వారికి అంత ధీమా ఏమిటి?

పోటా పోటీ.. టఫ్‌ ఫైట్‌ .. ఈ సారి ఫలితాలు చెప్పడం చాలా కష్టంగా ఉంది.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న చర్చ. కానీ మేమే గెలుస్తామని చెప్పడంలో వారి ధీమా ఏమిటి?

Update: 2024-05-21 09:48 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఐప్యాక్‌ ధీమా ఇచ్చిందా.. గెలుస్తున్నారని చెప్పిందా.. ఏ లెక్కన చెప్పింది.. అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలు జరిగిన మూడో రోజు ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి టీమ్‌ సభ్యులను అభినందించి గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలువ బోతున్నామని చెప్పి సంచలనం సృష్టించారు. అదేబాటలోని వైఎస్‌ఆర్‌సీపీలో ముఖ్య నేతలంతా నడవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా వైజాగ్‌లో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, జూన్‌ 9న ఉదయం 9ః30 గంటలకు విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని చెప్పడం విశేషం.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో ఉన్న ధీమా ఏమిటి? ఎందుకు ఈ విధంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. గెలుపు అవకాశాలు నూరు శాతం ఉన్నాయని ఎవరు చెప్పారు. ఐప్యాక్‌ వారు చెబుతున్న వాదనలో నిజమెంతా. గత ఎన్నికల్లో 2శాతం ఓట్ల మెజారిటీతో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిందని, అదే రెండు శాతం ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతతో కొన్ని వర్గాల నుంచి తిగ్గినా మహిళల ఓటింగ్‌ పెరిగే అవకాశం ఉందని, ఆ రెండు శాతం ఓట్లు మహిళల నుంచే వస్తాయని ఐప్యాక్‌ చెబుతున్న లాజిక్‌ సరైందేనా. దీనిని వైఎస్‌ఆర్‌సీపీ నమ్మిందా. అందుకే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తోందా. అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటా జరుగుతోంది.
ఏ సర్వేకైనా కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఐప్యాక్‌ ఎలాంటి ప్రమాణాలతో సర్వే చేసిందో ఇంత వరకు చెప్పలేదు. గత ఎన్నికల్లో ఐప్యాక్‌ సర్వే అధినేతగా ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌ ఈ సారి ఆ సర్వే సంస్థ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఐప్యాక్‌ ఇన్‌చార్జిగా గుప్తా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో విశ్లేషకులకు కూడా అంతు పట్టడం లేదు. సంక్షేమం ఒక్కటే గెలిపించే అవకాశం లేదని కొన్ని సర్వే సంస్థలు చెబుతుండగా, సంక్షేమానికి ఓట్లు పడతాయని, జగన్‌ తిరిగి సీఎం అవుతారని వైఎస్‌ఆర్‌సీపీ భావిస్తోంది. సర్వే సంస్థలు ఎన్ని చెప్పినా సొంత సంస్థ సాక్షిని కూడా జగన్‌ నమ్ముకోలేదు. కేవలం ఐప్యాక్‌పైనే ఆధారపడి వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు బాటలో ఉన్నామని చెబుతోంది.
వైజాగ్‌ను రాజధానిగా ప్రజలు ఆమోదించారా
వచ్చే నెల 9వ తేదీనా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వైజాగ్‌లో చేస్తారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రకటించడం వైజాగ్‌లో రాజధానిగా ప్రకటిస్తారనడానికి సంకేతంగా వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ వ్యవహారం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇలాంటి మాట్లేవి మాట్లాడకుండా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై ఏపీలో కూటమి గెలుపు సాధిస్తుంని, దీనిపై పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. సొంత సంస్థ అయిన సాక్షినే నమ్మని జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని, చంద్రబాబు ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద అన్నట్లు తెలిసింది. అభివృద్ధి లేని రాష్ట్రాన్ని ప్రజలు చూడాలనుకోవడం లేదని, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలైన ఓటింగ్‌ శాతం అందుకు నిదర్శనమని, చంద్రబాబు తమ పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం.
పార్టీ నాయకులు ఎవరి ధీమాలో వారు ఉన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మాత్రం మరి కాస్తా ఎక్కువుగా స్పందిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్టు చెరుకూరు మల్లికార్జునరావు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీది మేకపోతు గాంభీర్యం మాదిరిగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడు లేని విధంగా భారీ స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైందని, పెరిగిన ఓటింగ్‌లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పడి ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొందన్నారు. అయితే తమకే పడి ఉంటాయని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారని, సహజంగా పెరిగిన పోలింగ్‌ శాతం అనేది యాంటీ గవర్నమెంట్‌కు సంకేతంగా చెబుతారని, గతంలో కూడా ఇది రుజువైందని, ఈ లెక్కలో చూస్తే కూటమికి అడ్వాంటేజీ ఉండే చాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ క్యాడర్‌లోను, కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అలా మట్లాడి ఉండొచ్చని మల్లికార్జునరావు అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News