గాలి సుడిగుండంలో "బాబు కోట"

" వై నాట్ 175" ధ్యేయంగా వైఎస్ఆర్ సీపీ దూసుకుపోతోంది. ప్రతిపక్షాలను అష్టదిగ్బంధనం చేయాలనేది అధికార పార్టీ లక్ష్యం. దీంతో చంద్రబాబు పంచభూతాలకు శ్రమ ఎక్కువైంది.

Update: 2024-05-05 08:13 GMT

(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: విజనరీ లీడర్‌గా పేరొందిన నేత ఎన్.చంద్రబాబు పోటీ చేసే కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ జాతీయస్థాయి దృష్టిని ఆకర్షిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు.. అధికార వైఎస్ఆర్సిపి నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థిగా వైయస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీ కృష్ణ రాఘవ జయేంద్ర భరత్.. కుప్పం బరిలోకి దిగుతున్నారు. కానీ కుప్పంలో చంద్రబాబు ప్రత్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నట్లు అక్కడి రాజకీయ వాతావరణం చెబుతుంది.

రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావం తర్వాత, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేనివిధంగా శత్రుదుర్భేద్యమైన కోటగా కుప్పం మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు గట్టి పోటీ ఎదుర్కొన్న చంద్రబాబు 1989 నుంచి 2019 వరకు ఏడుసార్లు కుప్పం నుంచి పోటీ చేసి.. ప్రతిసారీ విజయం సాధించారు. ఈ విజయం వెనక కుప్పంలో పంచభూతాల తరహాలో పనిచేసే నాయకుల మేధస్సు ఉందనడంలో సందేహం లేదు.

ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అధికార వైఎస్ఆర్సిపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్ల ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. అదే పరిస్థితి ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 1999 ఎన్నికల్లో 65,687, 2004 ఎన్నికల్లో 59,588. 2009 ఎన్నికల్లో 46,066. 2014 ఎన్నికల్లో 47,121. 2019 ఎన్నికల్లో 30,722 కు మెజార్టీ తగ్గింది.

ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటి?

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్సీపి ప్రభుత్వం కుప్పం సీటుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. "వై నాట్ 175" లక్ష్యంతో, ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. పారటీ చేత కుప్పంలో పాగా వేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా కార్యాచరణా అమలు చేశారు. అందులో భాగంగానే.. కుప్పం నియోజకవర్గంలో అధికంగా ఉన్న వన్నెకుల క్షత్రియ ఓట్లు చీల్చడానికి, ఆ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని పోటీ చేయించి, 2014 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గించడంలో సఫలం అయ్యారు. అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో, ఆయన కుమారుడు భరత్‌ను 2019 ఎన్నికల్లో పోటీ చేయించి, మెజార్టీ తగ్గించడం ద్వారా దడ పుట్టించారు. చంద్రబాబుకు ధీటుగా ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా భరత్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇది కాస్తా...

 

జగన్ ఉచ్చులో.. బాబు

కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో టిడిపిని ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో.. వారందరినీ సమన్వయం చేయడంలో చంద్రబాబుకు పంచభూతాల్లా పనిచేసే పిఎస్. మునిరత్నం (కంగుంది), వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, బీసీ. నాగరాజు, ఆంజనేయరెడ్డి అన్ని వ్యవహారాలు చక్కదిద్దేవారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధి ప్రోటోకాల్‌గా ఉండాలని భావించిన చంద్రబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రకాశం జిల్లా కందుకూరు మాజీ జెడ్పిటిసి సభ్యుడు కంచర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇది స్థానిక నాయకులకు రుచించకున్నా, చంద్రబాబు కోసం కలిసి పని చేస్తున్నట్లు టిడిపి వర్గాల నుంచి అందిన సమాచారం.

 

టిడిపి బలంపై వైఎస్ఆర్సిపి ఫోకస్

కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే.. వాటిలో కుప్పం మండలంలో 2,13,145 మంది ఓటర్లు, పట్టణంలో 75,902 మంది, శాంతిపురం మండలంలో 36,354 మంది, గుడిపల్లిలో 26,283 మంది, రామకుప్పలో 35,702 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 65- 70 శాతం ఓటర్లు వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇప్పటివరకు వీరంతా గంపగుత్తగా కాకున్నా, మెజారిటీ ఓటర్లు టిడిపి పక్షానే ఉన్నారు. ఇందులో కుప్పం మండలం, మున్సిపాలిటీ, గుడిపల్లి మండలంలో టిడిపికి మంచి పట్టు ఉంది.

ఈ మండలాలపై పట్టు సాధించడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తన మద్దతుదారులకు, పార్టీ అభిమానులకు ప్రత్యేక బాధ్యతులు అప్పగించి టిడిపి ఓటు బ్యాంకుకు గండి కొట్టడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కుప్పం పట్టణంలో ప్రత్యేకంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి భరత్, ఆయన భార్య దుర్గ, సోదరుడు శరత్.. ఇంటింటికి వెళ్తూ వన్నె కుల క్షత్రియుల అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి కుప్పం సెగ్మెంట్లోని శాంతిపురం, రామకుప్ప మండలాల్లో టిడిపికి గండిపడుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో కూడా... చంద్రబాబు మొదటి మూడు రౌండ్లలో సుమారు 1100 ఓట్ల వెనకంజలో ఉన్నారు. ఆ తర్వాత క్రమేపి వందల సంఖ్యలో మెజార్టీ పెరిగింది. కుప్పం, గుడిపల్లి మండలాల్లో లభించిన ఓట్ల ద్వారా ఎన్. చంద్రబాబు మెజారిటీ వైపు దూసుకువెళ్లారు.

 

ఆపరేషన్ పుంగనూరు..!

కుప్పం సెగ్మెంట్లో పాగా వేయాలనే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొన్నేళ్లుగా ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. తమ కుటుంబానికి విధేయుడైన పుంగనూరుకు చెందిన సీనియర్ న్యాయవాది ఎన్. రెడ్డెప్పను చిత్తూరు ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. కుప్పం కూడా ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. తద్వారా ఆ ముగ్గురు నాయకులు వైఎస్ఆర్సిపి సీనియర్‌తో కలిసి బలంగా కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

కదిలిన బాబు కుటుంబం

రాజకీయ శత్రువుగా మారిన మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి తరచూ కుప్పం సెగ్మెంట్‌లో పర్యటించడం టిడిపి వర్గాలను కూడా కలవరానికి గురిచేసింది. అందుకు నిదర్శనం గతంలో ఎప్పుడూ లేని విధంగా తన నియోజకవర్గమైన కుప్పంలో టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు పదేపదే పర్యటించడంతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ తరచూ పర్యటించడానికి ఆసక్తి చూపారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నామినేషన్ డ్వాక్రా సంఘాల మహిళలు తమ సొంత డబ్బుతో డిపాజిట్ చెల్లించేవారు. 2024 ఎన్నికలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రావడం అనేది ప్రస్తావనార్హం. గ్రామస్థాయి నాయకులతో కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన చంద్రబాబు .. వారి మనసులను చూరగొనడానికి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"కుప్పం నియోజకవర్గానికి వచ్చి వెళితే నేను రీఛార్జ్ అవుతా. ఫుల్ జోష్ వస్తుంది. నిస్వార్ధంగా ఆలోచించే మనస్తత్వం మీది. మీవి మంచి మనసులు. నాపై చూపించే అభిమానం వర్ణించలేను. ఈసారి ఎన్నికల్లో లక్ష మెజారిటీ రావాలి" అని ఉత్సాహపరిచారు. ఇదిలా ఉంటే కుప్పంలో పాగా వేయాలని వైఎస్ఆర్సిపి నాయకుల అండదండలతో ఎమ్మెల్సీ భరత్ చురుగ్గా పనిచేస్తున్నారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. " కుప్పం అభివృద్ధికి న్యూ విజన్ అవసరం. అందులో అభివృద్ధి చేశాం. కొత్తదనాన్ని చూపిస్తాం" అని వైఎస్ఆర్సిపి అభ్యర్థి భరత్ అంటున్నారు. "ఈ ప్రాంతంలో వాటర్ రిసోర్సెస్ పెరగాలి. హంద్రీనీవా కాలువ ద్వారా నీరు తీసుకువచ్చాం. ఆ స్ఫూర్తితో కుప్పం తలరాత మారుస్తాం’’ అని భరత్ చెబుతున్నారు. వీరిద్దరి మాటలను కుప్పం ఓటర్లు ఎలా స్వీకరిస్తారు అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News