కావలి ఎమ్మెల్యే 'కావ్య' హత్యకు కుట్ర జరిగిందా?
క్రషర్ వద్ద రౌడీల వీరంగం అందుకేనా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు పరారీలో ఉన్నారు?;
By : The Federal
Update: 2025-08-20 05:29 GMT
ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? అందుకే ఆయన క్రషర్ వద్ద రౌడీలు వీరంగం వేశారా? అంటే అవుననే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలింతకీ ఏమి జరిగిందీ?
కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద కొందరు రౌడీలు బుధవారం దౌర్జన్యానికి దిగారు. క్రషర్ సిబ్బందిపై మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. పలువురు గాయపడ్డారు కూడా. దీంతో కావలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే.. క్రషర్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురి అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితోపాటు మరో నలుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వారిలో ఇద్దరు రౌడీ షీటర్లని పోలీసులు చెప్పారు. ఈ కేసు విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డిని హతమార్చేందుకు రామిరెడ్డి కుట్రలకు తెర తీశారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు క్రషర్ వద్దకు చేరుకున్నారు. వైసీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి రెచ్చగొట్టి కావ్యా కృష్ణారెడ్డిని హత్య చేయించేందుకు కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే స్వయంగా చేసిన సోషల్ మీడియా పోస్టులను పోలీసులకు చూపించారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.