ఆదివారం వరకు వేటకు వెళ్లొద్దు
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By : The Federal
Update: 2025-09-25 15:22 GMT
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఎల్లుండికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీవర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40–50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదాన్నారు. గురువారం పశ్చిమగోదావరి, ఏలూరు, కష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సెప్టెంబరు 26 శుక్రవారం పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు , మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం ఏలూరు, ఎన్టీఆర్, కష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కృష్ణానది వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.55 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి హెచ్చరిక కొనసాగుతుందని రేపటికి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.
మరోవైపు గోదావారి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. కురిసే భారీ వర్షాలను బట్టి ఈ నెల 28 నాటికి క్రమంగా వరద ఉ«ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.