AP Health Department | 'సత్తెంగ' మాతా శిశువుకు భరోసా లేదు బాబూ..

వైద్య విద్య దయనీయంగా మారింది. సిబ్బంది కుదింపు, ఖాళీలు పీహెచ్సీలకు శాపమైంది. ఫలితంగా పేద రోగులు ప్రైవేటుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-22 06:24 GMT

రాష్ట్రంలో వైద్యం, ఆరోగ్య సేవలు దయనీయంగా మారాయి. ప్రభుత్వ వైద్యసేవల్లోకి రావడానికి నిపుణులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఈ విషయం చెప్పారు. గత్యంతరం లేని స్థితిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగం మానేసిన వారిని బతిమాలే పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉంటే.. సిబ్బంది కొరతకు తోడు ఉన్న వారిని కుదించడం కూడా పీహెచ్సీలకు శాపంగా మారింది. ఆస్పత్రుల నిర్వహణ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం..


అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం కదిరేపల్లిలోని 24/7 పీహెచ్సీ. ఇక్కడ ఇద్దరు డాక్టర్లతో పాటు 14 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. వాస్తవానికి ముగ్గురు డాక్టర్లు, నలుగురు స్టాఫ్ నర్సులు ఇక్కడ అవసరం. అదృష్టవశాత్తూ ఇక్కడ మందుల కొరత లేదు. రోజుకు సరాసరిగా 100 మందికి తగ్గకుండా ఔట్ పేషంట్లు వస్తున్నారని డాక్టర్ నరేష్ కుమార్ చెబుతున్నారు. "మా పీహెచ్సీ ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు ఓపీ ఉంటుంది. సిబ్బంది కొరత లేదు" అని డాక్టర్ నరేష్ కుమార్ చెప్పారు. "రాత్రిళ్లు ఆస్పత్రిలో ఓ స్టాఫ్ నర్సు విధుల్లో ఉంటారు. అత్యవసర కేస్ వస్తే, ఫోన్ చేయగానే ఇద్దరు డాక్టర్లలో ఎవరో ఒకరు వెళతాం" అని చెప్పారు.
రెఫరల్ వైద్యమే...
చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా ఆస్పత్రి. రోజూ 1,200 మంది అవుట్ పేషంట్లు వస్తుంటారు. ఓపీలో 19 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆ ఆస్పత్రి నుంచి రెఫరల్ కేసులో ఎక్కువ 440 పడకలు ఉన్న ఈ ఆస్పత్రికి డాక్టర్లు, నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. ఈ ఆస్పత్రి పరిధిలో మదనపల్లె మండలం సీటీఎం (చిన్నతిప్ప సముద్రం) బొమ్మనచెరువు పీహెచ్సీలు, వాల్మీకిపురం, గుర్రంకొండ, ముదివేడు ఆస్పత్రులు కూడా దరిదాపుల్లో అంటే 10 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చే అత్యవసర రోగులను తిరుపతికి రెఫర్ చేయడం మినహా మరోమార్గం లేదు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు. బోధనాస్పత్రిగా ఉన్నా, అవసరైన ప్రొఫెసర్లను కూడా నియమించలేదు.
ఈ అంశంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరిని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి పలకరించారు. "ఆ వివరాలు ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. రేప ఫోన్ చేయండి" అని సున్నితంగా సమాధానం చెప్పారు. ఇదిలావుంటే
మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఎటూ కాకుండా పోయిందనేది సీనియర్ జర్నలిస్టు చంద్ర చెబుతున్నా మాట. స్థాయికి తగిన విధంగా వసతులు, సిబ్బంది లేకపోవడమే దీనికి కారణమని ఆయన అంటున్నారు.
హోదాకే పరిమితం
వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన తరువాత చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఆస్పత్రిని "సర్వజన బోధనాస్పత్రి" స్థాయికి పెంచారు. మినహా ఇక్కడ వైద్యులను నియమించలేదు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రిని విస్తరించే పనులు అరకొరగా జరిగాయి. చిన్నపాటి రోగాలతో వెళ్లే వారికి ప్రాథమిక చికిత్స తరువాత అత్యవసర చికిత్స పేరుతో మదనపల్లె నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇదే రోగులకు శాపంగా మారుతోంది.
బోధానాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గాయత్రీదేవిని మాట్లాడుతూ, పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించలేదనే విషయం స్పష్టం చేశారు.
కుదింపుతో సమస్య జఠిలం
2023 సెప్టెంబర్ రాష్టంలోని పీహెచ్ సీల్లో రేషనలైజేషన్ ద్వారా సిబ్బందిని కుదించారు. రాష్ట్రంలో 686 పీహెచ్సీలు ఉంటే ఇందులో 24 గంటలే సేవలు అందించేవి కొన్ని. ఇందులో 14 మంది నుంచి 18వ వరకు డాక్టర్లు, సిబ్బంది ఉంటారు. పగలు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేసే ఆస్పత్రికి ఒకే డాక్టర్, ఓ స్టాఫ్ నర్స్ కు పరిమితం చేశారు. వారితో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ముగ్గురు సూపర్ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేట్ అంటే మొత్తం ఎనిమిది మంది సిబ్బందికి పరిమితం చేశారు. దీనివల్ల రెఫరల్ చేయడం మినహా మరోమార్గం లేకుండా పోయిందనేది వాస్తవం.
పీహెచ్సీలకు ప్రసవ వేదన
సిబ్బందిని కుదించడం వల్ల పీహెచ్సీల్లో మెరుగైన సేవలు అందడం కూడా కష్టంగా మారిందనే విషయం పరిస్థితి చెప్పకనే చెబుతుంది. వాస్తవానికి పీహెచ్సీల్లో మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గైనకాలజిస్టుల కొరత ఓ కారణమైతే.. రిస్క్ కేసులు ఎందుకులేబ్బా అని పెద్దాస్పత్రులకు రెఫరల్ చేయడం కూడా మరో కారణం.
రాయలసీమలోని నంద్యాల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో 52 పీహెచ్సీలు ప్రసవాలు చేయడంలో కూడా లక్ష్యం సాధించలేని స్థితి. ఒకో పీహెచ్సీకి ఐదు ప్రసవాలు చేయాలనేది లక్ష్యం. 2024 చివరి నాటికి పది నెలలకు 2,600 మందికి గర్భిణులకు సేవలు అందించాలనే లక్ష్యంలో 1,029 మందికి పురుడు పోశారు. వాటిలో ఐదు పిహెచ్సీల్లో ఒకరికి కూడా సేవలు అందలేదనే విషయం వైద్య ఆరోగ్య శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. చాలా వరకు సమీపంలోని ఏరియా ఆస్పత్రులకు పంపిస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంటే.. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం రద్దీగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని విశ్లేషిస్తే.. తెలిసేది ఒకటే. సిబ్బంది కొరత ఒక పక్క. వసతుల లేమి. దీనికి తోడు కొన్నిచోట్ల మందులు కూడా లేకపోవడమే అనే విషయాలు కనిపిస్తున్నాయి.
అసహాయ స్థితిలో ప్రభుత్వం
వైద్య విద్యారంగానికి తోడు ప్రభుత్వాస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే నిపుణుల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరూ ముందుకురాని వాతావరణంలో ప్రభుత్వ వైద్య సేవలు దయనీయంగా మారినట్లు కనిపిస్తోంది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఏమంటున్నారంటే...
"రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి కసరత్త జరుగుతోంది" అని అనంతపురంలో చెప్పారు.
"వైద్య నిపుణుల భర్తీకి ప్రకటనలు ఇచ్చినా, చాలా ప్రాంతాల్లో స్పందన లేదు. అందువల్లే చాలా విభాగాలు మూసివేశాం" అని తెలిపారు. అనంతపురం జీజీహెచ్ (Anantapur GGH) లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (Surgical Gastroenterology) విభాగం మూతపడిన విషయంపై ఆయన అలా స్పందించారు.
"గతంలో పనిచేసి, ఉద్యోగం మానేసిన నిపుణులను ఆహ్వానించి పోస్టులు భర్తకి ప్రయత్నాలు ప్రారంభించాం" వివరించారు.
ఇదిలావుంటే..
రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లో ఉన్న 125 యూనిట్లను కూడా మూసివేశారు అందులో పీపీ యూనిట్లు ( ప్రీ పొసీజర్ యూనిట్లు) మలేరియా, క్షయ, కుష్ఠు, కుటుంబ సంక్షేమ యూనిట్లను ఎత్తేశారు. అక్కడి సిబ్బందిని మరో ఆస్పత్రులకు పంపించారు. కొన్ని పీహెచ్సీల్లో డెంటల్ డాక్లర్లు ఉన్నా, అందుకు అవసరమైన కుర్చీ, వసతులు లేక, వారిని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో డెంటిస్టులకు వసతులు లేవనే సాకుతోనే వారిని మార్పు చేశారు. మనహా, రోగులకు అవసరమైన వసతులు కల్పించడానికి శ్రద్ధ తీసుకోలేదనే విషయం ఈ నిర్ణయం ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.
వేధిస్తున్న సిబ్బంది సమస్య
వైద్య ఆరోగ్య శాఖలో పారా మెడికల్ సిబ్బంది సేవలే కీలకం. అయితే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణులకు వైద్య సేవలు అందించడం కష్టంగా మారిందనడానికి నిదర్శనం ఈ శాఖలో వెక్కిరిస్తున్న పోస్టులే. అందులో ప్రధానంగా ..
పీహెచ్సీ (Primary Health Center's), జిల్లా ఆస్పత్రులు (District Hospital's) లోపారా మెడికల్ సిబ్బంది పోస్టులు 9,978 పోస్టులు ఖాళీగా ఉంటే, బోధన ఆస్పత్రుల్లో 10,065 పోస్టుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఐసీయూ (Intensive Care Unit's) లో కూడా నర్సుల సమస్య ఎక్కువగా ఉంది. సిబ్బంది లేక రోగులకు మెరుగైన సేవలు అందించడం వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ముళ్లబాటగా మారింది. ఈ పరిస్థితుల్లో..
2013 లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన మేరకు 1207 జీవో ద్వారా వెయ్యి మందిని రాష్ట్రంలో ఎంపీహెచ్ ఏ (Multipurpose Health Assistants - MPHA) పురుష, మహిళా వర్కర్లను నియమించారు. ఆ తరువాత మరో 600 మందికి అవకాశం కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వారందరి సర్వీసులు రద్దు చేస్తూ, రోడ్డు పడేశారు. 22 ఏళ్ల పాటు పనిచేసిన వారిలో చాలా మంది రిటైర్ మెంటు వయసులో ఉన్నావారే. వీరి బతుకులు భారంగా పరిస్థితికి తోడు గ్రామాల్లో వైద్య సేవల విస్తరణకు తీరని సమస్యగా మారింది. వారి సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు కాస్త మేలు జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మిస్తామనే ప్రకటనలకు ఎంతమేరకు న్యాయం జరుగుతుంది. అనేది ప్రశ్నార్థకం. రాష్ట్రంలో ఎనిమిది వేల పోస్టుల భర్తీకి ఎప్పుడు చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే.

Similar News