ఈ రైల్వే డివిజన్ కు ఏమైంది? ఎందుకీ కలవరపాటు..!?

గతిశక్తి రైల్వే ప్రాజెక్టు పనుల అనుమతి ఇవ్వడానికి అధికారులు గాడి తప్పారా? వారికి కాంట్రాక్టర్లు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు. గుంతకల్లు డీఆర్ఎం ఆఫీసులో అసలు ఏమి జరిగింది?

Update: 2024-07-06 14:17 GMT

దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్  రైల్వే యంత్రాంగం కలవరానికి గురైంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా కాంట్రాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసిన ఐదుగురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

దేశంలోని వివిధ రైల్వే మార్గాల్లో రైళ్ల వేగం 130 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం ట్రాక్ పటిష్ఠతకు ప్రత్యేక చర్యలు తీసుకున్న కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గతిశక్తి పథకం కింద వంతెనల నిర్మాణం, ఆధునికీకరణకు చర్యలు తీసుకుంది. ఈ పనులు చేపట్టేందుకు గుంతకల్లు రైల్లే డివిజన్ కేంద్రంలో కాంట్రాక్టర్లకు అనుమతి పత్రాలు మంజూరు చేయకుండా, లంచం కోసం మడతపేచీ పెట్టింది.
గతిశక్తి ప్రాజెక్ట్...
ఆధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2021లో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అమలులోకి తీసుకుని వచ్చారు. ఇందులో ప్రధాన ఉద్దేశ్యం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ప్లానింగ్, అమలు కోసం సమన్వయానికి ఈ ప్రాజెక్టును తీసుకుని వచ్చారు. రవాణా రంగంలో ఖర్చులు తగ్గించడం, వేగవంతమైన సేవలు అనేవి ప్రాధాన్యతా అంశాలు. అందులో 16 మంత్రిత్వ శాఖలను సమన్వయం లో భాగంగా రోడ్డు, విమానయానం, నౌకాశ్రయాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ తోపాటు రైల్వే రంగం కూడా ప్రధానమైందిగా గుర్తించి, ప్రాధాన్యం ఇచ్చారు. గతంలలో పరిశ్రమల కోసమే ఇచ్చిన ప్రాధాన్యం ఇస్తూ జోన్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో వ్యవహరించి, ప్రజారవాణాపై కూడా దృష్టి కేంద్రీకరించారు. మెట్రో వ్యవస్థను అభివృద్ధి చేయడంతోపాటు రైల్వే పనులు కూడా వేగవంతం చేశారు. రైల్వే స్టేషన్ల మధ్య మల్టీ మోడలింగ్ కనెక్టివిటీకి అవకాశం కల్పించారు. మొత్తం మీద మౌలిక సదుపాయాల వ్యవస్థలో వేగవంతమైన, మార్పులు తీసుకుని రావాలనేది ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. అందులో భాగంగా...
గుంతకల్లు డివిజన్లోని మూడు సెక్షన్లలో కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. వాటికి అనుమతి పత్రాలు ఇవ్వడానికి అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న సీబీఐ అధికారులు గుంతకల్లులో మూడు రోజులు మకాం వేశారు. చాకచక్యంగా వలపన్ని నగదు ఇస్తుండగా, డీఆర్ఎంతో పాటు ఎనిమిది మంది అధికారులను అరెస్ట్ చేశారు. గురువారం నుంచి అధికారులతో పాటు, డీఆర్ఎం కార్యాలయంలో కూడా ముమ్మరంగా తనిఘీలు సాగించారు. ఇందుకు ప్రధాన కారణం రైల్వే మార్గాల్లో వంతెనలు, కల్వర్టుల నిర్మాణ పనుల అనుమతి మంజూరుకు నగదు డిమాండ్ చేయడమే.
రూ. 5౦౦ కోట్లతో పనులు
గుంతకల్లు పరిధిలోని పాకాల- ధర్మవరం, రేణిగుంట-గుత్తితో పాటు ఇంకొన్ని సెక్షన్ల పరిధిలో ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద రూ. 500 కోట్ల వ్యయంతో వంతెనల నిర్మాణ పనుల మంజూరు చేశారు. ఈ పనులను కడప జిల్లాకు చెందిన రమేష్ రెడ్డితో పాటు 11 మంది కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. పాకాల- ధర్మవరం సెక్షన్లోని కదిరి మార్గంలో ఎక్కువగా ఉన్న చిన్నపాటి వెంతెనల నిర్మాణ పనులు చేపట్టడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు అనుమతి మంజూరు చేయాలి. ఇందుకోసం డివిజన్ రైల్వే ఫైనాన్స్ మేనేజర్ (డీఎఫ్ఎం) డబ్బు డిమాండ్ చేశారని కాంట్రాక్టర్ రమేష్ ఆరోపించారు. ఇదిలావుండగా..
సీబీఐకి ఫిర్యాదు
ఈ వ్యవహారంపై కాంట్రాక్టర్ల నుంచి ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీలోని సీబీఐ ఏసీ-3 ఢీఎస్పీ జైకుమార్ భర్తియా సారధ్యంలోని బృందం సమీక్షించి, కొన్ని సూచనలు చేశారు. ఆయన సారధ్యంలోని సీబీఐ అధికారులు గుంతకల్లులో మూడు రోజుల కిందటే మకాం వేశారు. డీఎఫ్ఎం డ్రైవర్ బాషాకు కాంట్రాక్టర్లు నగదు ఇస్తుండగా రంగప్రవేశం చేసి, పట్టుకున్నారు. బాషాను విచారించగా, డీఎఫ్ఎం ప్రదీప్ బాబు సూచనల మేరకు నగదు తీసుకున్నట్లు అంగీకరించాడని తెలిసింది. ఆ వెంటనే ఆలస్యం లేకుండా, సీబీఐలోని ఓ బృందం డీఆర్ఎం వినీత్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకుంది. డీఆర్ఎం కార్యాలయంలోని ఫైనాన్స్, పారిపాలన, ఇతర సెక్షన్ల సిబ్బందిని కూడా విచారించడంతో పాటు గతిశక్తి ప్రాజెక్టు కింద మంజూరు చేసిన పనుల వివరాల రికార్డులతో పాటు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఢీఎస్పీ జైకుమార్ భర్తియా ఓ ప్రకటనలో వెల్లడించారు. డీఆర్ఎం వినీత్ సింగ్, డీఎఫ్ఎం కుందా ప్రదీప్ కుమార్ బాబు, డివిజనల్ ఇంజినీర్ అక్కిరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం. బాలాజీ, చీఫ్ ఇంజినీర్ గతిశక్తి ప్రాజెక్టు కార్యాయలయ అకౌంట్స్ ఆఫీసర్ డి. లక్ష్మీపతిరాజును అరెస్ట్ చేసినట్లు ఢీఎస్పీ జైకుమార్ భర్తియా వెల్లడిచారు. ఈ వ్యవహారాలతో సబంధం ఉన్న ఇంకొంత మంది అధికారులు, సిబ్బంది కూడా సీబీఐ అదుపులో ఉన్నట్లు సమాచారం అందింది.
ఇళ్లలో సోదాలు..
మూడు రోజుల కిందటే గుంతకల్లులో మకాం వేసిన సీబీఐ బృందాలు డివిజన్ కార్యాలయంపై కొందరు, మరో బృందం అధికారుల నివాసాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయంలో అధికారులు ట్రాప్ అయ్యారని సమాచారం అందగానే, మరో బృందం అధికారుల నివాసాల్లో తనిఘీలకు దిగిందని సమాచారం. ఇందులో డీఆర్ఎం వినీత్ సింగ్ నివాసంలో భారీగానే నగదు, ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు గుంతకల్లు రైల్వే యంత్రాంగం ద్వారా తెలిసింది.
కుటుంబీకులకు సమాచారం
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీబీఐ తనిఘీలు సాగుతున్నట్లు సమాచారం అందుకున్న ఆ శాఖ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. లంచం డిమాండ్ చేసిన వారి ఇళ్లలో తనిఖీలు సాగించిన సీబీఐ యత్రాంగం అధికారుల కుటుంబీకులకు సమాచారం అందించింది. వారి సమక్షంలో అరెస్ట్ చేసిన ఐదుమందితో పాటు ఇకొందరిని కూడా గుంతకల్లు రైల్వే ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలకు తరలించారు. ఆ తరువాత వారందరినీ కర్నూలు సీబీఐ కోర్టులో హాజరు పరిచినట్లు తెలుస్తోంది. కాగా, కాంట్రాక్టు పనులు దక్కించుకున్న తమకు అనుమతి పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లను కూడా సీబీఐ అధికారులు వెంట తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించడం కోసం వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లారని తెలుస్తోంది.
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఈ తరహా అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. తాజా సంఘటన నేపధ్యంలో రైల్వే ఇంజినీరింగ్ విభాగంలో గుబులు రేగింది. మళ్లీ దాడులకు ఆస్కారం ఉంటుందా? ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
Tags:    

Similar News