ఎవరీ ధాత్రి మధు? ఇంత పెద్దవాడు ఎలా అయ్యారు?
ఓసాదాసీదా జర్నలిస్టు ఏపీపీఎస్సీ స్కాంలో ఎలా ఇరుక్కున్నాడు;
By : The Federal
Update: 2025-05-08 10:16 GMT
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా పత్రాల దిద్దుబాటు పేరుతో పేరుతో ప్రభుత్వ నిధులను భారీ ఎత్తున దుర్వినియోగం కుంభకోణంలో సీనియర్ జర్నలిస్టు పమిడికాల్వ మధుసూదన్ అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన ముద్దాయిగా , మధు సూదన్ రెండో ముద్దాయిగా ఉన్నారు. ఆంజనేయులు ఆదేశాలతో కామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన డైరెక్టర్ పామిడికల్వ మధుసూదన్ ఈ అవకతవకలకు పాల్పడినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోరారు. అసలింతకీ ఎవరీ పమిడికాల్వ మధుసూదన్? ఏమిటా కథ? జర్నలిస్టులు కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడతారా? అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ మధుసూదన్?
దశాబ్ద కాలం కిందటి వరకు సాదాసీదా జర్నలిస్టుగా ఉన్న పమిడికాల్వ మధు ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. సామాన్య జర్నలిస్టులకు అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ మధు అనంతపురం జిల్లా లేపక్షికి చెందిన వారు. పుట్టపర్తిలో చదివారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న కథనం ప్రకారం పామిడికల్వ మధుసూదన్ తండ్రి చెంచు సుబ్బయ్య. ప్రస్తుతం ఆయన లేరు. మధు వయసు 55 ఏళ్లు. బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వారు. ధాత్రి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కాకమునుపు వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పని చేశారు.
పమిడికాల్వ మధుసూదన్ అనంతపురం జిల్లా హిందూపూర్ కేంద్రానికి పాత ఆంధ్రప్రభ (గోయెంకా గ్రూపు) పత్రికకు రెగ్యులర్ కంట్రిబ్యూటర్ (ఆర్ సి)గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రభూమి పత్రికలో కొంతకాలం పని చేశాడు. పత్రికలకు ఆదరణ తగ్గి టీవీలకు పెరుగుతున్న కాలంలో తేజ టీవీకి స్ట్రింగర్ గా పని చేశారు. పలు కుంభకోణాలను కూడా బయటపెట్టారు. చివరకు ఆయనే ఓ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆయన రాణింపు వెనుక అపారమైన ప్రతిభా పాటవాలూ లేకపోలేదు. భాషపై పట్టుంది. పదాల పొందిక ఉంది. వీటికి తోడు వ్యాపార దక్షత కూడా ఉంది. మీడియాలో కాస్తంత గుర్తింపు వచ్చిన ప్రతి విలేఖరీ ఏదో ఒక రాజకీయ నాయకుడికి దగ్గరవుతుంటాడు. అలాగే మధు కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకుడు, రియల్ ఎస్టేట్ టైకూన్ లగడపాటి రాజగోపాల్ కి దగ్గరయ్యారు. ఆనాటి పీసీసీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు సన్నద్ధం అవుతున్న దశలో లగడపాటి రాజగోపాల్ చాలా వ్యవహారాలలో చక్రం తిప్పారు. లగడపాటితో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని మధు సూదన్ పాదయాత్ర కవరేజీ ఇతరత్రా వ్యవహారాలలో పాల్గొన్నారు.
2004 అసెంబ్లీ ఎలక్షన్ల కు లగడపాటి రాజగోపాల్ కి మీడియా సలహాదారుగా పనిచేసి జర్నలిజం నుంచి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రాపకం సంపాయించారు. అప్పట్లో రాజగోపాల్ ఎలక్షన్ ఆఫీసు హైదరాబాద్ కమలాపురి కాలనీలో కోలాహలంగా ఉండేది. వాస్తవానికి లగడపాటి కార్యాలయం సమాంతర పీసీసీ కార్యాలయంలా ఉండేది. కాంగ్రెస్ నాయకుల జేబులు ఎండిపోయి, రాజగోపాల్ 'ల్యాంకో' గలగల లాడుతున్నరోజులవి. పైనుంచి క్రింది దాకా డబ్బు పరిచిన రోజులు. వైఎస్సార్ పాదయాత్ కు ల్యాంకో రాజగోపాలే స్పాన్సరర్ అనే పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రతో ప్రత్యక్షంగా పరోక్షంగా సాయపడిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవో, ఉపాధో పొందుతున్న తరుణం అది. సరిగ్గా అప్పుడు మధు సూదన్ లగడపాటి వారి పలుకుబడితో రాజశేఖరరెడ్డి ప్రాపకం సంపాదించాడు. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కాంట్రాక్ట్ సంపాయించారు. ఇంకేముంది దశ తిరిగింది. మీడియా ప్రతినిధి బరువును వదిలించుకుని మీడియా యజమాని పాత్రలోకి ఒదిగిపోయారు. ధాత్రి పబ్లికేషన్స్ పెట్టారు. ఐదేళ్లు చక్రం తిప్పారు. తేజ మధు కాస్తా ధాత్రి మధుగా మారిపోయారు. ఓ కార్యాలయంలో పని చేసిన వ్యక్తి సొంతగా హైటెక్ మీడియా కార్యాలయం ఏర్పాటు చేసి ఓ ఊపు ఊపారు. ఎన్నెన్నో కాంట్రాక్టులు, ఈవెంట్లు చేశారు. ధాత్రితో మధు దశ తిరిగిందని - లాంకో కంపెనీకి ఆ రోజుల్లో ప్రింటింగ్ మెటిరీయల్ సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్ గుర్తు చేసుకున్నారు. మధుకి పునరావాసంగా ధాత్రి మీడియా ఏర్పాటు చేయించి, భారీ ఈవెంట్లను షూట్ చేసే సరుకు సరంజామాను సమకూర్చింది లగడపాటి రాజగోపాలేనని ఆయన చెబుతారు. ఎక్విప్‌మెంట్ కు అన్నిరకాల సహాయం చేసి, అసెంబ్లీ సమావేశాలను షూట్ చేసి ఇతర మీడియా ఛానళ్లకు- అందచేసే అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్సార్. ఇక అక్కణ్ణుంచి ఇతని స్థాయి మరో లెవెల్ కి పెరిగింది. 2009 ఎలక్షన్ల నాటికి మీడియాలో ఎక్కడ విన్నా ధాత్రి పేరే మార్మోగింది. డక్కన్ వీడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ ఫ్రాసైన్ ప్రాజెక్స్ట్, కామ్ సైన్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు పెట్టారు. మధుసూదన్ మీడియా వ్యాపారంలో ఆరితేరిపోయారు.
రాజశేఖర రెడ్డి కోటరీలో ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉండేవారట. బహుశా ఆ పరిచయంతోనే మధుకి సంబంధం లేని పనే అయినా ఏపీపీఎస్సీ ఆన్సర్ షీట్ల ఎవాల్యుయేషన్ లో దూరి ఉంటాడని మధు సూదన్ పాతమిత్రుడొకరు చెప్పారు. వెయ్యి నోములు నోచిన ఫలితం ఒక్క రంకు తో మింగిందన్న సామెతలా ఇప్పుడు మధు సూదన్ కథ.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కార్యాలయం నడుపుతూనే ఆంధ్రప్రదేశ్ లో తన పాత సంబంధాలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైన మధు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన అనంతరం మళ్లీ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్ట్ కోసం ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అది ఏబీఎన్ కి వెళ్లింది. అయితే 2019లో వైసీపీ గెలిచిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ను ధాత్రి మధు చేజిక్కించుకున్నారు. ఈ కాంట్రాక్ట్ ఆయనకు వచ్చేలా చేయడం వెనుక ఆనాటి వైఎస్ జగన్ చీఫ్ మీడియా పీఆర్వో జీవీడీ కృష్ణమోహన్, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు ఉన్నారని చెబుతారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ధాత్రి మధు హవా బాగానే చెల్లుబాటు అయింది. అడపాదడపా కాంట్రాక్టులు చేసుకుంటూనే తన ప్రధాన వ్యాపకమైన రాతకోతల్ని సరిచూసుకుంటూనే చాలా ఎత్తుకు ఎదిగినట్టు ఇప్పుడు స్పష్టమైంది.
2018 డిసెంబర్ 31న 169 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ, కరోనా కారణంగా డిజిటల్ మూల్యాంకనాన్ని ఎంచుకుంది. దీనిపై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి అర్హులైన మనుషులతో పేపర్లు దిద్దించమని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టును మభ్యపెట్టి ఆనాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ అంజనేయులు ఓ ప్రైవేట్ సంస్థను కిరాయికి నియమించి మంగళగిరి సమీపంలోని హైలాండ్ రిసార్ట్‌లో మకాం పెట్టించి పేపర్లు దిద్దించి అంతా సవ్యంగానే ఉందని ప్రకటించారని పోలీసులు ఆరోపించారు. ఈ కిరాయికి నియమించిన సంస్థ మధుకి చెందిన కామ్ సైన్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్.
పీఎస్సార్ అంజనేయుల ఆదేశాల మేరకు, అసిస్టెంట్ సెక్రటరీ సుబ్బయ్య నిందితుడు మధుసూదన్‌ను సంప్రదించాడు. మానవ మూల్యాంకనానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఇది ఉత్తుత్తి మూల్యాంకనమేనని, డిజిటల్ మార్కులను OMR షీట్లపై మ్యాప్ చేయాలని, అందుకు ఎంత కావాలో చెబితే ఆ మొత్తాన్ని ఇస్తామని ఏపీపీఎస్సీ అధికారులు ఆదేశించినట్టు మధుసూదన్ ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
2021 డిసెంబరు 3న మధుసూదన్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. అర్హతలేని 66 మందిని నియమించి, హైలాండ్ రిసార్ట్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. సుబ్బయ్య ప్రత్యక్షంగా గైడ్ చేస్తూ, ఎలాంటి మూల్యాంకనం చేయొద్దని, కేవలం ఇచ్చిన మార్కులను రాయాలని స్పష్టం చేశాడు. ఈ సమయంలో CCTVలు లేకపోవడం, సంతకాలు చేసినవారిలో నిజమైన ఎగ్జామినర్లు లేకపోవడం, డాక్యుమెంటేషన్ లోపాలు, నియమాలు పాటించకపోవడం వల్ల ఇది పూర్తిగా కేవలం మ్యాపింగ్ క్యాంప్ గా మారిందని పోలీసుల రిపోర్టు. రూ.1.14 కోట్లకు పైగా చెల్లింపులు, అవకతవకలపై ఇప్పుడు ధాత్రి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కోటీ 14 లక్షల 32వేల 312రూపాయల మొత్తాన్ని APPSC ఖాతా నుంచి కామ్‌సైన్ మీడియా ఖాతాకు చెల్లించారు.