తిరుమలలో సీపీఐ నారాయణ ఏమి చేశారంటే..
టీటీడీపై ప్రశంసలు కురిపించారు. ధర్మస్థలిపై నిప్పులు చెరిగారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-09 09:22 GMT
తిరుమలలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ శనివారం ఉదయం సందడి చేశారు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే. రోజా, ఆ పార్టీ నేతలతో ఫోటోలు దిగడం ఆసక్తికరంగా కనిపించింది.
"టీటీడీ యాత్రికులకు అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయి" అని నారాయణ కితాబు ఇచ్చారు.
దేవుడు అంటే కమ్యూనిస్టులకు నమ్మకం ఉండదని అందరూ భావిస్తారు. ఇదే మాట వారు కూడా చెబుతారు. అయితే, వ్యక్తుల విశ్వాసాలకు మాత్రం గౌరవం ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, సీపీఐ నారాయణ తీరు విభిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఏ పని చేసిన జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తారనడంలో సందేహం లేదు. పాత సంఘటనలు పక్కకు ఉంచితే, ఇటీవల తిరుపతిలో జరిగిన తాతయ్యగుంట గంగమ్మ జాతరకు జిల్లా నేతలతో కలిసి గంగమ్మ ఆలయానికి కోడిపుంజును తీసుకుని వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు తీసుకోవడంతో పాటు, కానుకలు కూడా సమర్పించారు. తాజాగా.
తిరుమల ఆలయం ముందు వైసీపీ మాజీ మంత్రి ఆర్ కే రోజా, నేతలతో సీపీఐ నారాయణ
శ్రీవారిని దర్శించుకునే వీఐపీలు వెలుపలికి వచ్చే సమయంలో తిరుమలలో సీపీఐ నారాయణ శనివారం ఉదయం ప్రత్యక్ష్యం అయ్యారు. వీఐపీ విరామ సమయం తరువాత ఆయన శ్రీవారి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.
"దాదాపు 35 సంవత్సరాలుగా సీపీఐ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన గోవిందు కూతురి పెళ్లి తిరుమలలో జరిగింది. వారి కుటుంబం అంతా నాకు తెలుసు. అందుకే తిరుమలకు వచ్చా. లోకల్ గా (తిరుమల) అంతా నాకు తెలుసు. అందుకే ఈ ప్రదేశంలో తిరుగుదామని వచ్చా. తిరుమల గుడిలోకి వెళ్లలేదు" అని సీపీఐ నారాయణ చెప్పారు.
"దేశంలో బోర్డు అంటే టీటీడి ట్రస్టు బోర్డు దేశంలో నంబర్1గా ఉంది. సేవలు అద్భుతంగా ఉన్నాయి. యాత్రికులు బాగా వస్తున్నారు. ఆదాయం బాగా వస్తోంది. సదుపాయాలు కూడా చాలా కల్పిస్తున్నారు. యాత్రికులు ఎక్కువ వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అవుతోంది" అని సీపీఐ నారాయణ కితాబు ఇచ్చారు.
సీపీఐ నేత వైసీపీ మాజీ మంత్రి సంభాషణ
సీపీఐ నారాయణ శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. అదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే. రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కూడా వారి పార్టీ నేతలతో కలిసి వెలుపలికి వచ్చారు.
సీపీఐ నారాయణను చూసిన వెంటనే ఆశ్యర్యపోయారు. ఆలయం వద్ద వారి సంభాషణ ఆసక్తికరంగానే సాగింది. నవ్వుతూ కలకరించారు.
"ముందు మీ పార్టీ వాళ్లతో ఫోటోలు తీసుకోండి. మళ్లీ వస్తా" అని నారాయణ గొల్లమండపం సమీపంలోకి వెళ్లి, వెనుదిరిగి వచ్చారు. వైసీపీ నేతలతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.
తిరుమల ఆలయం వద్ద సీపీఐ జాతీయ నేత నారాయణ కనిపించడం. ఆయనతో వైసీపీ నేతలు సరదాగా ఫోటోలు దిగడం అనే అంశం ప్రత్యేకంగా కనిపించింది.
ధర్మస్థలి ఘటనపై విమర్శలు
తిరుమల లేదా ఆలయం సమీపంలో రాజకీయ విమర్శలకు ఆస్కారం లేదు. టీటీడీ ఆంక్షలు విధించింది. అమలు జరుగుతున్న తీరు మాత్రం అంతంతమాత్రంగా అని చెప్పవచ్చు.
తిరుమలకు వచ్చిన సీపీఐ నారాయణ కూడా ఆలయ పరిసరాల్లోని ఆహ్వాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ఆయనను గమనించిన మీడియా కెమెరాలు ఎక్కుపెట్టింది.
టీటీడీ యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయాలను అభినందించిన సీపీఐ నారాయణ కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిపై తీవ్ర విమర్శలు చేశారు.
"టీటీడీ తరహాలోనే ధర్మస్థల ట్రస్టు బోర్డును ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలి" అని నారాయణ డిమాండ్ చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ఒకే కుటుంబం ఆధీనంలో ధర్మస్థల బోర్డు ఉంది. ఇది సరైంది కాదు. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, శవాల పూడ్చివేత కేసు సంచలనంగా మారిన నేపథ్యం గమనించాలి" అని అన్నారు.
ఆ ట్రస్టు చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేయడంపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ధర్మస్థలలో 500 మంది అమ్మాయిలను అత్యాచేరం చేసి, పూడ్చిపెట్టారని నారాయణ ఆరోపించారు.
"కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే, జరిగేది కాదు" అని నారాయణ అభిప్రాయపడ్డారు.
ధర్మస్థలలో సీపీఐ నేత ఎంపీగా పోటీ చేయడానికి అడ్డుకున్నారని నారాయణ గుర్తు చేశారు. పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేసిన తమ నేత 15 ఏళ్ల కూతురిని అత్యాచారం చేసి, చంపేశారని నారాయణ ఆవేదన చెందారు. దర్యాప్తు సవ్యంగా సాగించి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.