రేవంత్ కు బీసీ సంఘాల వార్నింగ్

బీసీ సంఘాల నేతల ఓపిక నశించినట్లుంది. అందుకనే వివిధ బీసీ సంఘల నేతలంతా సమావేశమై పెద్ద వార్నింగే ఇచ్చారు.

Update: 2024-08-23 09:53 GMT

బీసీ సంఘాల నేతల ఓపిక నశించినట్లుంది. అందుకనే వివిధ బీసీ సంఘల నేతలంతా సమావేశమై పెద్ద వార్నింగే ఇచ్చారు. నగరంలోని ఒక హోటల్లో బీసీల్లోని వివిధ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేకమంది అనేక అంశాలపై మాట్లాడినా కామన్ పాయింట్ ఏమిటంటే కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలుచేయాలని. కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు చర్యలు తీసుకోకపోతే వ్యవహారం చాలా దూరం వెళుతుందని నేతలు రేవంత్ కు సీనియస్ గానే వార్నింగ్ ఇవ్వటం అన్నీపార్టీల్లో చర్చనీయాంశమవుతోంది.

నేతలు డిమాండ్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ఏమిటంటే ఎన్నికలకు ముందు అంటే 2023, నవంబర్ 10వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలతో పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి ఏడాదికి రు. 20 వేల కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. అలాగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 23 శాతం రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతామని, బీసీల్లోని ప్రముఖ ఉపకులాలకు ప్రత్యేకించి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ ఇంకా చాలా హామీలిచ్చారు కాని పై మూడు హామీలు చాలా కీలకమైనవి.



 రేవంత్ హామీతో బీసీ సంఘాల్లో జోష్ పెరిగి కాంగ్రెస్ ను ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్రవ్యాప్తంగా తమ సంఘాల్లో తీర్మానాలు చేశారు. దానికి తగ్గట్లే 119 నియోజకవర్గాల్లో బీసీలంతా చాలావరకు కాంగ్రెస్ కు మద్దతుగా పనిచేయటమే కాకుండా ఓట్లుకూడా వేయించి గెలుసులో కీలకపాత్ర పోషించారు. ఇదంతా జరిగింది 2023 నవంబర్లో. అందరు ఊహించినట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి సుమారు తొమ్మిది మాసాలైంది. పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ సీఎం అయ్యారు. అయితే కామారెడ్డి సమావేశంలో ఇచ్చిన హామీలను మాత్రం మరచిపోయారు. దాంతో బీసీల సంఘాల నేతలకు బాగా మండుతోంది. అందుకనే పార్టీలకు అతీతంగా గురువారం మీటింగ్ పెట్టుకున్నారు.

ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతు రేవంత్ ను తప్పుపట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి బీసీలను అన్నీపార్టీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశజనాభాలో 51 శాతం ఉన్న బీసీలకు 23 శాతం రిజర్వేషన్ కూడా లేదని ఆవేధన వ్యక్తంచేశారు. బీహార్లో 5 రోజుల్లో కులగణను పూర్తిచేయటమే కాకుండా ఒక్కరోజులోనే సమగ్రసర్వే పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణాలో కూడా రేవంత్ అలా చేయాలని సూచించారు. కులగణనకు టైం పడుతుందని రేవంత్ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నట్లు చిరంజీవులు మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరు ఏకమై బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో కృషిచేయాలని సూచించారు.



 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ మాట్లాడుతు కులగణన చేయాలన్న రాహూల్ నిర్ణయాన్ని రేవంత్ రాష్ట్రంలో వెంటనే యాక్షన్లోకి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబసర్వే నిర్వహించి, నెలలోనే కులగణన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షపదవిని బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. 12వేలకుపైగా ఉన్న పంచాయితీల్లో 60 శాతం బీసీలే గెలుస్తారని జాజుల జోస్యం చెప్పారు. కులగణను చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మాజీమంత్రి శ్రీనివాసగైడ్ అన్నారు.

పార్టీలను పక్కనపెట్టి బీసీలంతా ఐకమత్యంగా ఉండాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపిచ్చారు. రాహూలు ఇచ్చిన పిలుపు ప్రకారమే కులగణన చేసి బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయంచేస్తుందని హామీ ఇచ్చారు. రేవంత్ ఢిల్లీ నుండి తిరిగొచ్చాక ఇదే విషయమై బీసీలతో ఆల్ పార్టీ మీటింగ్ పెడతారని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలుచేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనందగౌడ్ డిమాండ్ చేశారు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యిన తర్వాతే ఓబీసీలకు అత్యధిక మంత్రిపదవులు దక్కుతున్న విషయాన్ని గుర్తుచేశారు. సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతు బీసీల్లో ఇపుడున్న చైతన్యం ఇదివరకే ఉండుంటే తాను ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యుండే వాడినని వాపోయారు.

Tags:    

Similar News