చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆ ఐపీఎస్ ఇప్పుడెక్కడో?
కొల్లి రఘురామిరెడ్డి, ఐపీఎస్.. ఆవేళ ఆ పేరో సంచలనం. చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన వ్యక్తి ఆయన.;
By : Amaraiah Akula
Update: 2025-09-09 10:36 GMT
టీడీపీ అధినేత, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుణ్ణి అరెస్ట్ చేసిన ఆ ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి ఇప్పుడెక్కడున్నాడో, ఏమో గాని.. సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున (సెప్టెంబర్ 9)న ఆయన హవా అంతా ఇంత కాదు. చంద్రబాబును తెల్లవారు జామున నంద్యాల వద్ద అరెస్ట్ చేసి సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచేంత వరకు ఆయన కనుసన్నలలోనే సాగింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడంలోనూ ఆయనే క్రియాశీలక పాత్ర పోషించారు ఆనాటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి.
అదే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐపీఎస్ అడ్రసు గల్లంతైంది. ఆయన్ను శంకరగిరి మాన్యాలు పట్టించారు. లోకేశ్ రాసుకున్న రెడ్‌బుక్ ప్రకారం కొల్లి గల్లీ పట్టారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో నంద్యాలలో 2023 సెప్లెంబర్ 9న చంద్రబాబును కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలోని సీఐడీ బృందం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడ కోర్టుకు తీసుకురావడం, న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 50 రోజులకు పైగా చంద్రబాబు జైలు జీవితం గడిపారు.
ఆనాడు లోకేశ్ రాసుకున్న రెడ్ బుక్ లో ఈ రఘురామిరెడ్డి పేరు ప్రముఖంగానే ఉంది. తమది ప్రతీకార ప్రభుత్వం కాదని లోకేశ్ ఇప్పుడు ఎంతగా చెప్పుకున్నా వైసీపీ అనుకూల ఐఎఎస్ లు, ఐపీఎస్ ల అడ్రసులు గల్లంతవుతూనే వచ్చాయి. అరెస్టులు అయిన వాళ్లు కొందరైతే పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న వారు మరికొందరు.
చంద్రబాబు గెలిచిన తర్వాత ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించిన నలుగురైదుగురు ఐపీఎస్ లు, ఐఎఎస్ లకు ఎంట్రీ కూడా లేకుండా పోయింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నివాసానికి వస్తే అనుమతి లభించలేదు. ఇంటి మెయిన్ గేటు వద్దే కానిస్టేబుళ్లు - ఆ ఐపీఎస్ ల కార్లు ఆపి లోనికి అనుమతి లేదని చెప్పారు.
నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు డోరు కొల్లి రఘురామిరెడ్డి కొట్టారన్న ప్రచారం సాగింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి విధేయుడుగా ఉన్నారని కొల్లి రాఘురామిరెడ్డిపై ఎన్నికల సంఘం (ఈ.సీ.) అప్పట్లో ఆయనపై వేటు వేసింది. అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డిజీ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
కొల్లి రఘురామిరెడ్డిని అరెస్ట్ అయితే చేయలేదు ఆయన విధి నిర్వహణలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారా అని ప్రస్తుత కూటమి ప్రభుత్వం శోధించింది. ఆధారాల కోసం చంద్రబాబు ప్రభుత్వం జల్లెడ పట్టింది. కానీ కొల్లి ఇప్పటి వరకు చిక్కలేదు. నిజాయితి కలిగిన అధికారిగా పేరుండడంతో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలో తోచక పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి టార్గెట్‌గా కొల్లి రఘురామిరెడ్డిని ఎంచుకున్నా ఆయన్ను ఏమీ చేయలేకపోయింది. పోలీసునేవాడు ఎక్కడో చోట ఏదో తప్పు చేయకుండా ఉంటారా అనే దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారులు ఆయనపై పరిశోధన చేస్తున్నారు.
ఎవరీ రఘురామరెడ్డి..
1980 జనవరి 5న జన్మించిన కొల్లి రఘురామిరెడ్డి 2006 IPS బ్యాచ్. ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఇంటెలిజెన్స్, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌ఐటి వంటి విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. హై–ప్రొఫైల్ అవినీతి కేసుల దర్యాప్తుల్లో ముందుండి పనిచేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో టీడీపీ పాలనకు చెందిన అవకతవకల దర్యాప్తునకు ఆయన్ను నియమించారు. విజిలెన్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను DGP (HoPF) కార్యాలయానికి రిపోర్ట్ చేయమని ఆదేశించింది.
ఈ దశలోనే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఘటనకు సంబంధించి ఆయన పేరు ఎక్కువగా వినిపించింది.
ఎన్నికల సంఘం బదిలీ (ఏప్రిల్ 2024) నిర్ణయంతో అస్సాం రాష్ట్రంలో ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్గా నియమితులయ్యారు. అదే ఏడాది జూన్‌లో ఏపీ ప్రభుత్వం ఆయనను DGP కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి భూకబ్జా తదితర కేసుల్లో దర్యాప్తు జరిపారు. రాజకీయపరమైన ధోరణులతో వ్యవహరించారనే ఆరోపణలు, ఎస్‌ఐటి కార్యాలయం సీజ్/పత్రాల దహనం వంటి కేసుల్లోనూ ఆయన చురుగ్గా వ్యవహరించారనే ప్రచారం ఉంది.
వెస్ట్ గోదావరి SP నుండి JAG ప్రమోషన్ (2015) పొంది తరువాతి కాలంలో DIG స్థాయికి ఎదిగారు. 2024 జూన్ తర్వాత DGP కార్యాలయానికి రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి. “పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఐపీఎస్‌లలో” ఆయన పేరూ ఉంది.