ఏమిటీ గ్రీన్ హైడ్రోజన్? చంద్రబాబుకి ఎందుకింత ఆసక్తి!
గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ లో అసలు ఏముంది?;
Byline : G.P Venkateswarlu
Update: 2025-07-22 11:59 GMT
అమరావతిని అన్నింటా ముందుండేలా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ఎనర్జీపై దృష్టి సారించారు. దేశంలోనే తొలిసారిగా అమరావతిని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చేందుకు నడుంకట్టారు.
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇంధన రంగంలో అగ్రగామిగా నిలపడానికి ఇదొక దీర్ఘకాలిక విజన్. రూ. 500 కోట్ల కేటాయింపు, 50 స్టార్టప్‌లతో ఈ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు, సాంకేతిక సవాళ్లను అధిగమించడం కీలకం. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చాలనే లక్ష్యంతో "అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్-2025"ను జులై 21న విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలపడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.
గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి?
గ్రీన్ హైడ్రోజన్ అనేది పునరుత్పాదక ఇంధన వనరుల (సౌర, పవన, జల విద్యుత్) ద్వారా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను సూచిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైసిస్ (Electrolysis for green hydrogen production) ప్రక్రియ ద్వారా నీటిని (H₂O) హైడ్రోజన్ (H₂) ఆక్సిజన్ (O₂)గా విభజిస్తుంది. ఇది కార్బన్ రహిత ఇంధనం.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియ...
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైసిస్ (Electrolysis) అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడానికి ఎలక్ట్రోలైజర్ అనే పరికరం ఉపయోగిస్తారు. ఇది సౌర లేదా పవన శక్తి నుంచి వచ్చే విద్యుత్‌ను ఉపయోగించి నీటిని విభజిస్తుంది. ఈ ప్రక్రియకు అవసరమైన విద్యుత్ సౌర ప్యానెళ్లు, పవన టర్బైన్లు లేదా ఇతర పునరుత్పాదక వనరుల నుంచి సేకరిస్తారు.
హైడ్రోజన్ గ్యాస్‌ను సేకరించి ఇంధనంగా లేదా గ్రీన్ అమ్మోనియా, మిథనాల్ వంటి డెరివేటివ్‌ల (గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి తయారు చేసిన ఇతర రసాయన ఉత్పత్తులు, ఇంధనాలు) తయారీకి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ఉప ఉత్పత్తిగా విడుదలవుతుంది. ఇది పర్యావరణానికి హానికరం కాదు.
గ్రీన్ హైడ్రోజన్‌ను ఫ్యూయల్ సెల్స్‌లో ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇది వాహనాలు, పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లలో శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. ఇది కార్బన్ రహిత ఇంధనం. కాబట్టి గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్లో కీలక అంశాలు
అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన రెండు రోజుల గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ (జులై 18-19, 2025)లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ నిపుణుల సూచనల ఆధారంగా రూపొందించారు. ఈ డిక్లరేషన్ కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
-2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌గా మార్చడం.
-దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంలో 20 శాతం రాష్ట్రం నుంచి రావాలని లక్ష్యం.
-కోట్ల విలువైన రెండు ఒప్పందాలు (MoUs) జరిగాయి.
-కృష్ణపట్నంలో 1 MMTPA (1 Million Metric Tonnes Per Annum) (సంవత్సరానికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులు) గ్రీన్ అమ్మోనియా ప్లాంట్. యమ్నా (UK) ఏర్పాటు,
-మచిలీపట్నంలో 150 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 600 కిలోటన్నుల గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ KSH ఇన్ఫ్రా వారు ఏర్పాటు
-2027 నాటికి 2 గిగావాట్లు, 2029 నాటికి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం. 2029 నాటికి 25 గిగావాట్ల పునరుత్పాదక శక్తి పంపిణీ కోసం గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు,
-గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 50 స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం, ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ. 500 కోట్లు కేటాయించడం.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశ్రమల స్థాపనపై సమీక్ష కోసం ‘ఏపీ గ్రీన్ హైడ్రోజన్ అసోసియేషన్’ అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు.
-డిక్లరేషన్ అమలుపై ఏటా సమీక్ష నిర్వహించడం.
ఏమిటీ గ్రీన్ హైడ్రోజన్? చంద్రబాబుకి ఎందుకింత ఆసక్తి!
గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ లో అసలు ఏముంది?
చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు. ఇది 50 స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఈ స్టార్టప్‌లు ఎలక్ట్రోలైసిస్ సాంకేతికతలో కొత్త పద్ధతులను అభివృద్ధి చేస్తారు.
ఉత్పత్తి ఖర్చును తగ్గించేందుకు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగం కోసం సమగ్ర ఎకోసిస్టమ్‌ను నిర్మించడం.
స్టార్టప్‌ల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియకు అధిక విద్యుత్ అవసరం. ఇది ఉత్పత్తి ఖర్చును పెంచుతుంది. గ్రీన్ హైడ్రోజన్ నిల్వ, రవాణా కోసం అధునాతన సదుపాయాలు అవసరం. కొత్త సాంకేతికతల అభివృద్ధి కోసం పరిశోధనలు, నిధులు అవసరం అవుతాయి. ఈ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేసేందుకు కావాల్సిన వనరులు బాగా ఉన్నాయని, అమరావతి ప్రాంతంలోని కొండలపై పవన విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా అనుకూలంగా ఉంటుందని పవన విద్యుత్ రంగ నిపుణులు తిర్లుక దినేష్ ‘ది ఫెడర్ ఆంధ్రప్రదేశ్’కు చెప్పారు. ఆయన పవన విద్యుత్ పరికరాల ఉత్పత్తి రంగంలో 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు