పులివెందుల జడ్పీటీసీ గెలిచి తీరాలి..చంద్రబాబు ఆదేశం
కడప జిల్లా టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.;
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీని ఎట్టిపరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుని తీరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై శుక్రవారం సీఎం చంద్రబాబు కడప జిల్లా టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో పాటు మరో ముఖ్యమైన 40 మంది టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
పులివెందులలో టీడీపీ జెండా ఎగరాలని, ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకొని రావాలని ఈ సందర్భంగా హుకుం జారీ చేశారు. కూటమి నేతలంతా కలిసి ఒక తాటిపైకొచ్చి గెలుచుకుని రావాలనే సంకల్పంతో పని చేయాలని దిశానిర్థేశం చేశారు. పులివెందులను తాను డెవలప్ చేస్తానని, తమ హయాంలోనే గతంలో పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడమని వారికి గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్ చేయని విధంగా పులివెందులను అభివృద్ధి చేస్తామని జడ్పీటీసీని గెలుచుకురండి అని వారికి ఆదేశాలు జారీ చేశారు.