పల్నాడు జిల్లాలో ఘటన
పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రమాదేవి (22) అనే యువతికి ఇటీవల శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ నారాయణ స్వామి, వైద్యసిబ్బంది చేసిన ఆపరేషన్ తర్వాత ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇది సహజమే అంటూ సిబ్బంది నమ్మబలికారు. అయితే శుక్రవారం స్కానింగ్ చేసినప్పుడు రమాదేవి తొడలోనే సర్జికల్ బ్లేడ్ మిగిలిపోయినట్లు తేలింది. సర్జరీ సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే ఉంచేసి కుట్లు వేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలిసుకున్న పేషెంట్ రమాదేవి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్‌లో వైద్య సిబ్బంది ఘోర నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.
తుని ఘటన..వైద్యుడు, నర్సుకు సస్పెన్షన్
ఈ ఘటనకు కేవలం ఐదు రోజుల ముందే అదే తరహా ఉదంతం కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అక్కడ ఒక రోగిపై శస్త్రచికిత్స చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతి రోగి శరీరంలోనే సర్జికల్ బ్లేడ్ వదిలేసినట్లు తేలడంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిని విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు వెంటనే వారిని సస్పెండ్ చేశారు. తుని ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స భద్రతా నిబంధనలను మరోసారి సమీక్షించాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వ్యవస్థలో లోపాలు బయటపెట్టిన సంఘటనలు
అయితే రెండు జిల్లాల్లో చోటుచేసుకున్న వరుస సంఘటనలు ప్రభుత్వ వైద్య రంగంలో పర్యవేక్షణ, బాధ్యత, క్రమశిక్షణ లోపాలను బహిర్గతం చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్స పర్యవేక్షణలో లోపాలు, పరికరాల కౌంటింగ్ విధానాలు అమలు కాకపోవడం, రోగుల ఫిర్యాదులను లైట్‌గా తీసుకోవడం, నిరంతర శిక్షణ, నాణ్యత నియంత్రణలో లోపాలు ఉండటం వంటి అవేక అంశాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ ఆపరేషన్ తర్వాత అజాగ్రత్తగా వ్యవహరించడం, ఇలా ప్రమాదకర పరికరాలు రోగుల శరీరాల్లోనే ఉంచేసి కుట్లు వేసేయడం వంటి సంఘటనలతో సర్కారు ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో భయాందోళనలు నెలకొనే పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళనలకు దిగిన బాధితులు
పల్నాడు ఘటనలో రమాదేవి బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగగా, తుని ఘటనలో కూడా బాధిత కుటుంబ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాంతకం అవుతుందని, ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజాసంఘాలు, ఆరోగ్య హితసేవా సంస్థలు కూడా స్పందించాయి.
మాయని మచ్చగా
తుని ఘటన తర్వాత ఆరోగ్యశాఖ సస్పెన్షన్లు అమలు చేసినప్పటికీ, పల్నాడు సంఘటన మరలా జరుగడంతో ప్రభుత్వ చర్యలు తాత్కాలికంగానే జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని బలపరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శస్త్రచికిత్స భద్రతా ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఒక వారం వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జికల్ బ్లేడ్ నిర్లక్ష్యం కేసులు బయటపడటం రాష్ట్ర వైద్య వ్యవస్థపై మాయని మచ్చగా మారింది.