భారత జాతి ముద్దు బిడ్డ రతన్‌ టాటా

మంగళగిరిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ప్రాంభించారు.;

Update: 2025-08-20 09:00 GMT

భారత జాతి ముద్దు బిడ్డ రతన్‌ టాటా అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను బుధవారం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు.. కానీ రతన్‌ టాటా మాత్రమం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగి ఇచ్చే వారని, సమాజ సేవ కోసం వాటిని ఖర్చు పెట్టేవారని పేర్కొన్నారు. భారత దేశానికి ఏదో ఒకటి మంచి చేయాలని రతన్‌ టాటా నిత్యం పరితపించే వారని అన్నారు. అలాంటి రతన్‌ టాటా ఆలోచనలు సజీవంగా ఉండాలనే సదుద్దేశంతో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

గతంలో ఐటీ గురించి ఎంతో పని చేశానని, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో కృషి చేశానని, కానీ నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త, ఎంటర్‌ప్రెన్యూర్‌ రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే నినాదంతో ప్రస్తుతం ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సరైన విధానాలను అవలంభిస్తే ఆదాయంతో పాటు సంపద సృష్టి కూడా జరుగుతుందన్నారు.
మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ వ్యాపారం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదని, విలువలు, మానవత్వంతో కూడినటువంటి ఓ పని అని రతన్‌ టాటా చాటి చెప్పారని అన్నారు. అలాంటి విలువలతో వ్యాపారి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన రతన్‌ టాటాకు నూతన ఆవిష్కరణలకు వేదికైన ఈ హబ్‌ను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. వినూత్నమైన ఆలోచనలతో వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలను కల్పించేందుకు ఈ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఒక కీలకమైన వేదిక అవుతుందని పేర్కొన్నారు. ఇన్నోవేషన్‌ ఆలోచనలకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పునాదులు వేసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags:    

Similar News