అన్నమయ్య జిల్లా మార్పుపై బాబు మదిలో ఏముంది!
పింఛన్ల పంపిణీకి ఈరోజు రాజంపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-01 04:07 GMT
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పర్యటనకు సీఎం ఎన్. చంద్రబాబు ఇంకొన్ని గంటల్లో (సోమవారం) రానున్నారు. ఆయన పర్యటనపై ఈ ప్రాంత ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. రాజంపేట జిల్లా ఏర్పాటుపై విన్నవించాలని టీడీపీ నేతలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
రాజంపేట మండలంలో సీఎం ఎన్. చంద్రబాబు పర్యటనలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ తోపాటు ప్రజావేదిక నుంచి ప్రజలతో సమావేశం కావడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
పింఛన్ లబ్ధిదారుల ఇంటి వద్ద అధికారులతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
నేడు రాజంపేటకు
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం ఎన్. చంద్రబాబు ప్రతినెలా ఓ నియోజకవర్గంలో పర్యటించి పింఛన్ల పంపిణీ చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఆ మేరకు రాజంపేటలో సోమవారం సోమవారం పర్యటించనున్న ఆయన ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. దీనికోసం ఓ కాలనీలో అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. దీంతోపాటు ప్రజావేదికపై ప్రజలతో సీఎం ఎన్. చంద్రబాబు సమావేశం అవుతున్నారు. జిల్లాల పర్యటనకు వచ్చే సమయంలో సీఎం చంద్రబాబు ప్రజలతో పాటు ఆ ప్రాంత టీడీపీ శ్రేణుల సమస్యలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సీఎం పర్యటన ఇలా..
బోయనపల్లె వద్ద ధోబీఘాట్ వద్ద మహిళలతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, అధికారులు
అన్నమయ్య జిల్లాలో సీఎం ఎన్. చంద్రబాబు పర్యటన కార్యక్రమం ఇలా సాగనున్నది.
ఉదయం 10గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరుతారు.
10:20 బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
10:50 అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని మన్నూరు వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ చేరుకుంటారు.
11:50 నుంచి 12 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.
మధ్యాహ్నం 12: 15 రాజపేట మండలం పెద్దకారంపల్లెకు చేరుకుంటారు.
12:15 నుంచి 12: 25 వరకు పెద్దకారంపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి లబ్ధిదారుల ఇళ్లకు వెళతారు.
12:25 పెద్ద కారంపల్లె నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
12:40 రాజంపేట మండలం బోయినపల్లె వద్దకు వెళ్తారు
12:50 నుంచి 1:05 గంటల వరకు దోభీఘాట్ పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడతారు.
1:05కు బోయినపల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
1:15 గంటలకు రాజంపేట మండలం తాళ్లపాక వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు.
1:15 నుంచి 1:45 నిమిషాల వరకు రిజర్వ్
1:45 నుంచి 1:50 వరకు స్టాల్స్ పరిశీలన
1:50 నుంచి 3:05 వరకు ప్రజావేదిక మీటింగ్ కు హాజరవుతారు
3:05 గంటల నుంచి 3:15 వరకు సోషల్ మీడియా కార్యకర్తలతో మాట్లాడతారు.
3:15కుతాళ్లపాక నుంచి బయలుదేరుతారు.
3:25 గంటలకు తాళ్లపాక గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
4:25 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
4:35 గంటలకు మన్నూరు వద్దకు చేరుకుంటారు
సాయంత్రం 4:40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విజయవాడలోని ఉండవల్లికి నివాసానికి బయలుదేరి వెళ్తారు
జిల్లా ప్రకటనపై ఆశలు...
రాష్ర్టంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తెరపైకి వచ్చిన నేపథ్యంలో రాజంపేట జిల్లా ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు, టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను విభజించారు.
"పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా జిల్లా కేంద్రాల ఏర్పాటు ఉంటాయి" అని మాజీ సీఎం వైఎస్. జగన్ చెప్పారు. ఆయన అధికారంలో ఉండగా, బ్రిటీష్ కాలం నాటి రాజంపేట, మదనపల్లె రెవెన్యూ డివిజన్లను కాదని, ఆ రెండు ప్రాంతాలను కలుపుతూ ఊహించని విధంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. దీనిపై రాజంపేట, మదనపల్లె డివిజన్ కేంద్రాలను జిల్లాలుగా ప్రకటించాలనే డిమాండ్ తో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
"ఈ జిల్లా కేంద్రాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి" అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
2024 ఎన్నికల వేళ జరిగిన ప్రచారంలో ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.
"మదనపల్లె, రాజంపేట ( ఈ రెండు నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి), ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తా" అని స్పష్టంగా ప్రకటించారు. మార్కాపురం జిల్లాగా మార్చడానికి ఈపాటికే అడుగులు పడిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల హామీని గుర్తు చేయడం ద్వారా రాజంపేట, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు టీడీపీ నేతలు సీఎం ఎన్. చంద్రబాబుకు విన్నవించాలని భావిస్తున్నారు. ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయనున్నారనే విషయంలో ఆసక్తి ఏర్పడింది.