శ్రీవారిని మార్చి నెలలో దర్శించుకోవాలని ఉందా...
ఈ నెల 18వ తేదీ ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
Byline : SSV Bhaskar Rao
Update: 2025-12-16 08:30 GMT
తిరుమల శ్రీవారిని వచ్చే సంవత్సరం మార్చి నెలలో దర్శించుకోవాలనే యాత్రికులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించడానికి టీటీడీ అవకాశం కల్పించింది. ఈ నెల 18వ తేదీ TTD online website లో ఆర్జితసేవ, దర్శన కోటా టిక్కెట్ల తోపాటు వసతి గదులు కూడా విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు టీటీడీ టికెట్ల కోటా విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.
మూడు నెలల ముందే..
తిరుమలలో శ్రీవారి దర్శనం కోటా టికెట్లు మూడు నెలలు ముందే టీటీడీ ఆన్ లైన్ విడుదల చేస్తోంది. తిరుమలతో పాటు తిరుపతిలో గదుల కేటాయించడానికి కూడా అదే పద్ధతి అనుసరిస్తోంది. యాత్రికులు ఇబ్బంది పడకుంగా, ముందుగా తిరుమల యాత్ర సాగించేందుకు వీలుగా ఈ సదుపాయం టీటీడీ అందుబాటులో ఉంచింది.
18వ తేదీ ఉదయం పది గంటలకు..
తిరుమల శ్రీవారి దర్శనానికి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) సేవా టికెట్లు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు జారీ అవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటా 22 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
23 వ తేదీ అంగ ప్రదక్షిణ టోకెన్లు: తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ కోసం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
శ్రీవాణి ట్రస్టు కోటా: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ టికెట్ కోసం ఒకో యాత్రికుడు రూ. 10,500 చెల్లించాలి. రూ. 500 వీఐపీ బ్రేక్ టికెట్, మిగతా పది వేలు శ్రీవాణి ట్రస్టుకు జమ అవుతుంి.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శనం: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదుల కోటా: తిరుమల, తిరుపతిలో యాత్రికులకు టీటీడీ ఆన్ లైన్ లోనే గదులు కేటాయిస్తుంది. దీనికోసం తిరుమల, తిరుపతిలో గదుల కోటా 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.