పూలు కురిసిన చోటే.. రాళ్ల వర్షం "పెద్దిరెడ్డి"పై అంత కోపమెందుకు?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై అంతకసి ఎందుకు ఏర్పడింది. తండ్రీ, కుమారుడిని ప్రజలు పూలబాటపై నడిపించిన చోటే, రాళ్లవర్షం ఎందుకు కురిపించారు. పుంగనూరులో ఈ పరిస్థితికి కారణం ఏమిటి?

Update: 2024-07-18 11:03 GMT

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబానికి కుటుంబానికి పీలేరు తరువాత పుంగనూరు నియోజకవర్గం పెట్టని కోట. నాలుగు దశాబ్దాలుగా ఆయన చిత్తూరు జిల్లాలో మకుటంలేని రాజు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఆయనకు తిరుగు ఉండేది కాదు. ఆయనపై ఎదురుదాడి చేసిన వారు లేరు. ఇదంతా నెల క్రితం వరకే..



నాలుగు దశాబ్దాల తరువాత జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రాఫ్ తిరగబడింది. జనం పూలబాట వేసిన చోట రాళ్లవర్షం కురిసింది. ఊరిలోకి రావడానికి వీలులేదని తిరుగుబాటు ఎదురైంది. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ప్రతికూల పరిస్థితికి ఏర్పడింది. తాజా వివరాల్లోకి వెళితే...
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం యుద్ధాన్ని తలపించింది. అధికార టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సిపి మద్దతుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి సద్దుమణిగిన తరువాత ఎంపీ మిథున్ రెడ్డి గన్మన్లు రెండు రౌండర్లు కాల్పులు జరిపినట్లు సమాచారం అందింది. వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కూటమి మద్దతుదారుల రాళ్ల దాడిలో కొందరు జర్నలిస్టులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. తనసెల్ ఫోన్ లాక్కున్న కొందరు అందులోని ఫొటోలు, వీడియోలు తొలగించి, తిరిగి ఇచ్చేశారని సాక్షి మీడియా విలేకరి వాసు ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.


ఊహించని తిరుగుబాటు
ఎన్నికల ఫలితాల తరువాత నెల గడిచినా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటిసారి సొంత ఊరిలో తిరగలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన ప్రధాన మద్దతుదారుడైన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్పను పరామర్శించడానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం పుంగనూరుకు చేరుకున్నారు. తిరుపతి నుంచి కొందరు వర్సిటీ విద్యార్థులను వాహనాల్లో వెంట తీసుకుని వెళ్లారని సమాచారం. ఎంపీ మిథున్ వచ్చారనే సమాచారం అందుకున్న పుంగనూరు నియోజకవర్గంలోని నేతిగుంటపల్లె వద్ద ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు వెళ్లి నిలదీయడానికి వెళ్లారని తెలిసింది. ఈ సమయంలో ఎంపీ మిథున్ గోబ్యాక్ అని నినదించడంతో మాజీ ఎంపీ రెడ్డెప్ప భవనంపై ఉన్న వారి నుంచి రాళ్లు దూసుకుని రావడం, కుర్చీలు విసరడం వల్లే. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఊహించని దాడితో ఆగ్రహించిన టీడీపీ మద్దతుదారులు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసం వద్ద ఫర్నిచర్ తో పాటు దాదాపు ఏదు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఆ తరువాత పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీల మద్దతుదారులను నిలువరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు నానా యాతన పడ్డారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే...

2023 ఆగస్టు 23న టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజా గళం పేరిట బస్సు పాదయాత్ర ప్రారంభించిన విషయం. ఆ సమయంలో అనంతపురం జిల్లా మీదుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు గ్రామ సమీపానికి రాగానే రాళ్లు రవ్విన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. అలాగే,
పుంగనూరు పట్టణంలో కూడా చంద్రబాబు నాయుడును రానివ్వకుండా అడ్డుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుదారులు ఆ పార్టీ నాయకులు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. తమ అధినేతను అడ్డుకుంటారా అని టీడీపీ శ్రేణులు సైతం రంగ ప్రవేశం చేశాయి. ఈ సందర్భంలో జరిగిన ఘర్షణలో, టీడీపీ మద్దతుదారులు పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. రాళ్ల దాడిలో 13 మంది పోలీసులు గాయపడడంతో పాటు మరో 50 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రిలో చేర్పించిన చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిందితులపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు మద్దతుదారులు ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
హెలిపాడ్ ధ్వంసం
2019 ఎన్నికల సమయంలో జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన కోసం సిద్ధం చేసిన హెలిపాడ్ ను వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న వారు ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ, జనసేన మద్దతుదారులైన నాయకులపై దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన పుంగనూరుకు చెందిన బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ను అడ్డగించడంతోపాటు, వారి మద్దతుదారులపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులుగా భావిస్తున్న వారు దాడులకు పాల్పడ్డారు. అక్కడి నుంచి వెనుదిగినవారు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వెలుపలే ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగిన వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు బోడే రామచంద్ర యాదవ్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసి, తగలబెట్టారు. ఈ పరిణామాల అనంతరం..
ప్రతికూల ఫలితాలతో..
2024 సార్వత్రిక ఎన్నికలను అధికారంలో ఉండి వైఎస్ఆర్ సీపీ ఎదుర్కొంది. రాష్ట్రంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించి, పార్టీని నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ క్యాడర్ ను టార్గెట్ చేయడం, కుప్పం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారక నాథ్ రెడ్డి, ఈ రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే రాజంపేట ఎంపీగా వారి కుమారుడు మిథున్ రెడ్డి విజయం సాధించారు.
పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, టీడీపీ జనసేన మద్దతుదారుల ఆగ్రహం వల్ల ఆయన సొంత ఊరిలో పర్యటించలేని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో కూడా రోడ్లపైకి వచ్చిన అధికార కూటమి మద్దతుదారులు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలకు దిగారు. పోలీసుల సూచనల నేపథ్యంలో ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సొంత ఊరిలోకి వెళ్లలేని పరిస్థితితో తిరుపతిలో ఇంటికే పరిమితమయ్యారు. కాగా,
మొండి పట్టుదలతో వెళ్లి..
ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో రెండుసార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు వెళ్లాలనే ప్రయత్నాన్ని "పరిస్థితులు అనుకూలంగా లేవు" అని పోలీసులు అనుమతి నిరాకరించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో పెద్దిరెడ్డికి ఎదురైన మొదటి అనుభవం ఇది. దీనిని జీర్ణించుకోవాలని స్థితిలో ఉన్న ఆయన కుటుంబం ఎలాగైనా పుంగనూరులో పాదం మోపాలని భావించినట్లు కనిపిస్తుంది.


పరామర్శ పేరుతో..
పుంగనూరులో నివాసం ఉండే చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత ఆత్మీయుడు. ఆయనను పరామర్శించడానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం తిరుపతి నుంచి పుంగనూరు బయలుదేరి వెళ్లారు. తిరుపతికి చెందిన ఓ వర్సిటీ నుంచి కొందరు యువకులను ఎంపీ మిథున్ వాహనాల్లో ముందుజాగ్రత్తగా వెంట తీసుకుని వెళ్లినట్లు సమాచారం. మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంలో కలిసి మాట్లాడుతుండగా, ఊర్లోకి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారనే సమాచారం బయటికి పొక్కింది. అంతే..


కట్టలు తెంచుకున్న ఆగ్రహం
మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసాన్ని భారీగా టీడీపీ, జనసేన శ్రేణులు చుట్టుముట్టాయి. వారిని నిలువరించడానిక పోలీసులకు సాధ్యం కాలేదు. మాజీ ఎంపీ ఇంటిలోకి దూరిన వారిని సెల్ ఫోన్లలో చిత్రీకరించడానికి ఎక్కువ శ్రద్ధ చూడం కనిపించింది. దాడి చేయడానికి వచ్చిన వారిపై తిరబడిన వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు కూడా ఆగ్రహానికి గురయ్యారు కుర్చీలు గాలిలోకి ఎగిరాయి. రాళ్లు, దుడ్డుకర్రలతో అధికార పార్టీ మద్దతుదారులు వెంబడించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్ద ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న వైస్ వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు, కూటమి నాయకుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. దీంతో పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఐదేళ్లుగా తమను వేధింపులు, అక్రమ కేసులు బనాయించి, మరశ్సాంతి లేకుండా చేశారంటూ అధికార పార్టీ మద్దతుదారులు కేకలు వేశారు.

ఈ దాడులపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.
"అధికారం శాశ్వతం కాదు" అని టీడీపీ శ్రేణులకు గట్టిగానే హెచ్చరిక చేశారు. "ఈ తరహా దాడులను ప్రోత్సాహించడం మంచిది కాదు" అని మిథున్ రెడ్డి సీఎం. ఎన్. చంద్రబాబునాయడుకు హితవు పలికారు. " దాడులకు ఇలా బీజం వేయడం వల్ల వర్గకక్షలకు బాటలు వేయడమే" అని గుర్తు చేసిన ఆయన వ్యక్తిగత దాడులు సమంసజం కాదని ఆయన మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ మాటలను గుర్తు చేశారు.
ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు, దాడులను నివారించగలిగారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డిని ఏఎస్పీ అరీఫుల్లా తన వాహనంలో ఎక్కించుకుని తిరుపతికి తరలించారని తెలిసింది.
"మాజీ ఎంపీ ఇంటి నుంచే మొదట రాళ్లు పడ్డాయి. అందులో ఒకటి నాకు తగిలింది" అని జర్నలిస్ట్ వాలెప్ప ఫెడరల్ ప్రతినిధికి తెలిపారు. "ఎంపీ మిథున్ రెడ్డి పరిస్థితి ముందుగానే ఊహించారేమో.. తిరుపతి నుంచి వెంట తెచ్చుకున్న కొందరు మొదట దాడి చేశారు" అని వాలెప్ప తెలిపారు.
Tags:    

Similar News