ఈ నెల 17న జిల్లా కమిటీలను ప్రకటించేందుకు టీడీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి పెట్టిందని చెబుతున్నారు. జిల్లా కమిటీల ఎంపికలో కుల సమీకరణలకు ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా పార్టీ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. 2024 ఎన్నికల్లో సోషల్ రీఇంజనీరింగ్‌తో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసి బెటర్ రిజల్ట్స్‌ను సాధించారు. ఇప్పుడు పార్టీ పదవుల పంపిణీ, జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఐదు అంశాలను బేస్ చేసుకుని జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
త్రీమెన్ కమిటీ ప్రతి జిల్లాకు వెళ్లి.. జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆ రిపోర్టును టీడీపీ అధిష్టానం ముందుంచింది. అయితే తీవ్ర ఒత్తిడి ఉండటంతో పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఓ నిర్ణయానికి రాలేకపోయింది. నాలుగైదు రోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ ఆఫీస్‌కు వచ్చి..పార్టీ పదవుల పంపకం పెండింగ్‌లో పెట్టడంపై ఆరా తీశారు. ప్రతి జిల్లా నుంచి అధ్యక్షుడి ఎంపిక కోసం రెండు, మూడు పేర్లను ప్రతిపాదిస్తూ వచ్చిన నివేదికలను పరిశీలించి.. జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీ ఎంపికపై ఓ అంచనాకు వచ్చారు.
త్రీమెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా 34 శాతం పదవులు అగ్రవర్ణాలకు, 41 శాతం బీసీలకు, 7 శాతం పదవులను ఎస్సీలకు, 3 శాతం పదవులు ఎస్టీలకు మిగిలిన పదవులు మైనార్టీలతో పాటు ఇతర వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం కేటాయించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా కనీసం 26 శాతం, పదవులు మహిళలకు దక్కేలా చూడాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
గతంలో 32 మంది సభ్యులకు జిల్లా కమిటీల్లో అవకాశం కల్పించగా, ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది. 32 నుంచి 40 మంది సభ్యులకు పెంచబోతున్నారు.
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఐదుగురు కార్యదర్శులు, ఐదుగురు ఉపాధ్యక్షులతో పాటు కమిటీ సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీల్లో యువనేతలతో పాటు సామాన్య కార్యకర్తలకు పదవులు దక్కేలా అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు రానివారు, నామినేటెడ్ పదవులు దక్కని నేతలు.. అధ్యక్ష పదవి కోసం ఆఖరి క్షణం వరకు లాబీయింగ్ చేస్తున్నారు.
చట్టసభలకు ఎన్నిక కాని వారు, నామినేటెడ్ పోస్టులు దక్కని వారు ఈ పదవులకు పోటీ పడ్డారు. వీరిలో కొందరి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి సమాచారం అందింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం జిల్లా అధ్యక్షుల పేర్లు ఇవీ..
- తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి
- చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా షణ్ముగం
- అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్
- ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి
- అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కాలవ శ్రీనివాసులు
- శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు
- నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ధర్మవరపు సుబ్బారెడ్డి పేరు
- విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున
- ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి
- కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జోత్యుల నవీన్
- బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్
- పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్
- గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యాలరావు
- ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ
- కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి
- ప.గో. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రామరాజు
- తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వెంకటరమణచౌదరి
- కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గుత్తుల సాయి
- విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్
- అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల తాతబ్బాయ్
- కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వహీద్
- నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర
- కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి