ముఖ్యంగా పిల్లలు ఉన్న వారికి కనీసం పాలు కూడా దొరకని పరిస్థితి. దీంతో సమీపంలోని వీధిలో ఉన్న షాపులో వారికి నచ్చజెప్పి ఓ పది పన్నెండు పాల ప్యాకెట్లను తీసుకొచ్చారు. వాటిని ట్రే లో నెత్తిపై పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే ఓ ప్యాకెట్ పాలు తీసుకోండి అని పెద్దగా అరుస్తూ వాటిని బాధితులకు అందజేశారు. కొంతమంది యువకులు శ్రమించి తీసుకొచ్చిన అన్నం ప్యాకెట్లు తీరా విప్పి చూస్తే చాలా వరకు పాడైపోయి ఉండటంతో తినలేక పడేయాల్సి వచ్చింది.

ఆ సమయంలో వెల్లివిరిసిన మానవత్వం మరెందరికో స్ఫూర్తిని కూడా ఇచ్చింది. అలా ఐదు రోజులు ఎలా గడిచాయో తలచుకుంటేనే వారికి వణుకు పుడుతోంది. అయినా ఇక్కడ నీళ్లు పోలేదు. కరెంట్ రాలేదు. పరిస్థితి లో పెద్దగా మార్పు లేదు. వరద నీరు నడుముల్లోతువరకు చేరి బయట ప్రపంచంతో సంబంధాలు మెరుగయ్యా యి. కొందరు సింగ్ నగర్ మెయిన్ రోడ్డు వైపు వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ జరిగిన చోట్ల ఫోన్లో చార్జింగ్ పెట్టుకుని రావడంతో కొంత సమాచారం మార్పిడికి అవకాశం కలిగింది. ఇక్కడ ఏడవ ఎనిమిదవ రోజు కూడా మామూలు పరిస్థితి రాలేదు. కొద్దిగా మెరకగా ఉన్న వీధుల్లోని కొన్ని ఇళ్లల్లో నీళ్లు తగ్గడంతో ఇంటి బయట ఉన్న వరద నీళ్లతోనే ఇళ్లు, కొన్ని వస్తువులు కడుక్కున్నారు. ముందుగా బురదను వదిలించుకోవాలి. ఆ ఇళ్లల్లో కూర్చునే పరిస్థితి లేదు. కాలు పెడితే జారిపోయేలా ఉంది. హెలికాప్టర్లు, డ్రోన్లు, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు, అధికార యంత్రాంగం ఇక్కడ ఎవరికీ కనిపించలేదు. వాటి ఊసు కూడా ఇక్కడ లేదు. బయట నుంచి వస్తున్న సహాయం దారిలోనే కండబలం ఉన్నవారికి మాత్రమే అందుతుందని తెలిసింది. ఇప్పుడు నీరంతా పోయింది కానీ కష్టాలు కళ్ళ ముందే మెదులుతున్నాయి. ఎంతో కష్టపడి కూలి నాలి చేసుకుని సంపాదించిన డబ్బు పొదుపు చేసుకుని సమకూర్చుకున్న వస్తువులు, బట్టలు అన్నీ బురద నీళ్లలో నాని చీకిపోయాయి. వాటిని బయట పడేయడం కూడా ఒక కష్టంగా మారింది.

 

ఇప్పటికీ చాలా ఇళ్ళ ముందు నానిపోయిన మంచాలు, చీకిపోయిన పరుపులు, ఇళ్ళ ముందు ఆరబెట్టుకున్న పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. సంఘజీవనం, మనుషుల మధ్య సత్సంబంధాలు ఎంత అవసరమో, అవి తోటి వారిని ఆపద సమయంలో ఎలా ఆదుకుంటాయో చాలామందికి అర్థమయింది. కొందరు మహిళా సంఘ కార్యకర్తలు స్థానికులకు అండగా నిలిచి, అడపా దడపా వచ్చే ఆహారం, మంచినీరు లేదా తెలిసినవారు అందించే సహాయం బాధితులకు ఒక క్రమంలో అందించేందుకు కృషి చేస్తున్నారు. ఎవరూ అందరికీ సాయం అందించే పరిస్థితి లేదు. అందువల్ల వచ్చిన సాయం బాధితులకు అందేలా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల లేదు. అందువల్ల ఎంతోమంది దిక్కుతోచని స్థితిలోనే ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దాతలు తీసుకువచ్చిన సహాయాన్ని పైన పడి లాక్కుంటున్న సంఘటనలు సోషల్ మీడియాలో కనిపించాయి. కండబలం ఉన్న వాళ్ళు లూటీ చేసినట్లుగా ఎత్తుకుపోయిన ఉదంతాలు కూడా పలువురిని బాధించాయి. ఆయాచోట్ల ఓపిక లేని వాళ్ళు స్త్రీలు వృద్ధులు దూరంగా నిలబడి ఆశగా చూసి వెనుతిరిగిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే సమాజానికి ఓ మంచి సంస్కృతి, ప్రవర్తన ఎంత అవసరమో తెలుస్తుంది. ఉద్యమ స్పృహ, పోరాట స్ఫూర్తి ఉన్నచోట్ల మాత్రమే అసలైన మానవత్వం, సహజీవన సౌందర్యం వెల్లివిరుస్తుంది. అందుకే సమాజంలో కనీస చైతన్యం, మానవత్వం, సహకార స్పృహ అత్యవసరం. మాయమైపోతున్న మనిషిని కాపాడుకోవాల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. లేకుంటే సమాజం రోగగ్రస్తమై, వికృత స్వభావం సంతరించుకుంటుంది. దారుణ పరిస్థితులను చవిచూడాల్సి వస్తుంది. అందుకే ప్రజలకు అభ్యుదయ భావాలను నేర్పే మంచి విద్య అవసరం.

పది రోజుల అనంతరం ప్రభుత్వ యంత్రాంగం నష్టం లెక్కలు తీసేందుకు, రేషన్ అందజేసేందుకు ఆ ప్రాంతాలకు వచ్చారు. 17 రోజుల అనంతరం ప్రభుత్వం తాను అందించబోయే సహకారాన్ని మీడియా ద్వారా ప్రకటించింది. అది ఎప్పటికీ అందుతుందో చూడాల్సి ఉంది. ఈలోగా వారు తమ ఆకలి తీర్చుకుంటూ సాధారణ జీవితంలో ఎలా అడుగు పెట్టాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నారు. మా డి.ఎస్.ఓ పూర్వ విద్యార్థులు, హైదరాబాద్ కు చెందిన నాద యోగ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బాధితుల కోసం అందించనున్న సాయం చిన్నపాటిదీ, కొద్ది మందికే అయినప్పటికీ అది నిజంగా బాధితులకే చేరాలనే సంకల్పంతో ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాము.

చాలామంది చాలాసార్లు పైనున్న వాళ్లకు ఎలాంటి నష్టము జరగలేదని, కేవలం వాహనాలు మాత్రమే పాడైపోయాయి అంటుండం ఇతర ప్రాంతాల్లో వినిపించింది. వాస్తవానికి నేల మీద నుంచి డాబాల మీదకి వెళ్ళిన వాళ్లందరికీ సాయం అందించింది, వారికి చీకట్లో, వర్షం లో అండగా నిలిచిందదీ, ఆకలి తీర్చిందీ పై అంతస్తుల్లో వాళ్లే. అందరి వాహనాలు పాడైపోయాయి. అందరికీ పనులు లేవు. పది రోజులపాటు దుర్భరమైన కష్టాన్ని, బాధనీ అనుభవించారు. ఇక్కడ అందరూ బాధితులే. అయితే సర్వం కోల్పోయిన కింది ఇళ్లల్లో వాళ్ళు మాత్రం మరింత ఎక్కువ బాధితులు. ఇంకా న్యూ రాజరాజేశ్వరి పేట, ఆంధ్రప్రభ కాలనీలో కూడా కొన్ని ప్రాంతాలను చూసాము. పక్కనే రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ తరవాత ఉడా కాలనీ ఇలా ఎన్నో కాలనీలు బుడమేరు వరదకు తల్లడిల్లాయి. పరిస్థితి ఒక్కోచోట ఒక్కోలా, బాధలు ఒక్కో ఇంట్లో ఒక్కోలా.. సాయం అందించే చేతులకోసం ఆశగా, ప్రభుత్వ సహకారం కోసం బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News